Suryaa.co.in

Editorial

వం‘సీను’ ముగిసింది!

  • ఇక కొడాలి, రోజా, సజ్జల, పెద్దిరెడ్డి, కాకాణి, అప్పిరెడ్డి, అవినాష్, జోగి, ద్వారంపూడి, గుడివాడ అమర్నాధ్ కథ మిగిలింది

  • ముందస్తు బెయిల్‌పై అవినాష్, అప్పిరెడ్డి, జోగి రమేష్, అరవ సత్యం

  • మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుతో టీడీపీ శ్రేణుల ఖుషీ

  • తాము కోరుకుంటుంది ఇదేనంటూ అభినందలు

  • వారికి బెయిల్ రాకుండా చూడాలంటూ సోషల్‌మీడియాలో హోరెత్తుతున్న పోస్టింగులు

  • సమర్ధుడైన లాయర్‌ను పెట్టాలని తమ్ముళ్ల డిమాండ్

  • ఇప్పటికే ప్రభుత్వ లాయర్లు విఫలమవుతున్నారంటూ పెదవి విరుపు

  • మంగళగిరి పార్టీ ఆఫీసుదాడి నిందితులకు బెయిల్‌పై తమ్ముళ్ల అసంతృప్తి

  • వంశీ కేసును సీనియర్ లాయర్ వాదించాలంటున్న తమ్ముళ్లు

  • లోకేష్ చెప్పింది లీగల్‌గానే జరుగుతుందంటున్న సీనియర్లు

  • కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచన

  • తమపై ఒత్తిడి పెంచితే లాభం లేదంటున్న నాయకత్వం

  • తప్పు చేసిన వారిని విడిచిపెట్టేది లేదని పార్టీ స్పష్టీకరణ

  • జగన్ మాదిరిగా అడ్డగోలు అరెస్టులు చేస్తే ఎలా?

  • సోషల్‌మీడియా సైనికుల కోరిక నెరవేరుతుందని టీడీపీ నాయకత్వ హామీ

( మార్తి సుబ్రహ్మణ్యం)

హమ్మయ్య.. ఎట్టకేలకు లక్షలాదిమంది టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, క్షేత్రస్థాయి పార్టీ సైనికుల ఆత్మలు శాంతించాయి. ఏడునెలల నుంచి చెవినిల్లు కట్టుకుని.. ‘వారిని ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయడం లేద’ంటూ, కట్టలు తెగిన ఆగ్రహంతో కూటమి సర్కారుపై సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడుతున్న సోషల్‌మీడియా పసుపుదళాలు.. వైసీపీ తో నేరుగా తలపడి అన్ని రకాలుగా నష్టపోయిన టీడీపీ క్షేత్రస్థాయి యోధుల ఆత్మలు.. జమిలిగా శాంతించాయి. కారణం.. నిండు సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భార్యపై నోరుపారేసుకున్న.. గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీని, హైదరాబాద్ నుంచి విజయవాడకు పట్టుకువచ్చి అరెస్టు చేయడమే!

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముద్దాయి అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీని, పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చారు. కృష్ణలంక పోలీసుస్టేషన్‌లో దాదాపు 8 గంటల విచారణ తర్వాత, ఆయనకు వైద్యపరీక్షలు చేసి ఎస్టీఎస్టీఅట్రాసిటీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.

గన్నవరం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వంశీ అనుచరులపై, అందులో పనిచేసే సత్యవర్ధన్ అనే ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా అదే సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారు, తనను పోలీసులు బెదిరించి వంశీ అనుచరులపై ఫిర్యాదు చేయించినందున, తాను ఆ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టులో చెప్పడం సంచలనం సృష్టించింది. దానికి సంబంధించి తాను మాట్లాడిన వీడియోను కూడా కోర్టుకు సమర్పించాడు.

