దక్షిణాది టాకీ తొంబై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. దేశ టాకీకి కూడా తొంబైనాలుగేళ్లే. దేశంలో వచ్చిన తొలి టాకీ ‘ఆలమ్ ఆరా’ 14/3/1931న విడుదలైంది. 1931, అక్టోబర్ 31న మద్రాస్ (చెన్నై) కినేమా సెంట్రల్ హాల్లో (ఈ హాల్‌కు క్రితం పేరు మెజస్టిక్; గ్రాండ్ కాదు) శనివారం రోజున తొలి దక్షిణాది భాషల మాటలు, పాటల సినిమా విడుదలైంది. ఆ సినిమా పేరు కాళిదాస్. ఆ కాళిదాస్ సినిమాలో తెలుగు, తమిళ్ష్ రెండు భాషల సంభాషణలూ ఉన్నాయి. కాళిదాస్ పూర్తిగా తెలుగు సినిమా కాదు, పూర్తిగా తమిళ్ష్ సినిమా కాదు. కాళిదాస్ మొట్టమొదటి తమిళ్ష్-తెలుగు టాకీ.
మనకు తెలిసిన కవి కాళిదాస్ కథ తొలి దక్షిణాది టాకీగా నిర్మితమైంది. కథనాయకుడు పాత్ర తెలుగు సంభాషణలు, నాయిక పాత్ర తమిళ్ష్ సంభాషణలతో కాళిదాస్ సినిమా ఉంటుంది. ఈ సత్యాన్ని నాయిక పాత్రధారి టీ.పీ. రాజలక్ష్మి స్వయంగా చెప్పగా ప్రముఖ తమిళ్ష్ సినిమా పాత్రికేయుడు పీ. ఆర్.ఎస్. గోపాల్ 1950, జూలై ‘గుండూసి’ పత్రికలో ఇలా రాశారు: సినిమాలో రాజకుమారి తమిళ్ష్‌లో అడుగుతుంది; కాళిదాసు తెలుగులో బదులు చెబుతాడు”. ఆ కాళిదాస్ సినిమాలో తెలుగు, తమిళ్ష్ భాషల సంభాషణలు ఉన్నాయని లబ్ద ప్రతిష్ఠుడు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన సినిమా చరిత్రకారుడు అరన్దై నారాయణన్ పలుసార్లు తెలియజేశారు.
తెలుగు మాటలు, పాటల తొలి సినిమా(టాకీ) విషయంగా గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం ఇటీవల తెలుగులో రెంటాల జయదేవ మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకం ద్వారా జరిగింది. (ఈ పుస్తకానికి తెలంగాణ ప్రభుత్వ పురస్కారం రావడం తెలంగాణకు అవమానకరం) చదువు, పరిశీలన, స్పష్టత, అవగాహన లేకుండా తెలుగు సినిమా చరిత్రలో ఈ విషయంగా అవాంఛనీయమైన అసత్యాల సృష్టి, వ్యాప్తి మొదలయ్యాయి. భవిష్యదవసరాల దృష్ట్యా తొలి తెలుగు టాకీ విషయంగా సరైన చారిత్రిక ఆధారాలతో కాళిదాస్ సినిమా తొలి తెలుగు-తమిళ్ష్ టాకీ అనీ, ఇది పూర్తి తెలుగు సంభాషణల సినిమా కాదు అనీ అవగతం చేసుకోవాలి.
‘సుదేశ మిత్తిరన్’ తమిళ్ష్ పత్రికలో 22/10/1931న కాళిదాస్ సినిమా విడుదల విషయంగా ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో కాళిదాస్ సినిమా తమిళ్ష్, తెలుగు భాషల్లో మొదటి టాకీ అని ఉంది. కాళిదాస్ సినిమా 31/10/ 31న విడుదలయ్యాక 16/11/31న ‘ఆనన్ద విగడన్’ (ఆనంద వికటన్ కాదు) పత్రికలో అప్పటి ప్రముఖ పాత్రికేయుడు (కల్కి) కృష్ణమూర్తి ఈ సినిమాపై సమీక్ష రాశారు. ఆ సమీక్షలో ఈ సినిమాలో తమిళ్ష్, తెలుగు భాషలు ఉన్నాయని రాశారు.
