Suryaa.co.in

Editorial

‘మత్తు’లో తిరుపతి చిత్తు!

  • తిరుపతి ‘మత్తు’ వదలించే డిక్లరేషన్‌కు తిరునామాలు?

  • తిరుపతిలో వైన్‌షాపులు, బార్ రెస్టారెంట్లు

  • తిరుమలపైకి మద్యం వెళ్లేదీ తిరుపతి నుంచే

  • తిరుమలలో లెక్కలేనన్ని సార్లు పట్టుపడ్డ మద్యం, మాంసం

  • గంజాయికి అడ్డాగా మారిన తిరుపతి

  • వైసీపీ హయాంలో బస్సులపై దాడిన గంజాయి ముఠాలు

  • ఎర్రచందనం స్మగ్లింగ్ బేర‘సారాల’కూ అదే అడ్డా

  • తిరుమల తిరుపతి ఒకటేనంటున్న టీటీడీ

  • తిరుమలలో టీడీపీ అనుబంధ ఆలయాలు బోలెడు

  • మరి తిరుమతిని మద్యరహిత నగరంగా ఎందుకు ప్రకటించరు?

  • ఆదాయం ముఖ్యమా? ఆధ్మాత్మికత ముఖ్యమా?

  • పీఠాథిపతులు, మఠాధిపతులు మాట్లాడరేం?

  • సనాతన ధర్మ ప్రచారకుడు పవన్‌కు పట్టదా?

  • కాషాయ పార్టీకి మద్యరహిత నగర ఆలోచన లేదా?

  • ఎన్ని సదస్సులు పెట్టినా ‘తిరుపతిలో మద్యనిషేధం’పై డిక్లరేషన్ ఏదీ?

(మార్తి సుబ్రహ్మణ్యం)

తిరుపతి- తిరుమల. అది ప్రపంచంలోని కోట్లాదిమంది వెంకన్న భక్తులకు ఇష్టమైన ఆధ్మాత్మిక ప్రదేశం. పేరుకు రెండూ వేర్వేరయినా, భక్తుల దృష్టిలో రెండూ పవిత్రమైన క్షేత్రాలే. ఎందుకంటే టీటీడీ అనుబంధ దేవాలయాలు,టీటీడీ పరిపాలనా కార్యాలయం కూడా, కొండ కింద ఉన్న తిరుపతిలోనే ఉంటాయి కాబట్టి! అందుకే.. అదే తిరుపతి వేదికగా మఠాథిపతులు, పీఠాథిపతులు ఆధ్మాత్మిక సదస్సులు నిర్వహిస్తుంటారు. చివరకు జాతీయ స్థాయిలో పోలీసు శాఖ సహా, ఏ శాఖ సదస్సయినా అక్కడే నిర్వహిస్తారు. అప్పటి ప్రపంచ తెలుగు మహాసభల నుంచి.. ఇప్పటి అంతర్జాతీయ దేవాలయాల సదస్సు వరకూ తిరుపతిలోనే జరిపారు. ఆయా సదస్సులకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులంతా, తర్వాత కొండపైకి వెళ్లి దర్శనం చేసుకుని వెళతారు. అంతా బాగానే ఉంది.

కానీ.. తిరుపతిని మద్య-మాంసరహిత నగరంగా ప్రకటించాలన్న డిక్లరేషన్‌పై ఏ ఒక్క సంస్థ.. ఏ ఒక్క ప్రముఖుడు.. ఏ ఒక్క పాలకుడూ ఇప్పటివరకూ పెదవి విప్పిన దాఖలాలు లేవు. వారంటే సరే.. చివరాఖరకు భక్తులకు అనుగ్రహ భాషణం చేసే పీఠాథిపతులు, మఠాథిపతులు కూడా దీనిపై ధర్మాగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. తిరుపతిని మద్య-మాంస రహిత నగరంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. తిరుపతి ఇప్పుడు మందు-మాంసమే కాదు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డా కాబట్టి!

ఆధ్మాత్మిక నగరమైన తిరుపతిని మద్య-మాంస రహిత నగరంగా మార్చాలన్న ధ్యాస పాలకులకు లేదా? కొండ కింద టీటీడీ ఆలయాలు కొలువుదీరిన నగరాన్ని, మద్య-మాంస రహిత నగరంగా ప్రకటిస్తే సర్కారు ఆదాయం పోతుందా? అందుకే ఆ దిశగా అడుగులు వేయడం లేదా? పాలకులకు ఆధ్మాత్మిక భావన ముఖ్యమా? ఆదాయం ముఖ్యమా? ఇదీ భక్తజనకోటి సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు.

రోజూ వేలాదిమంది భక్తులు తరలివచ్చే తిరుపతిలో.. ఇప్పుడు కేవలం 280 వైన్‌షాపులు, ఒక 50 బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రమే ఉన్నాయి. ఇక త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి.. సాధారణ ఓయో లాడ్జిల్లో కూడా, మద్యం-మాంసం విరివిగా అందుబాటులో ఉంటాయి. మాంసం షాపులకయితే లెక్కేలేదు. ఇక వీటికి గంజాయి అదనపు సౌకర్యం! యూనివర్శిటీలు, కాలేజీల్లో దొరికే గంజాయి సేవల గురించి, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడితో తిరుపతి ముచ్చట అయిపోలేదు. ఎర్రచందనం అమ్మకం-కొనుగోలుదార్లకు అదో అడ్డా. ఇన్ని సుగుణాలు ఉన్న తిరుపతి.. మద్య-మాంస-గంజాయి-ఎర్రచందన స్మగ్లర్మ మధ్య వర్ధిల్లుతున్నప్పటికీ, దానిని మద్య-మాంసరహిత నగరంగా మార్చాలన్న స్పృహ, ఇప్పటివరకూ ఏ పాలకులకూ రాకపోవడమే విచిత్రం. చివరాఖరకు హిందూమతంపై పేటెంట్ ఉందనుకునే బీజేపీ సైతం ఆ డిమాండ్ చేయదు. ఇప్పుడు కూటమిలో ఆ పార్టీ ఒక భాగస్వామి కూడా!

అదొక్కటే కాదు. కొత్తగా సనాతన ధర్మ ప్రచారకుడి అవతారమెత్తిన జనసేన దళపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా, తిరుపతిని మద్య-మాంస రహిత నగరంగా మార్చే ప్రయత్నం చేయకపోవమే వింత. గత ఎనిమిది నెలల కాలంలో పవన్ ధర్మాగ్రహంతోనే చాలా పనులు వేగంగా జరుగుతున్నాయి. మరి సనాతన ధర్మానికి కొత్తగా ఆచార్యత్వం స్వీకరించిన పవన్ స్వామి, ఆ దిశగా సర్కారుపై ఎందుకు ఒత్తిడి చేయరు? తాజాగా తిరుపతి వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సు కూడా ఆ దిశగా డిక్లరేషన్ చేయకపోవడం వింతలో వింత! ఆ మూడురోజుల సదస్సులో.. హిందుత్వ వాసనలు పరిళమించి, పరిఢవిల్లడం వరకూ బాగానే ఉన్నప్పటికీ, తిరుపతిని మద్య-మాంస రహిత నగరంగా మార్చాలన్న డిక్లరేషన్ ముచ్చటనే వినిపించకపోవడం హాశ్చర్యమన్నది భక్తకోటి ఉవాచ.

నిజానికి తిరుపతిని మద్య-మాంసరహిత నగరంగా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఇదే డిమాండ్‌పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, టీటీడీ హయాంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పటి ప్రభుత్వం ఆయన దీక్ష భగ్నం చేసింది. తర్వాత అదే భూమన.. టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే అయినప్పటికీ తన డిమాండ్‌ను తన ప్రభుత్వంపై ఒత్తిడి చేసి, అమలు చేయించలేకపోయారు. ఆయన తనయుడు కూడా, తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలని కోర్టులో కేసు కూడా వేశారు.

గత కొన్నేళ్ల నుంచి తిరుపతి నగరంలో గంజాయి వ్యాపారం విశృంఖలంగా జరుగుతోంది. ప్రధానంగా ఎస్వీ యూనివర్శిటీ సహా పలు ప్రభుత్వ-ప్రైవేటు కాలేజీలకు గంజాయి విస్తరించింది. ఎన్నికలకు ముందు ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను, గంజాయి ముఠా చావగొట్టిన వీడియా ఒకటి వైరల్ అయింది. అయినా ప్రభుత్వం గంజాయి అమ్మకాలను అణచివేయలేకపోతోంది. దీనితో తిరుపతితోపాటు, వివిధ ప్రాంతాల నుంచి తిరుపతిలో చదువుకునే యువత, మత్తుకు బానిసవుతున్న ఆందోళనకర పరిస్థితి.