దానితో అనుమానం వచ్చిన పోలీసులు తీగలాగితే వంశీ డొంక కదిలింది. ఫిర్యాదుదారుడిని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి, తాము చెప్పించిన మాటలను వీడియో తీసి, దానిని ఫిర్యాదుదారుడి చేతనే కోర్టుకు ఇప్పించారని తేలింది. పైగా సత్యవర్దన్ కొద్దిరోజులపాటు కనిపించకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీసింది. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సత్యవర్ధన్ ఆచూకీని అన్వేషించగా, అతనిని వేరొక ప్రాంతంలో బంధించినట్లు తేలింది.

దళితుడైన సత్యవర్ధన్‌ను తీసుకువచ్చిన పోలీసులు.. అతని ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే వంశీని, హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇక వంశీ అనుచరులైన ఎలిమినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిని విజయవాడలోనే అరెస్టు చేశారు. వీరందరిపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసుతోపాటు, కిడ్నాప్ కేసు కూడా పెట్టారు. బీఎన్‌ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్ 3(5) కేసులు నమోదు చేశారు.

కాగా టీడీపీనేత శ్రీనివాసరావు షాపు కూల్చివేత, యార్లగడ్డ వెంకట్రావైపు హత్యాయత్నం, రంగబాబుపై దాడి కేసు, హనుమాన్‌జంక్షన్ నకిలీ ఇల్లపట్టాల కేసులోనూ వంశీపై కేసులు ఉన్నాయి. ఇదీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరె స్టు కథ.

నిజానికి వంశీని ఇప్పటివరకూ అరెస్టు చేయని కూటమి సర్కారు అసమర్ధత-వైఫల్యంపై.. పార్టీ శ్రేణులు సోషల్‌మీడియా వేదికగా, గత ఏడునెలల నుంచి నిప్పులు కురిపిస్తున్నారు. ‘‘పోలీసులు, ప్రభుత్వ లాయర్లు నిద్రపోతున్నారా? చంద్రబాబు భార్యను నిండుసభలో నానా మాటలు అన్న వంశీని, చంద్రబాబును అడ్డగోలు మాటలు మాట్లాడిన కొడాలి నానిని అరెస్టు చేసి జైల్లో వేసే ధైర్యం లేకపోతే ఇక రెడ్‌బుక్ ఎందుకు? అసలు ఇందుకోసమేనా మనం ప్రభుత్వంలోకి వచ్చింది? దీనికోసమేనా మేం ఆ రాక్షసుడిపై సర్వం పణంగా పెట్టి యుద్ధం చేసింది’’ అంటూ, ఎల్లోవారియర్స్ శరపరంపరగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

గత మూడునెలల నుంచి నెల్లూరులో అయితే సోషల్‌మీడియా వేదికగా టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి-వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వైసీపీ హయాంలో భూములు, గనులు దోచేసిన కాకాణి సంగతి తేల్చేస్తామని సోమిరెడ్డి వర్గం హెచ్చరిస్తోంది. అయితే తమ నేతను ఏమీ చేయలేరని, కాకాణిపై ఈగ వాలినా సహించేది లేదని వైసీపీ వారియర్లు సవాళ్లు విసురుతున్నారు.

తమకు కూటమి ప్రభుత్వం ఏమీ పీకలేదంటూ నేరుగానే పోస్టులు పెడుతున్న వైనం.. నెల్లూరు జిల్లా తమ్ముళ్ల రక్తం ఉడికిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకూ కాకాణిపై కూటమి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే. పైగా వైసీపీ హయాంలో కాకాణి ఏరికోరి తెచ్చుకున్న పోలీసు, రెవిన్యూ అధికారులను.. ఒక సీనియర్‌మంత్రి ఏరికోరి తన నియోజకవర్గంలో నియమించుకోవటం తమ్ముళ్లకు పుండుమీద కారం చల్లినట్లుంది. వైసీపీ హయాంలో వారంతా టీడీపీ నేతలను వేధించిన వారే కావటం దానికి కారణం.

తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇదే సీన్. తమను నానా రకాలుగా వేధించిన ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబంపై, ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని గోదావరి తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

వంశీ ఒక్కరేకాదు. వైసీపీ హయాంలో చంద్రబాబు కుటుంబం, పవన్‌పై చెలరేగి దారుణంగా మాట్లాడిన నాటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్, ద్వారంపూడి, గుడివాడ అమర్నాధ్‌ని ఇప్పటిదాకా అరెస్టు చేయని ప్రభుత్వ వైఫల్యంపై.. సోషల్‌మీడియా సైనికులు విరుచుకుపడుతూనే ఉండటం, అటు ప్రభుత్వానికి -పార్టీకీ ఇబ్బందికరంగా పరిణమించింది.

వీరిలో కొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడాన్ని పార్టీ సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ లాయర్లు వారిని జైలుకు పంపించడంలో విఫలమవుతున్నారని, సమర్ధులైన లాయర్లను నియమించకపోవడం వల్లనే.. పార్టీని వేధించిన వారంతా బెయిల్ తెచ్చుకుంటున్నారని, సోషల్‌మీడియా వే దికగా విరుచుకుపడుతున్నారు.

తాజాగా మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన 40 మందికి పైగా వైసీపీ కార్యకర్తలకు, బెయిల్ రావడంపై తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రభుత్వ లాయర్లు ఎంత సమర్ధవంతంగా ఉన్నారో, ఈ వ్యవహారం స్పష్టం చేస్తోందని విరుచుకుపడుతున్నారు. అధికారం రాగానే చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, నరేంద్ర, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమల అరెస్టును మర్చిపోయారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దానితో ఈ వ్యవహారం, పార్టీ నాయకత్వానికి సహజంగానే సమస్యగా పరిణమించింది. వీటిని ఎలా పరిష్కరించాలో అర్ధం కాని పరిస్థితి.

క్షేత్రస్థాయిలో వైసీపీతో యుద్ధం చేసిన కార్యకర్తలు.. ముఖ్యంగా పార్టీ కోసం నిరంతరం పనిచేసే సోషల్‌మీడియా సైనికుల త్యాగాలతోనే కూటమి గద్దెనెక్కింది. వారిలో జగన్ జమానాలో అరెస్టయి, జైళ్లకు వెళ్లిన బాధితులూ ఉన్నారు. అందువల్ల వారి మనోభావాలను పక్కనపెట్టలేని పరిస్థితి. అలాగని జగన్ మాదిరిగా అడ్డగోలుగా వ్యవహరించి, అరెస్టులు చేయలేని పరిస్థితి.

పార్టీపై చెలరేగిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడం ద్వారా, వారికి శిక్షలు విధించాలన్నది పార్టీ నాయకత్వ ధోరణి. జగన్ మాదిరిగా చేస్తే జగన్‌కు-తమకు తేడా ఏమిటన్నది టీడీపీ నాయకత్వ అసలు వైఖరి. ఈ ప్రక్రియలోనే నిందితులపై చర్యలు సహజంగా ఆలస్యమవుతుంది. పైగా వీటికోసం జగన్ మాదిరిగా టీడీపీ నాయకత్వం నమ్మకమైన అధికారి, కనీసం మాజీ అధికారిని కూడా నియమించుకోలేదు. కానీ ఈ సినిమా కష్టాలు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పార్టీ జెండా మోసి, వీధుల్లో యుద్ధం చేసిన పార్టీ సైనికులకు అవసరం లేదు. జగన్ మాదిరిగా తక్షణ న్యాయం.. లేదా తక్షణ చర్యలు తీసుకున్నారా? లేదా? జగన్ మాదిరిగా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అన్నదే వారి వాదన.

ఈ ఆశ నిరాశల ఆరాట సమయంలో.. బాబు కుటుంబాన్ని తిట్టిపోసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు, లక్షలాదిమంది పార్టీ సైనికుల్లో ