– మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
నెల్లూరు: క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి వైఎస్ జగన్ అని అన్ని వర్గాలను ఆదుకునేలా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనడం చాలా హాస్యాస్పదం ఉందని చినరాజప్ప పేర్కొన్నారు.అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని, ఇతర రాష్ట్రాల్లోకన్నా ఏపీలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయని రాజప్ప విమర్శించారు. పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని, అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.అధికారం ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని, పెట్రోల్ ధరలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలని రాజప్ప డిమాండ్ చేశారు.
ఓ పక్క విధ్వంసం.. మరో వైపు ప్రజలపై భారం.. ఇదే జగన్ సంక్షేమ పాలన అని రాజప్ప దుయ్యబట్టారు. యువతకు సరియైన ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వ విధానాల వల్ల వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది అని రాజప్ప పేర్కొన్నారు. ఆకాశాన్ని అంటిన నిత్యావసర వస్తువుల ధరలతో వైసిపి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచింది. పెట్రోల్, బ్రాండెడ్ మద్యం కోసం ఇక్కడి ప్రజలు సరిహద్దులు దాటుతుంటే.. గంజాయి కోసం మాత్రం దేశమంతా ఏపీ వైపు చూస్తోందని రాజప్ప పేర్కొన్నారు.
చక్కగా చదువుకోవాల్సిన స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు జగన్ ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే సజ్జలకు సంక్షేమం కనపడటం చాలా విడ్డూరంగా ఉందని రాజప్ప విమర్శించారు.