కాళిదాస్ సినిమా పాటల పుస్తకమూ, సుదేశ మిత్తిరన్ పత్రికలో వచ్చిన ప్రకటన, ఆనన్ద విగడన్ పత్రికలో వచ్చిన వ్యాసం, సినిమా దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డి వేర్వేరు సందర్భాల్లో ఈ సినిమా గురించి చెప్పినవి, మురుగన్ టాకీస్ అన్న తమిళ్ష్ పుస్తకం, (కాళిదాస్ సినిమా విడుదలైన కినిమా సెంట్రల్ హాల్ తరువాతి రోజుల్లో మురుగన్ టాకీస్ అయింది; ఆ తరువాత ఈ పుస్తకం వచ్చింది)
కాళిదాస్ సినిమా నాయిక టీ.పీ. రాజలక్ష్మి చెప్పిన మాటలు, ఇంగ్లిష్‌లో వచ్చిన ఎల్.వీ. ప్రసాద్ జీవిత చరిత్ర పుస్తకం, చరిత్రకారుడు అరన్దై నారాయణన్ పుస్తకాలు ఆ సినిమా ఉనికికి సంబంధించి దొరుకుతున్న ప్రధానమైన, ప్రామాణికమైన ఆధారాలు. ఈ కాళిదాస్ సినిమా ప్రింట్, పాటల రికడ్స్ (రికార్డులు) అలభ్యం.
ఇమ్పీరిఅల్ మూవీ టోన్ పతాకంతో ఈ కాళిదాస్ సినిమాను నిర్మాత అర్దేషిర్ ఈరానీ నిర్మించారు. సినిమాకు దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డి. ఆలమ్ ఆరా 14/3/1931న మనదేశంలో వచ్చిన తొలి టాకీ. ఆలమ్ ఆరా 1931, జూన్ నెలలో అప్పటి మద్రాస్‌లో ప్రదర్శితమైంది. ఈ సినిమా నిర్మాత అర్దేషిర్ ఈరానీ ఆలమ్ ఆరా తరువాతి ప్రయత్నంగా ఈ కాళిదాస్ తమిళ్ష్-తెలుగు సినిమాను నిర్మించారు.
ఈ కాళిదాస్ సినిమాలో నాయకుడు పాత్రధారి తెలుగు వ్యక్తి ‘కంకాళరావ్ ఎమ్.ఎ.’ ఈ విషయాన్ని (కల్కి) కృష్ణమూర్తి 1931, నవంబరు 16 ఆనన్ద విగడన్ పత్రికలో ఈ సినిమాపై సమీక్ష రాస్తూ తెలియజేశారు. (తమిళ్ష్ లిపి ప్రకారం కంకాళరావ్ అన్న పేరును గంకాళరావ్ లేదా కంగాళరావ్ లేదా గంగాళరావ్ అని కూడా చదివే అవకాశం ఉంది) కాళిదాస్ సినిమా కథానాయకుడు కంకాళరావ్ అన్న చారిత్రిక సత్యం ఈ వ్యాస రచయిత ద్వారా తెలుగు లోకానికి తొలిసారి తెలియజెయ్యబడింది.
వి.ఆర్. గంగాధర్ బి.ఏ. అన్న వ్యక్తి కాళిదాస్ సినిమా హీరో అంటూ రెంటాల జయదేవ మొదలుపెట్టిన ప్రచారం పూర్తిగా తప్పు. కాళిదాస్ సినిమా గురించి తెలియజేసే ఏ ప్రామాణికమైన ఆకరంలోనూ, ఆధారంలోనూ వి.ఆర్. గంగాధర్ ఈ సినిమా కథానాయకుడు అని లేదు. తెలుగు వ్యక్తి కంకాళరావ్ తొలి తెలుగు టాకీ హీరో మాత్రమే కాదు తొలి దక్షిణాది టాకీ హీరో కూడా!
కాళిదాస్ సినిమా నాయిక టీ.పీ.రాజలక్ష్మి తొలి దక్షిణాది టాకీ హీరోయిన్. కాళిదాస్ సినిమాను ముందుగా తమిళ్ష్ సినిమాగానే తీద్దామనుకున్నారు. నాయకుడు పాత్రకు ఎన్నికైన కంకాళరావ్కు తమిళ్ష్ రాదు కాబట్టి అయన సంభాషణల్ని తెలుగులో చెప్పనిచ్చారు. తెలుగు, తమిళ్ష్ భాషల్లో ఆడియో, వీడియో ఎలా వస్తుందో తెలుసుకునే ప్రయత్నంగానూ, పరీక్షార్థంగానూ ఈ సినిమాను రెండు భాషల్లోనూ తీశారు.
కాళిదాస్ ఒక 100% మాటల, పాటల, నృత్య కార్యక్రమం (ప్రోగ్రామ్) అనీ, అందులో దేశభక్తి గీతాలు, కీర్తనం, ప్రేమ గీతాలు, నృత్యం ఉన్న రీళ్లు ఉన్నాయనీ, కుమారి టీ.పీ. రాజలక్ష్మి చేసిన కురత్తి నృత్యం (కురత్తి నృత్యం ఒకరకమైన తమిళ్ష్ ఆదివాసీ నృత్య ధోరణి) ఉన్న రీళ్లు ఉన్నాయనీ, కాళిదాసు జీవితంలోని హాస్య, ప్రేమ ఘట్టాలు ఉన్న రీళ్లు ఉన్నాయనీ పాటల పుస్తకంలో సూచించబడింది. కవి కాళిదాసు కథతో తీసిన సినిమాకు విడివిడి దేశభక్తి గీతాలు, కీర్తనలు, ప్రేమ గీతాలు, దేశ భక్తి గీతాలు, టీ.పీ. రాజలక్ష్మి చేసిన కురత్తి నృత్యం వంటివి కలిపారని తెలియవస్తోంది.
