Suryaa.co.in

Political News

టీడీపీలో చేరికకు పవన్ కు ఇదే సరైన సమయం!

– చిరు లా ‘ వన్ టైమ్ వండర్ ‘ కాకూడదనుకుంటే …

అవును . తెలుగుదేశం పార్టీ లో జనసేన ను విలీనం చేయడానికి – రాజకీయం గా కూడా – పవన్ కళ్యాణ్ కు ఇదే తగిన సమయం.
పవన్ కళ్యాణ్ ….రాజకీయం గా తన సత్తా చూపించారు . కీలకమైన సందర్భాలలో అనూహ్యమైన సంయనం పాటించారు . తన రాజకీయ ప్రయాణాన్ని గతుకులు – గుంటల రోడ్డు పట్టించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన చేగొండి హరేరామ జోగయ్య లాటి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. జనసేన హార్డ్ కోర్ జనం ఎప్పుడు ఏమి మాట్టాడాలో…. ఏమి మాట్లాడ కూడదో దిశా నిర్దేశం చేశారు. తన ఉనికిని, రాజకీయ ప్రయాణాన్ని పట్టించుకోక తప్పని పరిస్థితులను తెలుగుదేశం పార్టీ కి కల్పించారు .

పవన్ కళ్యాణ్ ‘ ఏమిటో ఎవరికి తెలిసినా …తెలియక పోయినా ….; వైసీపీ వారికి తెలిసింది . పై నుంచి కింది వరకు నాయకులు – పవన్ కళ్యాణ్ టీడీపీ వైపుకు వెళ్లకుండా చూడడానికి విశ్వప్రయత్నం చేశారు.
చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయడానికి కాపుల్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు . ప్యాకేజీ స్టార్ తప్ప , పవర్ స్టార్ కాదు అన్నారు . ఏటా కార్లు మార్చినట్టు భార్యల్ని పవన్ కళ్యాణ్ మార్చుతున్నారని ‘ ఆ ‘ ఏక పత్నీవ్రతులు,ఏక పత్నీవృత సలహా దారులు అన్నారు .

ఈ విమర్శల జడివాన ను పరిశీలించిన పవన్ కు , తాను వెడుతున్న మార్గం సరియైనదే అన్న నమ్మకం మరింతగా బలపడింది . లేకపోతే , స్టువర్టుపురం గ్యాంగులు లాగూలు ఎందుకు తడుపేసుకుంటాయి !? వారి విమర్శలు పెరిగేకొద్దీ; పవన్ కళ్యాన్ లో సహనం పెరుగుతూ వచ్చింది.

2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ప్రకటన చేస్తే ; 2024 ఎన్నికల ముందు నాటి వరకు ….పవన్ కళ్యాణ్ కు రాజకీయం గా దారీ…తెన్నూ కనపడలేదు .

రాజకీయాలలో గోచీ …మొలతాడు లేనివాళ్ళు శాసనసభ , పార్లమెంట్ లో అడుగుపెడుతుంటే ; లక్షలాది మంది అభిమానులు ,వేలాదిమంది అనుచరులు కలిగిన తాను కనీసం శాసనసభ మొహం కూడా చూడలేకపోవడం పవన్ కల్యాణ్ ను అమితంగా వేదనకు గురిచేసింది.

2024 ఎన్నికల్లో తాను అసెంబ్లీ ప్రవేశం చేయడం మాత్రమే గాక ; తన పార్టీ నుంచి కనీసం ఓ పాతిక మంది నాయకులను “అసెంబ్లీ ప్రవేశం ” చేయించాలని లక్ష్యం గా పెట్టుకుని , ఓపికగా ….సహనం గా … ధృడ దీక్షతో ….సివిల్స్ పరీక్షలకు వెళ్ళే అభ్యర్థులు ఏకాగ్రత తో కృషి చేసినట్టుగా …. లక్ష్యం దిశగా ఆయన ఒక్కోడుగు ముందుకు వేసుకుంటూ వెళ్లారు .

