– అక్కడి నుంచి బెంగళూరు, ముంబై, చెన్నై నగరాలకు 3 గంటల్లో చేరేలా బుల్లెట్ రైళ్ల ఏర్పాటు
– బసవాపూర్ ప్రాజెక్టుకు ₹2,026 కోట్లు
– మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
మిర్యాలగూడ: నల్గొండను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. రోడ్లు, భవనాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా జిల్లా రూపురేఖలు మారుస్తామని, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచి, నల్గొండను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని హా
సీనియర్ జర్నలిస్ట్ మధు అకాల మరణం జర్నలిస్ట్ లోకానికి తీరని లోటు అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మధు నల్గొండలో 12-13 సంవత్సరాలు స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారని, గతంలో ‘ఆంధ్రజ్యోతి’, ఈనాడు’ పత్రికల్లో పనిచేసి, డిప్యూటీ సీఎం వద్ద సి.పి.ఆర్.ఓగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఎంతో సౌమ్యుడని, గుండెపోటుతో మరణించడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.
గతంలో జర్నలిస్ట్ దత్తు రెడ్డి కుటుంబానికి అండగా నిలిచినట్లే, మధు కుటుంబానికి కూడా ప్రభుత్వం మరియు పార్టీ తరపున అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా ₹5 లక్షల ఆర్థిక సహాయం అందించామన్నారు.
హైదరాబాద్–విజయవాడ రహదారిని (NH-65) సుమారు ₹10,410 కోట్లతో 8 వరుసల రహదారిగా (6 లైన్లు + 2 లైన్ల సర్వీస్ రోడ్లు) విస్తరిస్తామని, నవంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సర్వీస్ రోడ్ల నిర్మాణంపై క్యూబ్ కంపెనీకి ఇప్పటికే లేఖ పంపినట్లు వెల్లడించారు. శంషాబాద్ వద్ద 500 ఎకరాల్లో ట్రాన్స్పోర్ట్ హబ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి బెంగళూరు, ముంబై, చెన్నై నగరాలకు 3 గంటల్లో చేరేలా బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. దీనికి సంబంధించి అలైన్మెంట్ కూడా ఖరారు అయిందని తెలిపారు.
ఎక్స్‌ప్రెస్ హైవే మరియు బుల్లెట్ రైలు ప్రాజెక్టులతో నల్గొండలో ఆటోమొబైల్ వంటి భారీ పరిశ్రమలు వస్తాయని, డ్రై పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉందని చెప్పారు. బసవాపూర్ ప్రాజెక్టుకు ₹2,026 కోట్లు, మూసీ కాలువలు మరియు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.
హైదరాబాద్ డ్రైనేజీ వల్ల మూసీ కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ప్రజల ఆరోగ్యం కోసం మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని కొందరు అడ్డుకోవడం బాధాకరమని ఆయన విమర్శించారు.మంత్రి వెంట ప్రభుత్వ విప్ వేముల వీరేశం,ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.