కంకాళరావ్, టీ.పీ. రాజలక్ష్మి కాకుండా ఈ కాళిదాస్ సినిమాలో పీ.జీ. వెంకటేస(శ)న్, ఎల్.వీ. ప్రసాద్, టీ.సుశీలాదేవి, ఎమ్.ఎస్. సంతానలక్ష్మి
వంటి నటీనటులు చోటు చేసుకున్నారు. కాళిదాస్ సినిమాలో నాయకుడు పాత్రధారి పీ.జీ. వెంకటేసన్ అని వికీపీడిఅలో ఉంది. ఆ సమాచారం తప్పు.
ఆక్స్‌ఫడ్ ఎన్సైక్లోపీడిఅ ఆవ్(ఫ్) ఇండిఅన్ సినిమా పుస్తకం కూడా ఈ సినిమా నాయకుడు పీ.జీ. వెంకటేసన్ అన్న పెనుదోషాన్నే చెబుతోంది. పీ.జీ. వెంకటేసన్ ఈ సినిమాలో ఒక సహాయక పాత్ర చేశారు; నాయకుడిగా కాదు. పీ.జీ. వెంకటేసన్ తమిళ్ష్ గాయకుడు ‘దక్షిణాది సైగల్’ అని ఆయన్ను అనేవారు.
కాళిదాస్ సినిమాలో తమిళ్ష్, తెలుగు భాషల సంభాషణలు ఉన్నాయి. సినిమా పాటల పుస్తకం అట్టమీద ‘మొట్టమొదటి తమిళ్ష్ & తెలుగు టాకీ’ అని ఉంది. కల్కి కృష్ణమూర్తి ఈ సినిమాలోది ‘కలప్పు మొళ్షి పేచ్చు’ అంటే మిశ్రమ భాష సంభాషణ అని తన సమీక్షలో చెప్పారు. తాను ఈ సినిమాలో తమిళ్ష్ మాట్లాడి, తమిళ్ష్ పాటలు పాడి నటించాను అని ఈ సినిమా నాయిక టీ.పీ. రాజలక్ష్మి తెలియజేశారు. (టీ.పీ. రాజలక్ష్మి ఒక నవలా రచయిత్రి కూడా. దక్షిణాదిలో సినిమాకు దర్శకత్వం చేసిన తొలి మహిళ టీ.పీ. రాజలక్ష్మి)
‘ఎల్.వీ. ప్రసాద్, ఎ లైఫ్ డెడికెటడ్ టు సినిమా’ పేరుతో ఇంగ్లిష్‌లో ఎ. సాయిప్రసాద్ రాసిన ఎల్.వీ. ప్రసాద్ జీవిత చరిత్రలో “ఎల్.వీ. ప్రసాద్‌కు హెచ్.ఎమ్. రెడ్డి కాళిదాస్ తమిళ్ష్ మొదటి టాకీలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు” అని చెప్పబడింది.
కాళిదాస్ సినిమా మొట్టమొదటి తమిళ్ష్ సినిమాగా పెద్దశాతం పరిగణనలోకి రావడానికి కారణం ఆ సినిమాలో ఎక్కవ భాగం తమిళ్ష్ సంభాషణలు, ఎక్కువ తమిళ్ష్ పాటలు ఉండడమే.
పాటల పుస్తకం ప్రకారం సినిమాలో ఆరు తమిళ్ష్ పాటలు ఉన్నాయి. తమిళ్ష్ పాటల్ని బాస్కర్దాస్ రాశారు. రెండు తెలుగు పాటలు ఉన్నాయి. ఆ రెండూ త్యాగయ్య కృతులే. “ఎంత రాని తనకెంత పోని నీ / చింత విడువజాల శ్రీరామ”, “స్వరరాగ సుధారసయుత భక్తి / స్వర్గాపవర్గముగా ఓ మనసా”.
