దీపావళంటే పొద్దున్న అంటిన కుంకుడురసానికి, సాయంత్రం అంటించబోయే టపాసుల సరాలకి మధ్య టీవీముందు తిష్టవేసుకున్న బాల్యం కాదది..
పండక్కి పదిరోజుల ముందునుంచే పేల్చడం మొదలెట్టిన రీళ్ళటేపుల ఆనందం ఖరీదు మహా అయితే పావలా..
యే తుపాకుల అవసరం లేకుండానే అలాంటి ఎన్నో పావలాల్ని గోడ సాయంతో పట్ పట్ లాడించిన ఘనమైన చరిత దానిది..
సిసింద్రీ గుల్లలు చుట్టుకునే పిల్లలతో విర్రవీగిన అరుగులు, మందులు ఎండబెట్టుకునే గుబగుబల్తో గుప్పుమన్న లోగిళ్ళు ఇప్పుడింకా అలాగే ఉన్నాయా…?
కూరుకున్న టపాసుల్ని ఒకరికొకరు పంచుకోడాలు, కోరుకున్న రీతిలో వాటి నాణ్యతని అందరూ కల్సి పరీక్షించడాలు, అణుదేశాలంత హడావిడి పిల్లకాయల మధ్య అలాగే మిగిలున్నాయా?
పిరికిని, మురికిని అస్సలు పట్టించుకోని ఆ బాల్యం ఎక్కడుందో ఏమో..?
మధ్యాహ్నం మూడింటికే కడిగేసిన అరుగు మీదకి ఇంట్లో పేర్చిన మట్టిప్రమిదలు ఎప్పుడు చేరతాయా అని ఎదురుచూసిన చూపులు ఇంకా అలాగే ఉన్నాయ్ కళ్ళముందు.
ఐదవ్వొస్తుండగానే నూనె పోస్తున్న అమ్మ వెనకాలే సాయం జేసే నెపంతో వెనకాలే తిరుగుతూ “మొదలెట్టెయ్యొచ్చా”ని చెంగుకి అడ్డంపడ్డ హడావుడిని అలాగే పడుతున్నామా ఇంకా?
ఖాళీ మతాబు గుల్లల్లోకి మూడంగుళాలకి మించకుండా ఇసుకని పోసి, మిగతాదంతా స్వచ్ఛమైన గంధకం పాళ్లతో నింపిన అచ్చమైన దీపావళి ఇప్పుడు యే చైనా వెలుగుల్లో వెతుక్కోవాలబ్బా?
పల్లెటూళ్ళల్లో తిప్పిన ఉప్పొట్లాలు, పట్నాల్లో పేల్చిన లడీల హడావుడి అక్కడే ఆగిపోయిందా లేక మనదాకా వచ్చిందా?
అస్సలు భయమే గొల్పని కాకరపువ్వొత్తులు,చివరికంటా మెల్లగా కాలే తాళ్లు, వెలుగులు విరజిమ్మే పెన్సిళ్ళు,మిగిలిపోయిన మతాబీ మందుతో సొంతంగా కూరుకున్న మట్టి చిచ్చుబుడ్లు,
వొద్దురా గచ్చంతా మచ్చలడిపోద్దని వెనకాల్నుంచి కేకలేస్తున్నా సరే లెక్కజెయ్యకుండా అహంకారంగా వెలిగించిన పాముబిళ్ళలు,తీగకి చుట్టి రయ్యిన తిప్పిన విష్ణుచక్రాలు, జుమ్మని ఆడించిన భూచక్రాలు,వెలిగిందో లేదో కూడా చూడకుండానే విసిరి పారేసి చెవులు మూసేసుకున్న తాటాకు టపాకాయలు,ఇవిగాక పెద్దోళ్ళు కాల్చే లక్ష్మి ఔట్లు, పక్కింటోళ్లు ఊరించే సీమటపాకాయలు..ఎవరు ఎక్కువ కాల్చితే వాళ్ళే గొప్పనుకున్నాం తప్ప ఇదొక దండగమాలిన యవ్వారమని,ఉబుసుపోని వ్యాపారమని బోధించే మేధావులు లేని సత్తెకాలం ఆ దీపావళి..!!
దీపావళికే రంగులద్దిన ఆనాటి హంగులన్నీ పిలిస్తే వెనక్కి పరిగెత్తుకొస్తాయా?
రాత్రంతా కాలుతూనే ఉండాలని కోరుకున్న అమాయకపు పసితనం తిరిగి రమ్మంటే మళ్ళీ వస్తుందా?