నేడు రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యారంగం కుదేలైంది

– టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
నేడు రాష్ర్ట ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యారంగం కుదేలైపోతోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం.. స్వాతంత్రానంతరం అనేక మిషనరీస్, ప్రైవేటు వ్యక్తులు విద్యాలయాలు స్థాపించి పేద విద్యార్థులను ఆదుకున్నారు. ఆరోజుల్లో భూములు సేకరించి భారీఎత్తున పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. ఫలితంగా రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లా ప్రాంతంలో విద్యా వ్యాప్తికి అవకాశం వచ్చింది.
ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలో విదేశీ విద్య నిధులన్నీ తగ్గించేశారు. ఫీజురీయంబర్స్ మెంట్ ను ఎత్తేశారు. అమ్మఒడి పేరుతో ముగ్గురు, నలుగురు పిల్లలకు అవకాశాలున్నాకూడా ఒక్కరికే ఇస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలలను రద్దు చేశారు. నిర్వహణా బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటోందనటంతో ప్రైవేటు పాఠశాలల్లో చదివే లక్షలాదిమంది పిల్లలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
ఈ విషయంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. మిషనరీ సంస్థలు, ప్రైవేటు విద్యాలయాలకున్న విలువైన భూములపై ప్రభుత్వం కన్నుపడింది. వాటిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాలనుకున్న ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమైంది. దీంతో విద్య నాశనమవుతోంది. ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వముంది. ఎ‍యిడెడ్, అన్ ఎయిడెడ్ పోస్టులలో పనిచేసే వారు ఎప్పటికైనా పరమనెంట్ కాకపోతామా అని చాలామంది అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు.
ప్రభుత్వం ఈ విధానం తేవడంతో గందరగోళమేర్పడుతోంది. పాఠశాలలు, కళాశాలలు మూసివేసే పరిస్థితి వచ్చింది. దీంతో అనేకమంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. ఈ ప్రభుత్వం సింగిల్ టీచర్ విధానాన్ని తెచ్చి విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు. 67 శాతం దాటిన అక్షరాస్యతా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఈ ప్రభుత్వం పాఠశాలలకు వెళ్లే పిల్లల్ని పనికి వెళ్లేలా చేసింది. రద్దు చేసిన ఫీజురీయంబర్స్ మెంట్ ను తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలి. పాఠశాలలకు, కళాశాలలకు ఇవ్వాల్సిన ఫీజురీయంబర్స్ మెంట్ ను వెంటనే ప్రభుత్వం చెల్లించాలి. పాఠశాలలు, కళాశాలలు మూసేసే విదానం తప్పు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తూ పోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.