Suryaa.co.in

Andhra Pradesh

ఇది రాజధాని ప్రజల తొలి విజయం

– ప్రభుత్వంపై మలి విజయానికి ఉద్యమకారులు సిద్ధం కావాలి
– రైతు మహిళలు, బహుజన కులాల సుదీర్ఘ ఉద్యమ ఫలితం
– ప్రభుత్వాలు మారితే రాజధాని మార్చుకోవచ్చు అన్న మూడు రాజధానుల సిద్ధాంతానికి చెంపపెట్టు
– అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

హైకోర్టులో ప్రజా రాజధాని అమరావతికి అనుకూలంగా తీర్పు రావడం పట్ల అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమరావతి రక్షణ కోసం న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లకు, శ్రమించి పని చేసిన న్యాయవాదులకు,తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు ఆయన ఊద్యమాభివందనాలు తెలిపారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని మార్పు పై ప్రభుత్వానికి శాసన అధికారం లేదని, రాజధాని భూములను రాజధాని అభివృద్ధికే కేటాయించాలని,భూములిచ్చిన రైతులకు ప్లాట్లు సత్వరం ఇవ్వాలని, ఎప్పటికప్పుడు అభివృద్ధి నివేదికను హైకోర్టుకు తెలపాలని ఇచ్చిన తీర్పు ముందుగా ఊహించినదే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం బెట్టుకు పోకుండా న్యాయస్థానం తీర్పును స్వాగతించాలని, మూడు రాజధానులు ఆలోచన విరమించుకోవాలని,ఇప్పటికైనా ఏకైక రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు .

ప్రజా రాజధాని అమరావతిపై ఇది ఉద్యమకారుల తొలి విజయం అని , రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైకాపాను సాగనంపేందుకు మలి ఉద్యమానికి ఉద్యమకారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE