వ్యాక్సినేషన్ వేగం పెంచాలి..

Spread the love

– రెండో డోసు త్వరగా పూర్తి చేయాలి
– 15-18 ఏళ్ల వారికి, 60 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు…
– 70 లక్షల డోసులు అవసరం పడుతుందని అంచనా..
– రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి..
– ఎం సి అర్ హెచ్ ఆర్ డి లో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష…

వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే వాక్సినేషన్ పై దృష్టి సారించడం వల్ల మొదటి డోసు లక్ష్యం దాదాపుగా వంద శాతానికి చేరువ అయిందన్నారు.

ఇదే స్ఫూర్తితో రెండో డోసును వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. 15- 18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్, 60 ఏళ్లు పై బడిన వారికి మూడో డోసు (బూస్టర్ డోస్) విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఎం సి అర్ హెచ్ ఆర్ డి లో వైద్యాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, టీఎస్ఎంఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎం ఓఎస్డి గంగాధర్, డీ ఎం ఇ రమేష్ రెడ్డి, డీ హెచ్ శ్రీనివాస్ రావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి గురించి ఉన్నతాధికారులు ఈ సందర్బంగా వివరించారు.

రాష్ట్రంలో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు, వారి ఆరోగ్య పరిస్తితి, అందిస్తున్న చికిత్స గురించి తెలిపారు. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభావం తక్కువ ఉన్నట్లు పలు అధ్యయనాల ఆధారంగా చెప్పారు. ఒమిక్రాన్ సోకి టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న, వారి ఆరోగ్యం బాగుందని, కోలుకుంటున్నారని సమీక్షలో అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…జాతీయ స్థాయిలో మొదటి డోసు సగటు 90 శాతం ఉంటే, తెలంగాణలో 99.46 శాతానికి చేరువ అయినట్లు చెప్పారు. రెండో డోసు విషయంలో జాతీయ సగటు 61 కంటే 3శాతం ఎక్కువతో, 64 శాతం ఉన్నట్లు చెప్పారు. కరోనా నుండి ప్రజల్ని కాపాడుకునెందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాల్సిన నేపథ్యంలో.. రెండో డోసు విషయంలో మరింత వేగాన్ని పెంచాలని ఆదేశించారు. వంద శాతం లక్ష్యం చేరువ చేయాలన్నారు.

15-18 యేండ్ల వయస్సు వారు 22.78 లక్షలు, 60 ఏళ్ల పై బడిన వారు 41.60 లక్షలు, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లు 6.34 లక్షలు ఉన్నారని, వీరందరికీ దాదాపు 70 లక్షల వ్యాక్సిన్ అవసరం ఉంటుందన్నారు. , జనవరి 3 నుండి 15-18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పై బడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఒకవేళ మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనెలా ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఏర్పాట్లను విభాగాల వారీగా సమీక్షించుకోవాలన్నారు. అవసరమైన అదనపు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, అలా అని ప్రజలు నిర్లక్ష్యం గా ఉండకూడదని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోవడం తో పాటు, మాస్క్ ధరించాలనీ, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply