– ఒక్కొక్క సోలార్ ప్లాంట్ తో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
– ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ -2024 తో 7.5 లక్షల మందికి ఉపాధి
– 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
– అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి: ప్రకాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. శాసనసభలో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి మంగళవారం సమాధానం చెప్పారు.
దీనికి సంబంధించి ఆయన సభలో మాట్లాడుతూ… రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రాయలసీమ తరువాత ప్రకాశం జిల్లానే అత్యంత అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాల్లో మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఒక్కో ప్లాంట్ నిర్మాణానికి సుమారు 5,500 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ప్లాంట్ల నిర్మాణానికి భూ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరామన్నారు. కలెక్టర్ నివేదిక తరువాత సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపడుతామని మంత్రి చెప్పారు. ఒక్కో సోలార్ విద్యుత్ ప్లాంట్ ద్వారా సుమారు 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు.
ఐసీఈ -2024 పాలసీ గేమ్ ఛేంజర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024 (ఐసీఈ) ద్వారా పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆశాభవం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఐసీఈ పాలసీ ద్వారా 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మంత్రి గొట్టిపాటి సభాముఖంగా సభ్యులకు వివరించారు.