కాళిదాస్ సినిమాను ఒక తెలుగు సినిమాగా తీద్దామని మొదట్లో అనుకుని ఉంటే ఆరు తమిళ్ష్ పాటలు కాదు ఆరు తెలుగు పాటలు ఉండేవి. సినిమాలోని ఆరు తమిళ్ష్ పాటలూ సినిమా కోసం ప్రత్యేకంగా రాయించినవి. సినిమా కోసం ప్రత్యేకంగా తెలుగు పాటల్ని రాయించకుండా అప్పటికే ప్రచారంలో ఉన్న త్యాగయ్య కృతుల్ని తీసుకున్నారు. ఈ పరిణామం కాళిదాస్ సినిమాను ప్రధానంగా తమిళ్ష్‌లో తీద్దామనుకుని తరువాత తెలుగునూ కలిపారు అన్న సరైన అవగాహన్ను ఇస్తోంది.
రెండు తెలుగు పాటల్నీ నాయిక టీ.పీ. రాజలక్ష్మి పాడారు అన్న ప్రచారం కూడా అంత సరైంది కాకపోవచ్చు. తమిళ్ష్ భాషలో తీద్దామనుకున్న ఈ సినిమాలోకి తెలుగు రావడానికి తొలి కారణం నాయకుడు పాత్రధారి కంకాళరావ్. కంకాళరావ్ తెలుగు పాట పాడి ఉండచ్చు.
అరన్దై నారాయణన్ తన ‘తమిళ్ష్ సినిమావిన్ కదై’ అన్న రాష్ట్రపతి పురస్కారం అందుకున్న పుస్తకం పుట 39లో కాళిదాస్ సినిమా కోసం తెలుగు పాట నమోదయిందని తెలియజేశారు. 1986లో కే.ఎన్.టీ. శాస్త్రి సంపాదకత్వంలో ఇంగ్లిష్ వ్యాస సంకలనంగా వెలువడిన ‘తెలుగు సినిమా’ పుస్తకంలో కాళిదాస్ సినిమాలో అన్నీ తెలుగు పాటలే ఉన్నట్టుగా చెప్పబడింది. అది పూర్తిగా తప్పు.
అరన్దై నారాయణన్ 1988లో ‘సుదన్దిరప్ పోరిల్ తమిళ్ష్ సినిమా’ పుస్తకం పుట 5లో ఇలా తెలియజేశారు: “కాళిదాస్ తొలి తమిళ్ష్ టాకి మాత్రమే కాదు; తొలి తెలుగు టాకి కూడా ఇదే’; ‘కథా నాయిక తమిళ్ష్‌లో మాట్లాడుతుంది; తమిళ్ష్‌లో పాడుతుంది’. ‘కథా నాయకుడు తెలుగులో మాట్లాడతాడు; పాడతాడు”. ఈ ఆవిష్కరణల ద్వారా కాళిదాస్ సినిమాలో కథా నాయకుడు తెలుగులో మాట్లాడడమే కాదు తెలుగులో పాడాడని కూడా మనకు తెలియవచ్చింది!
అంటే కాళిదాస్ సినిమా కథా నాయకుడు తొలి తెలుగు సినిమా గాయకుడు కూడా! ఇంకా గట్టిగా చెప్పాలంటే కాళిదాస్ సినిమా కథా నాయకుడు ‘తొలి దక్షిణాది టాకీ హీరో’ ఆపై తొలి దక్షిణాది సినిమా గాయకుడు కూడా!’ ఆ కథా నాయకుడు పాత్రధారి తెలుగు వ్యక్తి తొలి దక్షిణాది భాషల టాకీ హీరో’, తొలి దక్షిణాది సినిమా గాయకుడు తెలుగు వ్యక్తే!!
తమిళ్ష్ ఆకరాలు, ఆధారాలు, ప్రకటనలు, చరిత్రకారుల రచనలవల్లే కాళిదాస్ సినిమాలో తెలుగు కూడా ఉంది అన్న చరిత్ర స్పష్టంగా తెలుస్తోంది.1932లో విడుదలైన భక్తప్రహ్లాద మెట్టమొదటి పూర్తి తెలుగు టాకీ. అన్ని విధాలుగానూ కాళిదాస్ ఒక తమిళ్ష్-తెలుగు చిత్రం. ఇది సరైన ఆధారాలతో తెలియవస్తున్న సత్యం.
తొలి తెలుగు టాకీ కాళిదాస్ అనీ, తొలి తెలుగు టాకీ కథానాయకుడు, తొలి దక్షిణాది టాకీ కథానాయకుడు, తొలి దక్షిణాది సినిమా గాయకుడు తెలుగు వ్యక్తి అయిన కంకాళరావ్ (‘శ్రీమాన్ కంకాళరావ్ ఎమ్.ఎ.’ అని కల్కి కృష్ణమూర్తి రాశారు) అనీ సరైన చరిత్రగా దక్షిణాది టాకీ తొంబై నాలుగేళ్లను పూర్తి చేసుకున్న సందర్భంలో మనం ధ్రువపరుచుకోవాలి; ధ్రువపరుచుకుందాం.

9444012279