Suryaa.co.in

Editorial

ఇది జానారెడ్డి సర్వే!

– జానారెడ్డి.. ఇంకా ఎంతమంది బీసీల రక్తం తాగుతావ్?
– కేసీఆర్ సర్వేనే కరెక్ట్
– కాంగ్రెస్ సర్కారు బీసీలను మోసం చేసింది
– కాంగ్రెస్ సర్కారుపై సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు
– జానారెడ్డిపై విమర్శలకు భగ్గుమంటున్న నల్లగొండ రెడ్లు
– మహబూబ్‌నగర్ రెడ్లను మల్లన్న ఎందుకు విమర్శించడం లేదు?
– రేవంత్‌ను విడిచి జానారెడ్డిపై విమర్శల వెనుక వ్యూహ మేమిటి?
– కమిటీలో ఉన్న బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బీసీలకు ద్రోహం చేసినట్టేనా?
– మల్లన్నకు పార్టీలో ఎవరి మద్దతు ఉంది?
– పీసీసీ అధ్యక్షుడు చర్యలు తీసుకోరా?
– తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కుల’కలం

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ కాంగ్రెస్ కార్చిర్చు రగులుకుంది. ఒక్కరోజు క్రితమే హన్మకొండ వేదికగా రెడ్లపై విరుచుకుపడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. తాజాగా తన సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్ వేదికగా సీనియర్ నేత జానారెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన ఆరోపణలు కాంగ్రెస్‌ను కుదిపేస్తోంది. ఇది జానారెడ్డి సర్వే. దొంగ సర్వే. కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్టు అంటూ మల్లన్న చేసిన ఆరోపణలు.. బీఆర్‌ఎస్‌కు బ్రహ్మాస్త్రంగా మారగా, కాంగ్రెస్ మాత్రం బడుగుల ముందు ముద్దాయిలా నిలబడాల్సిన విషాద పరిస్థితి. సొంత పార్టీనే అస్త్రశస్త్రాలతో విరుచుకుపడతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి-పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ప్రేక్షకపాత్ర పోషించాల్సిన దుస్థితి.

అయితే కులగణనకు ఆదేశాలిచ్చి, కమిటీ వేసిన సీఎం రేవంత్‌రెడ్డిని గాని, కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గాని విమర్శించకుండా.. మల్లన్న కేవలం జానారెడ్డిని మాత్రమే విమర్శించడం వ్యూహాత్మకమేనని, దీని వెనుక పెద్దతలలు ఉన్నాయన్న వ్యాఖ్యలు, కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కులగణన కమిటీలో జనారెడ్డి సభ్యుడు కానప్పుడు, సబ్ కమిటీ నివేదికలో ఆయన సంతకం లేనప్పుడు.. జానారెడ్డిని ఎందుకు బాధ్యుడిని చేస్తున్నారో అర్ధం కావడ ం లేదని సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

బహుశా ఎమ్మెల్సీ మల్లన్నకు..సీఎం రేవంత్‌రెడ్డిని నేరుగా పేరు పెట్టి విమర్శించే ధైర్యం లేకనో, లేదా అనేక మొహమాటాల కారణంగానో విధాన నిర్ణయం తీసుకున్న ఆయనను విడిచిపెట్టి, అసలు కమిటీతో ఎలాంటి సంబంధం లేని జానారెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడంపె,ై పార్టీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ నేతలు మల్లన్నను వ్యతిరేకించినా.. రేవంత్ పట్టుపట్టి టికెట్ ఇప్పించిన కృతజ్ఞత, మల్లన్న మౌనానికి కారణం అయి ఉండవచ్చ’’ని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

‘‘ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వద్ద జరిగిన కొన్ని సమావేశాల్లో జానారెడ్డితో పాటు బీసీ నేత, మాజీ ఎంపి కేశ వరావు కూడా హాజరయ్యాయని, మరి మల్లన్న ఆయనపై ఎందుకు విమర్శలు చేయలేదన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. అసలు కమిటీలో ఉన్న బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బీసీలకు ద్రోహం చేసినట్లేనా? పొన్నంను కూడా మల్లన్న అనుమానిస్తున్నట్లే కదా? మల్లన్న వ్యాఖ్యలపై కమిటీ సభ్యుడైన పొన్నం ప్రభాకర్ స్పందించకపోవడమే ఆశ్చర్యంగా ఉంద’’న్న వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

‘‘ కేసీఆర్ చేసిన సర్వేనే వందశాతం కరెక్ట్. ఇది బోగస్ సర్వే. ఇది జానారెడ్డి సర్వే. సిగ్గుశరం ఉండాలి. 21 లక్షలమంది బీసీలను చంపడానికి! కేసీఆర్ సర్వే చేసినప్పుడు ముంబయి, దుబాయ్‌లో ఉన్నోడు కూడా వచ్చి సమగ్ర సర్వేలో పాల్గొన్నాడు. 21 లక్షలమంది బీసీలు ఏరి? మేం సంకలు గుద్దుకోవాలా మీరు సర్వే చేసినందుకు? ఇది దేశానికి మార్గదర్శకమైన సర్వేనా? ముఖ్యమంత్రి గారూ.. 21 లక్షలమంది చచ్చిపోయారా? వాళ్ల శవాలు ఎక్కడున్నాయ్?

బీసీల జనాభా తగ్గింది. ఎస్సీల జనాభా తగ్గింది. కేవలం ఓసీలే 16 లక్షలమంది పుట్టారు. జానారెడ్డి ఎక్కడ చర్చకు కూర్చుందామో చెప్పండి. నేను వస్తా. ఇంకా ఎంతమంది బీసీల రక్తం తాగుతావ్? ఈ సర్వే మొదలయినప్పటి నుంచి తెరవెనుక నువ్వు ఏమేం చేశావో మాకు తెలుసు. డేటాను మేనిప్లేట్‌చేసిన డ్రామా మాకు తెలుసు. 2014లో కోటి 85 లక్షలమంది ఉన్న బీసీలు, ఇప్పుడు కోటి 64 లక్షలకు వస్తారా? ఎటుపోయారు ఆ 21 లక్షల మంది బీసీలు? ఈ ప్రభుత్వం బీసీలను నయవంచన చేసింది. ఇది చీటింగ్. ఇంత బోగస్సా?

ఈడబ్ల్యుఎస్ వాళ్లకోసం దొంగలెక్కలు. ఓసిల రిజర్వేషను కాపాడుకునేందుకు వేసిన దొంగలెక్కలు. ఇదేనా రాహుల్‌గాంధీ చెప్పింది’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సీఎం రేవంత్ సర్కారుపై తిరుగుబాటు చేశారు. తీన్మార్ మల్లన్న వీడియో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీసీల ముందు ముద్దాయిగా నిలబెట్టింది.

కాగా తీన్మార్ మల్లన్న ఈసారి ఏకంగా సీనియర్ నేత జానారెడ్డి లక్ష్యంగా చేసిన ఆరోపణలపై, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కులగణన కమిటీతో సంబంధం లేని జానారెడ్డిని విమర్శించిన మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకోరా? బహిరంగవేదికలపై రెడ్లు, ఓసీలపై విరుచుకుపడుతున్న తీన్మార్ మల్లన్నకు, పార్టీలో ఎవరి దన్ను లేకపోతే ఆ స్థాయిలో చెలరేగడం సాధ్యమా? ప్రత్యేకించి నల్లగొండ రెడ్లనే తొలినుంచి లక్ష్యంగా చేసుకుని, మహబూబ్‌నగర్ రెడ్లను విస్మరించడం వ్యూహాత్మకమా? అసలు మల్లన్నకు హెలికాప్టర్‌లో తిరిగేంత ఆర్దిక స్తోమత ఎక్కడిది? అది ఎవరు సమకూర్చారు? మల్లన్నకు కాంగ్రెస్‌లో కీలకనేత మద్దతు లేకపోతే, ఈ స్థాయిలో చెలరేగడం సాధ్యమవుతుందా?

