– వేలాది మంది నిరుద్యోగులతో ర్యాలీకి సిద్ధమైన బీజేపీ
– హన్మకొండ కేయూ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ
– ముఖ్య అతిథిగా హాజరుకానున్న బండి సంజయ్
– ఉద్యోగ నియామకాలు, అవకతవకలపై సర్కార్ కు అల్టిమేటం ఇవ్వనున్న తెలంగాణ కాషాయ దళపతి
– ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి భారీగా నిరుద్యోగులు తరలివచ్చేలా బీజేపీ నేతల ప్లాన్
– యూనివర్శిటీలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల్లో విస్త్రత ప్రచారం నిర్వహించిన బీజేపీ, అనుబంధ సంఘాలు
– నిరుద్యోగ మార్చ్ కు మద్దతు ప్రకటించిన ఓయూ, కేయూ జేఏసీ నాయకులు
– కేసీఆర్ పాలనలో దగాబడ్డ ప్రజలంతా నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనండి : మనోహర్ రెడ్డి
– మే నెలాఖరులోగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని వెల్లడి
– అనంతరం రాష్ట్ర రాజధానిలోనూ భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహణకు సిద్ధమైన బీజేపీ
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై భారతీయ జనతా పార్టీ సమర శంఖం పూరించింది. పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఐటీ శాఖ మంత్రిని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో ‘‘నిరుద్యోగ గర్జన’’కు సిద్ధమైంది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ఓరుగల్లు పోరుగడ్డపై రేపు సాయంత్రం 4 గంటలకు ‘‘నిరుద్యోగ గర్జన’’ పేరుతో హన్మకొండ కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది నిరుద్యోగులతో ర్యాలీ నిర్వహించబోతోంది. బండి సంజయ్ తోపాటు పార్టీ ముఖ్య నేతలంతా ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనున్నారు.
ర్యాలీ అనంతరం బండి సంజయ్ కుమార్ నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో ఆ నినాదానికి ఏ విధంగా తూట్లు పొడిచిందనే విషయాన్ని ఎండగట్టనున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో సర్కార్ కు అల్టిమేటం ఇవ్వనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపారు. మరోవైపు ఓరుగల్లులో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ విజయవంతానికి బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ నిర్వహణ కమిటీ సభ్యులు గత మూడు రోజులుగా వరంగల్ లోనే మకాం వేసి నిరుద్యోగ మార్చ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
అందులో భాగంగా పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు రూపొందించారు. వేలాది కరపత్రాలు ప్రింట్ చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యూనివర్శిటీలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల వద్ద నిరుద్యోగులకు అందజేస్తూ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనాలని కోరారు. మరోవైపు బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కళాకారులు ఆయా కేంద్రాలవద్దకు వెళ్లి నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేయాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా, కాకతీయ వర్శిటీల జేఏసీ నాయకులు బీజేపీ నిర్వహించబోయే నిరుద్యోగ మార్చ్ కు సంఘీభావం తెలిపాయి. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం కాకతీయ యూనివర్శిటీ జేఏసీ ఛైర్మన్ ఉమాశంకర్, ప్రెసిడెంట్ ప్రేమ్ సుధాకర్ హన్మకొండలో మీడియా సమావేశం నిర్వహించి నిరుద్యోగ మార్చ్ కు సంపూర్ణ మద్దుతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీ కన్వీనర్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రేపు ఓరుగల్లు పోరుగడ్డపై జరగబోయే నిరుద్యోగ మార్చ్ ను జయప్రదం చేయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో దగాపడ్డ ప్రజలంతా నిరుద్యోగ మార్చ్ కు సంఘీభావం తెలిపాలని కోరారు. వరంగల్ నిరుద్యోగ మార్చ్ అనంతరం రాష్ట్రంలోని మిగిలిన ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ నిరుద్యోగ యువతను ఏకం చేసిన భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించి కేసీఆర్ సర్కార్ ను దించేదాకా పోరాడతామని స్పష్టం చేశారు.