తెలుగు దేశం తో కలిసి , జగన్ వ్యతిరేక ఓటు ను చీలనివ్వబోను అంటూ పవన్ కళ్యాణ్ ఎన్ని భీషణ ప్రతిజ్ఞలు చేసినప్పటికీ ; తెలుగు దేశం వైపు నుంచి స్పందన లేదు .

ఔను….కాదు …. అని స్పందించిన టీడీపీ నాయకుడు కనిపించలేదు . మరోపక్కన….”టీడీపీ తో ఎందుకు ? మనకే బోలెడన్ని ఓట్లు ఉంటే….” అంటూ కోవర్టు బ్యాండ్ మేళం హోరెత్తుతోంది . అయినప్పటికీ ,పవన్ కళ్యాణ్ తొణక లేదు . బెణక లేదు .

జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న తన వ్యూహం పై టీడీపీ స్పందించే ‘ శుభ సమయం ‘ కోసం పవన్ కళ్యాణ్ ఓపికగా వేచివున్నారు . ‘ ఆ ‘ సమయం ….గత ఏడాది యీ నెలలోనే వచ్చింది . 2023 సెప్టెంబర్ 9 న అప్పటి ముఖ్యమంత్రి జగన్ , చంద్రబాబు ను “ఎత్తించి “(అంటే అరెస్టు చేయించి అని అర్థం.అది ఫాక్షనిస్ట్ భాష లే )…రాజమండ్రి సెంట్రల్ జైలు కు పంపించారు .

ఈ హఠాత్పరిణామానికి, టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ స్థాణువుల్లా బిగుసుకుపోయాయి. జగనోలీసులు(జగన్ పోలీసులు అని అర్థం. సమాసం తప్పే గానీ , సర్దుకు పోదాం) పూర్తిగా బరి తెగించి ఉన్నారు. ఈ “పరమాక్రమ అరెస్టు” ను ఎవరు ఖండిస్తే , వారిని ” ఎత్తేయ”డానికి సిద్ధం గా ఉన్నారు .తమ “వెంట్రుక పీకేవాడు ఎవడన్న….జగనన్న ఉండగా…”అనే నూరు శాతం ధీమా లో వారు ఉన్నారు.

ఆ “స్మశాన నిశ్శబ్ద” వాతావరణ పరిస్థితుల్లో ….పవన్ కళ్యాణ్ ఏకాయెకిని రాజమండ్రి వెళ్లారు . అక్కడే ఉన్న నారా లోకేష్ ను , నందమూరి బాలకృష్ణ ను ఓదార్చారు . ఆ క్షణం నుంచే జనసేన… తెలుగుదేశం తో కలిసి అడుగులో అడుగు వేస్తుందని ప్రకటించారు . లోకేష్ , బాలకృష్ణ ఈ ప్రకటపై ఏమీ కామెంట్ చేయలేదు .

జైలు లోపలకు పవన్ కళ్యాణ్ వెళ్లి, చంద్రబాబును కలిసి, “నేనున్నాను .. మీ వెంట నడుస్తాను” అని హామీ ఇచ్చారు . పవన్ హామీకి చంద్రబాబు పరవశించిపోయారు . తెలుగు రాజకీయాలు అక్కడినుంచి కీలక మలుపు తిరిగాయి . టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ తేరుకున్న పరిస్థితులు కనిపించాయి .

చంద్రబాబు జైలు నుంచి బెయిల్ పై విడుదల సందర్భంగా , ఈ “మారిన ” రాజకీయ వాతావరణం కళ్ళకు కట్టినట్టు కనిపించింది . రాజమండ్రి జైలు నుంచి విజయవాడ – ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకోడానికి , చంద్రబాబు కు దాదాపు 14 గంటల సమయం పట్టింది . మేటర్ అప్పుడే డిసైడ్ ఐపోయింది .

