– ఎమర్జెన్సీ చరిత్రకు 50 ఏళ్లు
– బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్
హైదరాబాద్: భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిన 1975 ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో “మాక్ పార్లమెంట్” సెషన్ బుధవారం నిర్వహించారు. “ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ” అంశంపై విద్యార్థులు చురుకుగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ‘ద ఎమర్జెన్సీ డైరీస్ ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి, గౌతం రావు, తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1975లో ఇందిరాగాంధీ పాలనలో విధించిన ఎమర్జెన్సీ భారత రాజ్యాంగం, పౌరహక్కులకు విరుద్ధంగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన ఆ చారిత్రక సంఘటనను నేటి తరానికి గుర్తు చేయడమే ఈ మాక్ పార్లమెంట్ ఉద్దేశమన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాల కోసం యువత, మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టంతో వచ్చే ఎన్నికల అనంతరం పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ… 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు. అధికారం కోసమే రాజ్యాంగాన్ని తారుమారు చేసిన పార్టీ కాంగ్రెస్‌నేనని తీవ్రంగా విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో పత్రికా స్వేచ్ఛ హరించి, లక్షల మందిని జైలుకు పంపించారని, ప్రశ్నించిన గొంతులను అణిచేశారని విమర్శించారు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ సమయంలో పత్రికలపై నిషేధం, రాజకీయ నాయకుల అరెస్టులు, మీసా చట్టం ద్వారా నిర్బంధాలు జరిగాయని గుర్తుచేశారు. అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు, మహిళలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని తెలిపారు. మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థులు చక్కటి “లెజిస్లేటివ్ బిహేవియర్” ప్రదర్శించారని, రాజకీయాల్లో యువత, మహిళలకు విస్తృత అవకాశాలున్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వారి నైపుణ్యాన్ని వెలికితీసే శిక్షణ వేదికలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ.. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఈ దినాన్ని “సంవిధాన్ హత్యా దినంగా” స్మరించుకుంటూ.. భవిష్యత్ తరాలకు ఎమర్జెన్సీ ద్వారా దేశ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, ఆ చీకటి అధ్యాయాన్ని తెలియజేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యతను గుర్తుచేయాలని శిల్పారెడ్డి తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని అరెస్టు చేయడమే కాకుండా, విద్యార్థులు, రాజకీయ నాయకులు, మహిళలు, జర్నలిస్టులపై లాఠీచార్జ్‌లు, నిర్బంధాలు కొనసాగిన పరంపరను తీవ్రంగా విమర్శించారు. బలవంతపు కుటుంబ నియంత్రణ చర్యలు వంటి అమానవీయ చర్యలు ఎమర్జెన్సీ కాలంలో ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
నేటి యువతకు ఎమర్జెన్సీ నాటి దుస్థితులపై స్పష్టమైన అవగాహన కల్పించడమే మాక్ పార్లమెంట్ లక్ష్యమని శిల్పారెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువతలో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మహిళా మోర్చా బృందానికి, పాల్గొన్న విద్యార్థులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు