రామప్ప ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

వరంగల్‌: ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన కాకతీయ కట్టడం రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ములుగులో ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని రాష్ట్ర పర్యాటకశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్నప్పటికీ గుర్తింపు పొందలేకపోయాయని తెలిపారు. తాను కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామప్పపై దృష్టిపెట్టానని చెప్పారు. రామప్పకు వచ్చే ప్రపంచ పర్యాటకుల కోసం వరంగల్‌లో విమానాశ్రయం ఉండాలన్న కిషన్‌రెడ్డి .. రాష్ట్ర ప్రభుత్వం స్థలం, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉడాన్‌ పథకం కింద విమానాశ్రయానికి రాయితీ ఇస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
రామప్పలో ఆర్కిటెక్చర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. మేడారం వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించాలన్న ఆమె.. అన్ని ప్రాంతాల నుంచి ములుగుకు బస్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపుతో సీఎం కల సాకారమైందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. కాకతీయ సర్క్యూట్‌ ద్వారా పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

Leave a Reply