తిరుపతి : చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో తిరుపతి నగరం జలమయం అయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రైల్వే అండర్ బ్రడ్జ్‌లు వర్షపు నీటితో మునిగిపోయాయి. తిరుపతి నగరంలోని వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్దనున్న అండర్ బ్రిడ్జ్‌లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. నగరంలోని కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
రేణిగుంటలో దిగని విమానాలు
ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో విమానాలు దిగడం లేదు. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాయి. రేణిగుంటలో దిగాల్సిన హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. అలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమానాలు హైదరాబాద్‌కు వెనుదిరిగాయి.
విరిగిపడిన కొండచరియలు
భారీ వర్షాలతో తిరుమల కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమల రెండో కనుమదారిలో హరిణి వద్ద రాళ్లు పడ్డాయి. భారీ వర్షంతో పాపవినాశనం రహదారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది రాళ్లను తొలగిస్తున్నారు.