అయితే , జనసేన శ్రేణుల్లో కొత్త డిమాండ్లు పుట్టుకు వచ్చాయి . తమ వల్లే టీడీపీ కి ఇంత జోష్ వచ్చిందని , సగం సీట్లు తమకు ఇవ్వాలని కొందరు అందుకుంటే ; సీ ఎం పదవి తమకు ఇవ్వాలని కొందరు హంగామా చేశారు. పవన్ కళ్యాణ్ తొణకలేదు .చాలా స్పష్టత తో ముందుకు వెళ్లారు .

చంద్రబాబు నాయుడు తో “వ్యక్తిగత” స్థాయిలో అద్భుతమైన అవగాహన ఏర్పాటు చేసుకున్నారు . ఎన్ని సీట్లకు జనసేన పోటీ చేయబోతున్నదనే విషయం అత్యంత గోప్యం గా ఉంచారు. కనీసం పోటీ చేసే స్థానాల పేర్లు కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.

వీళ్ళిద్దరూ ఎక్కడ టై అప్ అయిపోతారో అని మరోపక్క చేగొండి హరిరామజోగయ్యలు విపరీతం గా వర్రీ అయిపోతూ….పొద్దున్నా, మధ్యాహ్నం , సాయంత్రం ప్రెస్ మీట్లు . మీడియాలో ఓ వర్గం ఈ కోవర్టు బ్యాచ్ కి ఊదర. వీర పబ్లిసిటీ లు . అయినప్పటికీ , పవన్ కళ్యాణ్ ఊహాతీత సంయమనం తో వ్యవహరించారు . ఎక్కడికక్కడ తగ్గారు .

బీజేపీ తమతో లేకపోతే ఎంత ప్రమాదమో ముందుగానే అంచనా వేసి ; ఒకటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి , దానిని కూడా తమ ఆవరణ లోకి లాక్కొచ్చి o గుంజకు కట్టేసి , దానికి వేయాల్సిన మేత వేయించారు. ఇందుకోసం , తనకు కేటాయించిన సీట్లను కూడా వదిలేసుకున్నారు. తాను పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యను తగ్గించుకోవడం పై జనసేన లో వ్యక్తమైన ముక్కులు ….,మూలుగులపై పవన్ కళ్యాణ్ నేరుగానే స్పందించారు .

” ఎన్ని సీట్లకు పోటీ చేశామన్నది కాదు కొశ్శను.ఎన్ని గెలిచామన్నది పాయింటు ” అని అసహన వాదుల నోళ్ళు మూయించారు . చివరకు 21 అసెంబ్లీ , రెండు లోక్సభ స్థానాలకు పోటీ చేసి ; అన్నీ గెలిచారు.

ఆయన లక్ష్యం నెరవేరింది . ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోకి కుడి కాలు పెట్టారు . తన పార్టీ వారు మరో ఇరవై మందితో సభాప్రవేశం చేయించారు .ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తో సమాన స్థాయి , హోదా అన్నంతగా ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ; తెలుగు రాజకీయాలలో చరిత్ర సృష్టించారు .

అక్కడితో ఆయన ఆగలేదు . చంద్రబాబు నాయుడి పట్ల పవన్. కళ్యాణ్ అనూహ్యమైన విధేయత , గౌరవం ,వినయం ప్రదర్శిస్తూ; “కూటమి ధర్మం”కు ఒక సరికొత్త నిర్వచనం చెబుతున్నారు .

పార్టీ స్థాపించిన పదేళ్ల తరువాత ఇప్పుడు… పూర్తి స్థాయి రాజకీయ నేత గా …ఆయన తెలుగు ప్రజలకు దర్శనమిస్తున్నారు . ఒక ముక్కలో చెప్పాలి అంటే ….చంద్రబాబు నాయుడు తర్ఫీదు లో …శిక్షణలో …. పవన్ కళ్యాణ్ …ఒక పూర్తిస్థాయి నేతగా తనను తాను మలుచుకున్నారు.

