Suryaa.co.in

Telangana

ఇది కేసీఆర్ ఘనత

– ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ
– తాజాగా 4 మెడికల్ కాలేజీలకు అనుమతి రావడంతో 34కు చేరిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య
– తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే
– 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా 29 మెడికల్ కాలేజీల ఏర్పాటు
– 2014 నాటికి 850 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు, నేడు 4090 సీట్లు
– ఏటా పది వేల మందికి పైగా డాక్టర్లను తయారు చేసే రాష్ట్రంగా తెలంగాణ
– జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న కేసీఆర్ కల సాకారం
– మెడికల్ కాలేజీల అనుమతులు లభించిన జిల్లాల ప్రజలకు శుభాకాంక్షలు
-మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయం. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత నెలలో మెడికల్ కాలేజీల అనుమతి పొందిన ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు.

తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైంది. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దేశంలోనే రికార్డ్ నెలకొల్పింది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కోసం గత కేసీఆర్ ప్రభుత్వం నిధులు, భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసింది.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను కేవలం నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే గత నెల ఎన్ఎంసి నుండి అనుమతులు లభించాయి. నిబంధనల ప్రకారం మౌలిక వసతుల ఏర్పాటు, బోధనా సిబ్బంది నియామకంలో ప్రభుత్వం విఫలమైందని ఎన్ఎంసి అనుమతులు నిరాకరించింది.

జరిగిన తప్పును ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ఎంసి నిబంధనల మేరకు అన్ని మౌలిక వసతులు, బోధన సిబ్బందిని సమకూర్చుకుంటామని అనుమతి కోరుతూ కేంద్రానికి అప్పీల్ చేసింది. దీన్ని పరిశీలించిన కేంద్రం అప్పీల్ అంగీకరించి, 4 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని ఎన్ఎంసికి మార్గనిర్దేశం చేసింది.

దీంతో ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం నాలుగు కాలేజీల్లో 200 సీట్లు ఈ అకడమిక్ ఇయర్ కు అందుబాటులోకి రానున్నాయి. కొత్త సీట్లతో కలుపుకొని తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మొత్తం సీట్ల సంఖ్య 4,090 కు చేరుకుంది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090 సీట్లకు చేరింది. అంటే తొమ్మిదేళ్ళ కాలంలో 5 రెట్లు పెంచింది.ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ఏటా పదివేల మంది పైగా డాక్టర్లను తయారుచేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.

ఎంబీబీఎస్‌ సీట్లలో లక్ష జనాభాకు 22 సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం.సమైక్య రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

తద్వారా పేద ప్రజల చెంతకే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు, తెలంగాణ బిడ్డలు వైద్య విద్య చదివే అవకాశాలను గణనీయంగా పెంచారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే, తెలంగాణకు ఇక్కటి కూడా ఇవ్వలేదు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం.

అయినప్పటికీ రాష్ట్ర సొంత నిధులతోనే కొత్తగా మొత్తం 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వేగవంతమైన చర్యలు తీసుకున్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏండ్లలో రెండు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు జరిగితే, స్వరాష్ట్రంలో 9 ఏండ్లలో 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది కేసీఆర్ ఘనత, బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఘనత.

తెలంగాణ రాష్ట్రం వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మకమైన పురోగతి. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించింది.తెలంగాణ పిల్లలు వైద్య విద్య కోసమని లక్షలు ఖర్చు చేసి, చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్ వంటి దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు.

విద్యార్థులు మాతృ భూమికి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఒకవైపు ఎంబీబీఎస్‌ చదవాలనే ఆశ, మరోవైపు అర్థం కాని భాష, దేశం కాని దేశంలో గోస. ఇదంతా ఒకనాడు. కొత్తగా వచ్చిన మెడికల్‌ కాలేజీలు, లోకల్‌ రిజర్వేషన్‌ వల్ల డాక్టర్‌ చదువాలనుకునే తెలంగాణ విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి.

వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్లకు నిలయంగా మారిన తెలంగాణ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైట్ కోట్ రెవల్యూషన్ కు నాంది పలికింది.
ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన వారు రాష్ట్ర ప్రజలకే కాదు, వివిధ దేశాల్లో వారు సేవలందించబోతున్నారు. తద్వారా తెలంగాణ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయబోతున్నారు.సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా, వైద్య విద్య హబ్ గా ఎదిగిందని చెప్పేందుకు గర్వ పడుతున్నాను.పెరిగిన మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ కావాలనే కలను సహకారం చేసుకోవాలని కోరుతున్నాను.

మెడికల్ కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని, మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూస్తూ ప్రతి ఏటా ఎన్ఎంసి అనుమతులు (రెన్యువల్) కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా వైద్య విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

LEAVE A RESPONSE