చెన్నైతోపాటు, తిరుపతి కూడా ఎర్రచందనం అమ్మకాల బేరాలకు కేంద్రంగా మారింది. తిరుపతి నగరంలోని హోటళ్లు, వీటికి కేంద్రంగా మారాయన్న విమర్శలు ఇప్పటివి కావు. వీటి వెనుక ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి చెందిన నాయకుల హస్తాలు కనిపిస్తుంటాయన్నది బహిరంగ రహస్యం. ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ఎర్రచందనం స్మగ్లర్లే భారీగా విరాళాలు ఇస్తుంటాయన్నది అందరికీ తెలిసిందే. వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అయితే.. జగన్ జమానాలో కేవలం ఎర్రచందనం అమ్మకాలతోనే వందల కోట్లు సంపాదించారన్న ప్రచారం లేకపోలేదు. ఈ విషయంలో టీడీపీ నేతలు కూడా మినహాయింపు కాదు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇప్పటికీ ఎర్రచందనం స్మగర్లను, ఎర్రచందనం దుంగలను పట్టుకుంటున్నారంటే, తిరుపతిలో ఈ ముఠాలు ఏ స్థాయిలో అడ్డా వేశాయో కనిపిస్తూనే ఉంది.

తిరుమల కొండపైకి మద్యం, మాంసం, గంజాయి సరఫరా అవడానికి కారణం.. కింద ఉన్న తిరుమలలో, వాటి మూలాలు బలంగా ఉండటమేనన్నది నిష్ఠుర నిజం. గతంలో చిన జీయర్‌స్వామి దీనిపై ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీనితో తిరుమల పవిత్రంగా ఉండాలంటే, తిరుపతిని మద్య-మాంస రహిత నగరంగా మార్చడం అనివార్యమని భక్తులు స్పష్టం చేస్తున్నారు.

కాగా ఇటీవల అలిపిరి వద్ద ఉన్న ముంతాజ్ హోటల్‌ను మూసివేయించేందుకు కృషి చేస్తానని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. కొండ కింద అన్యమతస్తులకు ఆ హోటల్‌కు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఆ మేరకు టీటీడీ పాలవర్గ తొలి సమావేశంలోనే తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. అయితే ప్రభుత్వం టీటీడీ తీర్మానాన్ని బుట్టదాఖలు చేసింది.

ఆ హోటల్ పేరును ట్రై డెంట్‌గా మార్చడంతో, ప్రభుత్వ అనుమతులకు ఎలాంటి అడ్డంకి రాలేదు. అసలు తిరుమలపైన ఉన్న టీటీడీకి, తమ హోటల్‌కు సంబంధం లేదని హోటల్ యాజమాన్యం కూడా వాదించింది. పాలకులు సహజంగా హోటల్ వాదన వైపే మొగ్గు చూపారు. అయితే హోటల్ పేరు మారినప్పటికీ, యాజమాన్యం మాత్రం అదే ఒబెరాయ్ గ్రూప్ కావడం విశేషం. మరి అలిపిరి సమీపంలో పేరు మారిన ఆ ట్రైడెంట్ హోటల్‌లో, మద్యం-మాంసం అమ్మరని ప్రభుత్వం భావించిందేమో?

ఇటీవలి కాలంలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా బహుళ ప్రచారం పొందుతున్న జనసేన దళపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా.. తిరుపతిని మద్య-మాంసరహిత నగరంగా మార్చే ప్రయత్నాలకు, నడుం బిగించకపోవడంపై భక్తుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ సభ నిర్వహించడంతోపాటు, ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల్లోని దేవాలయాలను చుట్టి వస్తున్న పవన్‌కల్యాణ్.. సొంత రాష్ట్రం.. అందునా తన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే తిరుపతిని, మద్య-మాంస రహిత నగరంగా మార్చాలన్న కోట్లాదిమంది వెంకన్న భక్తుల కోరికను నెరవేర్చేందుకు, ప్రభుత్వంలో తన పలుకుబడి ఎందుకు వినియోగించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇక హిందూమతంపై వందశాతం పేటెంట్ హక్కులు తీసుకున్న జాతీయ పార్టీ బీజేపీ కూడా, తిరుపతిని మద్య-మాంసరహిత నగరంగా మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడమే ఆశ్చర్యం. హిందుత్వ నినాదాలు, ఆలయాలపై దాడులు జరిగినప్పుడు గొంతు చించుకునే బీజేపీ.. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని పవిత్రంగా ఉంచాలని డిమాండ్ చేసి, దానిని సాధించకపోవడం బట్టి.. ఆ పార్టీ హిందుత్వను సొమ్ము చేసుకునేందుకు మాత్రమే, ఆ నినాదం ఎత్తుకున్నట్లు కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి బీజేపీ కూటమిలో భాగస్వామి. ఈ నేపథ్యంలో బీజేపీతోపాటు.. జనసేన ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే, తిరుపతి మద్య-మాంసరహిత నగరంగా ఎందుకు మారదన్నది భక్తుల వాదన.

LEAVE A RESPONSE