అసలు సొంత పార్టీ ప్రభుత్వ విధానాలనే బహిరంగంగా విమర్శిస్తుంటే.. పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఉందా? లేదా? రేపు మరొక ఓసీ నేత మల్లన్న మాదిరిగానే.. బీసీ, ఎస్సీ, మైనారిటీలను ఇదేవిధంగా బహిరంగ వేదికపై విమర్శిస్తే వారిని కూడా ఇలాగే వదిలేస్తారా? అని జానారెడ్డిని సమర్ధించే వర్గం పీసీసీ చీఫ్‌ను నిలదీస్తోంది.

వ్యవహారం ఇప్పుడు అటు సీఎం రేవంత్‌రెడ్డికి తలనొప్పిలా పరిణమించింది. గత కొద్దిరోజుల నుంచి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాకుండా, స్వతంత్ర నేతగా మాట్లాడుతున్నప్పటికీ సీఎం రంగంలోకి దిగి జోక్యం చే సుకోకపోవడంపై, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం తన మౌనాన్ని కొనసాగిస్తే.. తీన్మార్‌ను ఆయన ప్రోత్సహిస్తున్నారన్న తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం లేకపోలేదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

పైగా మహబూబ్‌నగర్ రెడ్లను విడిచిపెట్టి ప్రత్యేకించి నల్లగొండ రెడ్లను విమర్శించడం, అందులో సీనియర్ నేత జానారెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం సహజంగానే అలాంటి అనుమానాలకు తావిస్తోందని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రెడ్డి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

జానారెడ్డితో సన్నిహిత సంబంధాలు, ఆయన కుమారులతో స్నేహసంబంధాలున్న సీఎం రేవంత్‌రెడ్డి.. గురువులాంటి జానారెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్సీ మల్లన్న బహిరంగ ఆరోపణలు చేసినా జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ‘‘మరి మల్లన్న మహబూబ్‌నగర్ రెడ్లను ఎందుకు విమర్శించడం లేదు? అక్కడ బీసీలకు న్యాయం జరుగుతోందా? నల్లగొండ జిల్లాలో పార్టీని నిలబెట్టేందుకు మేం ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు చేశామో మీకు తెలుసా? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా రెడ్ల డబ్బులు, సహకారం లేకుండానే మల్లన్న గెలిచారేమో గుండెలపై చేయి వేసుకుని చెప్పమనండి చూద్దాం. మల్లన్న తీరు మాకు నచ్చకపోయినా, కేవలం రేవంత్ చెప్పాన్న కారణగానే ఆయన గెలుపుకోసం పనిచేశాం. ఇప్పుడు ఆయన మా మీద కత్తులు దూస్తుంటే, రేవంత్‌రెడ్డి మౌనంగా ఉండటం దారుణ’’మని ఓ రెడ్డినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలోనే దీనిపై స్పందిస్తామన్నారు.

పార్టీ నుంచి వెళ్లే వ్యూహమా?

కాగా తీన్మార్ మల్లన్న గత కొద్దికాలం నుంచి బీసీ కార్డుతో రెడ్లు-అగ్రులాల వ్యతిరేక వైఖరి తీసుకుని.. బహిరంగంగా వారిపై తిరుగుబాటు చేయడం వెనుక, వ్యూహాత్మక అడుగులు ఉన్నాయన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ నుంచి బయటకు వచ్చేందుకే, మల్లన్న ఈ మార్గం ఎంచుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అందుకే పార్టీ-ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడటం ద్వారా, కాంగ్రెస్ నుంచి బహిష్కరణ కోరుకున్నట్లు కనిపిస్తోందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అప్పుడు తెలంగాణలో రెడ్లను ఎదుర్కొని, వారి చర్యలకు బలైన బీసీ నేతగా ఆ వర్గాల్లో గుర్తింపు పొందడమే మల్లన్న అసలు వ్యూహంగా కనిపిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు.

LEAVE A RESPONSE