-కీలకమైన మందుల సరఫరాపై పటిష్టమైన నియంత్రణ
– డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు మొక్కుబడి తనిఖీలతో సరిపెట్టకూడదు
– తనిఖీల సంఖ్య, నాణ్యత తగ్గడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన
– మందుల నియంత్రణ వ్యవస్థ(డిసిఎ) పనితీరుపై మంత్రి సుదీర్ఘ సమీక్ష
అమరావతి: ప్రజారోగ్యానికి కీలకమైన మందుల నాణ్యత, సరఫరాలపై నియంత్రణను మరింత పటిష్టం చేయాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఎ) అధికారుల్ని ఆదేశించారు. డిసిఎ పనితీరు, సాధిస్తున్న ఫలితాలపై బుధవారంనాడు వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు. డిసిఎ డైరెక్టర్ జనరల్ రవి పట్టణ్‌శెట్టి , డైరెక్టర్ ఎం.బి.ఆర్.ప్రసాద్ తో పాటు మొత్తం 80 మంది అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
“నాణ్యమైన మందులు అందేలా చూడడానికి డిసిఎ అనే వ్యవస్థ ఉందని, అది ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సమర్ధవంతంగా పనిచేస్తోంది” అన్న భావన కలిగిలా అధికారులు పనిచేయాలని మంత్రి నొక్కి వక్కాణించారు. తమకందుతున్న సమాచారం ప్రకారం డ్రగ్ ఇన్స్ పెక్టర్లు మొక్కుబడిగా తనిఖీలు చేపడుతున్నారని, ఈ వైఖరిలో మార్పు రావాలని ఆయన సూచించారు. క్రమేణా తనిఖీల సంఖ్య మరియు వాటి నాణ్యత తగ్గడంపై సంఖ్యాపరంగా వివరాల్ని డిసిఎ అధికారుల ముందు ఉంచి, వీటికి సంబంధించి తక్షణమే మార్పు వచ్చేలా విధివిధానాలను రూపొందించాలని ఆయన ఆదేశించారు.
2015-16లో ప్రతి డ్రగ్ ఇన్స్ పెక్టర్ 538 తనిఖీలు చేయగా 2023-24లో అది 501కి పడిపోయిందని, దీంతో పాటు డ్రగ్ ఇన్స్ పెక్టర్లు సేకరించే మందుల నమూనాల విషయంలో కూడా చిత్తశుద్ధి కొరవడినట్లు వెల్లడయ్యిందని వివరిస్తూ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. శాంపిలింగ్ విధానం, నాణ్యతలను సూచించే దిశగా…డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు సేకరించిన నమూనాల్లో మూడు శాతం ఎన్ ఎస్‌క్యు (నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ) గా ఉండాలని కేంద్రం నిర్దేశించిన, 2015-2019 కాలంలో ఎన్ ఎస్‌క్యు నాలుగు శాతానికి పైగా ఉండగా అది 2019-20లో 2.22 శాతం నుంచి 2023-24కు 1.52 శాతానికి పడిపోయిందని మంత్రి వివరించారు. ఇది ఆమోదయోగ్యం కాదని, నమూనాల సేకరణ యధాలాపంగా కాకుండా ముందస్తు సమాచార సేకరణతో పటిష్టంగా జరగాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తాము కోరుకున్న విధంగానో లేక వేరే పనిమీద వెళ్తూ దారిలో ఉండే మందుల షాపుల తనిఖీ చేపట్టకుండా కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ద్వారా తనిఖీలు చేపట్టాలని మంత్రి సూచించారు. నాణ్యమైన రక్తం ప్రాధాన్యత దృష్ట్యా బ్లడ్ బ్యాంకులపై కూడా పటిష్టమైన నిఘా ఉంచాలని మంత్రి డ్రగ్ ఇన్స్ పెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల్లోని ఏయే ప్రాంతాల నుంచి కల్తీ మందులు వస్తున్నాయో, వాటిని ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారో అన్న సమాచారాన్ని సేకరించే వ్యవస్థను ఏర్పరుచుకుని ప్రభావంతమైన తనిఖీలు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అరికట్టడానికి… అధిక మోతాదులో వాటిని విక్రయిస్తున్న షాపుల వివరాల్ని సేకరించి, వారు వైద్యుల సూచనల మేరకు వాటిని విక్రయిస్తున్నారా లేదా అన్న విషయంపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. అదే విధంగా యువతను, ప్రజలను వ్యసనాలకు గురిచేసే మందుల విక్రయంపై కూడా దృష్టి పెట్టాలన్నారు.
డిసిఎలో అవసరాల మేరకు పరిశోధన శాలల నిర్మాణం, సిబ్బంది మరియు వాహనాల కొరత తీర్చడానికి తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి తమ శాఖ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. డిసిఎ పనితీరులో స్పష్టమైన మార్పు వచ్చింది అని తెలిసేలా అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని మంత్రి సూచించారు.