– కండువా మార్చేసిన బుచ్చి పదో వార్డు వైసీపీ కౌన్సిలర్ మల్లారెడ్డి
– టీడీపీ నేతల టచ్లో మరో ముగ్గురు కౌన్సిలర్లు
– ప్రసన్న నియంతృత్వ ధోరణికి నిరసన
– నిరాశ, నిసృహలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న శిబిరం
– వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న బుచ్చి వైసీపీ సీనియర్లు
బుచ్చిరెడ్డి పాళెం: బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నిక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి పరాభవాన్ని మిగల్చనుంది. విప్ జారీ చేసి వైస్ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని ప్రసన్న కన్న కలలు భగ్నమయ్యాయి. బుచ్చి పట్టణ వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి జై కొడుతూ సైకిల్ ఎక్కేస్తున్నారు.
బుచ్చి నగర పంచాయతీలో జరగనున్న వైస్ చైర్మన్ ఉప ఎన్నికలో నిన్నటి దాకా అభ్యర్థిని బరిలో దింపుతానని ప్రగల్భణాలు పలికిన ప్రసన్న ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు. వైసీపీ కౌన్సిలర్ల వలసలు చూశాక నిన్నటి దాకా విప్ జారీ పై హడాహుడి చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న శిబిరం డీలా పడి పోయింది.
వైసీపీ సీనియర్ నాయకులు ఇప్పగుంట మల్లారెడ్డి నేతృత్వంలో పదో వార్డు కౌన్సిలర్ బెళుం మల్లారెడ్డి తో పాటు బుచ్చి మండల వైసీపీ కన్వీనర్ టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి, సీనియర్ నాయకులు చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కంఠం నరసింహులు, ఆకే రవి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ తాము టీడీపీ బాట పట్టామన్నారు. వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో బుచ్చిరెడ్డి పాళెం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.