Suryaa.co.in

Telangana

ఇది రేవంత్ అహంకారంపై చెంపదెబ్బ

– సుప్రీంకోర్టు స్టే హెచ్‌సియు అటవీ సంరక్షణపై గొప్ప విజయం
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్

హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.ఆర్. గవాయ్ గారు, ఆగస్టిన్ జార్జ్ మసీహ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాంచా గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలపై స్టే విధిస్తూ చారిత్రాత్మక ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

హైకోర్టు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలిక నిరోధం మాత్రమే కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతత్వానికి, అధికార దుర్వినియోగానికి ఒక గట్టి సమాధానం. శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై దుర్మార్గంగా లాఠీచార్జి చేయించిన ప్రభుత్వం, నిర్దోషులపై అక్రమ కేసులు బనాయించిన పోలీస్ వ్యవస్థకు ఇది న్యాయస్థానం ద్వారా సముచిత బుద్ధి.

ఈ మహోన్నత విజయాన్ని సాధించిన హెచ్‌సియు విద్యార్థులకు, అధ్యాపకులకు, పర్యావరణ పరిరక్షణ సంఘాలకు, విపక్ష పార్టీలకు , వట ఫౌండేషన్ లాంటి సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు. పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి వేధించినా, అబద్ధపు కేసులతో బెదిరించినా, విద్యార్థులు తమ ధైర్యాన్ని కోల్పోలేదు. వారి నిబద్ధతకు, ఆత్మస్థైర్యానికి, త్యాగానికి గర్వపడాల్సిన సమయం ఇది.

ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విద్యార్థులు, అధ్యాపకులు, సోషల్ మీడియా వాలంటీర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, పోలీసులు లాఠీచార్జి ద్వారా చేసిన దురాగతాలను అంగీకరించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. సుప్రీంకోర్టు స్టే ఈ ఉద్యమం సరైనదని, విద్యార్థుల పోరాటం న్యాయబద్ధమైనదని స్పష్టం చేసింది.

ఇది విద్యార్థుల, అధ్యాపకుల, పర్యావరణ ఉద్యమకారుల గెలుపు. ఇది అరణ్య దేవతలైన చెట్లకు, తీరని మొక్కలకు గెలుపు. ఇది మన జాతీయ పక్షి నెమళుకు, ఆ అడవిలో జీవించే జింకలకు, మన పక్షుల కిలకిలారావాలకు, నిశ్శబ్దంగా సంచరించే స్టార్ టార్టిల్స్‌కి లభించిన రక్షణ. ఇది శతాబ్దాలుగా నిలిచిన వాయువ్య శిలాసముదాయాలకు, హైదరాబాదును ప్రత్యేకంగా నిలిపే రాతి నిర్మాణాలకు, జీవవైవిధ్యానికి రక్షణగా నిలిచిన ఆత్మనిబద్ధతకు గెలుపు. పైగా, ఇది కేవలం ఒక ఉద్యమానికి కాదు, భవిష్యత్ తరాలకు మన ప్రకృతిని అందించాలనే మహత్తర సంకల్పానికి లభించిన విజయపతాకం.

ఈ ఉద్యమానికి అండగా నిలిచి, విద్యార్థుల గొంతును దేశవ్యాప్తంగా వినిపించిన మీడియా, సామాజిక మాధ్యమాల యోధులకు కృతజ్ఞతలు. ఈ సందర్భంలో తల్లి ప్రకృతి రక్షణకు అండగా నిలిచిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి, దురాగ్రహానికి చెంపపెట్టు. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి. “ప్రకృతిని కాపాడే గొంతులు ఎన్నటికీ మౌనంగా ఉండవు – న్యాయం ఎప్పుడూ విజయం సాధిస్తుంది.”

LEAVE A RESPONSE