ఇప్పటి వరకు ఆయన చేసిన రాజకీయ ప్రయాణం ఒక ఎత్తు . ఇక ముందు చేయబోయే ప్రయాణం ఒక ఎత్తు. రాజకీయం గా ఒక బలమైన ” లాంచింగ్ ప్యాడ్” వద్దకు ఆయన చేరారు. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని కొనసాగించడానికి , జనసేన ను ఆయన తెలుగుదేశం లో బేషరతుగా విలీనం చేయాలి . చంద్రబాబు చేతులను మరింత బలోపేతం చేయాలి . రాజకీయం గా మరింతగా తెలుగువారికి దగ్గరవ్వాలి . ఎందుకంటే ;సంఘ వ్యతిరేక శక్తులపై ఏకోన్ముఖ రాజకీయ పోరాటం జరగాలి .

ఈ శక్తులు చాలా చురుకుగా కదులుతున్నాయి. వాటి చేతుల్లో ‘ ధన వాములు ‘ (అంటే గడ్డి వాముల్లాగా ) ఉన్నాయి. బ్యాండ్ మేళాలు ఉన్నాయి. నిజమా …అసత్యమా అనే పట్టింపు లేదు . బకెట్లు కొద్దీ కుమ్మరించడమే వీటి పని .అన్నిటికీ రేట్లు ఉంటాయి.

ఈ శక్తులు ఏ కార్యక్రమానికి వచ్చి…. ఎన్నిసార్లు చప్పట్లు కొట్టాలో ముందే డిసైడ్ అయిపోతుంది అంటారు , విషయాలు తెలిసిన వారు. ఏది , ఎప్పుడు , ఎక్కడ ,ఎలా చేయాలో ఈ శక్తులకు అద్భుతమైన స్పష్టత ఉంది .ఈ శక్తులను తట్టుకుంటూ , ప్రజల అంచనాలను అందుకుంటూ పాలన సాగించడం చిన్న విషయం కాదు .

చంద్రబాబు ఇప్పటికే ఒత్తిడి లో ఉన్న భావనలు రాష్ట్రం లో వ్యాపిస్తున్నాయి . చాలా నిర్ణయాలు ….త్వర త్వరగా , ధృడం గా తీసుకోలేకపోతున్నారని కూడా పరిశీలకులు భావిస్తున్నారు .

ఆయన ‘ పుట్టు వ్యతిరేకుల’కు పాలనాంశాలు ముఖ్యం కాదు  రాజకీయాలు ముఖ్యం . చంద్రబాబు ను అల్లరి చేయడం ముఖ్యం. ఇప్పటికే చురుకుగా వ్యవహరిస్తున్న ఈ శక్తులు ముందు ముందు ఎలా వ్యవహరిస్తాయో అంచనా వేయడం కష్టం కాదు . అందుకే , పవన్ కళ్యాణ్ తో పాటు ; ఆయన అభిమానులు , ఓటు బ్యాంక్ కూడా టీడీపీ లో విలీనం అవ్వాలి . తెలుగు దేశం పార్టీలో భాగం అవ్వాలి .

చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి పెడితే ; పవన్ కళ్యాణ్ ….రాజకీయాలపై దృష్టి పెట్టాలి . సమాజం నుంచి కలుషిత రాజకీయాన్ని తుడిచిపెట్టడానికి ఏమి చేయాలో ….అది చేయాలి . ఆయన, ఆయన పరివారం టీడీపీ లో చేరితేనే ఇది సాధ్యం అవుతుంది .
రాష్ట్ర క్షేమం దృష్ట్యా….;చంద్రబాబు నాయుడు – పవన్ కళ్యాణ్ మధ్య ఈక్వేషన్ మరో మెట్టు ఎక్కాలి . ప్రజలు స్వాగతిస్తారు . పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం సజావుగా సాగుతుంది .భావి తరాలకు మేలు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా , చిరంజీవి లాగా ” వన్ టైమ్ వండర్” గా మిగిలిపోగూడదనేదే ఆకాంక్ష .

– భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE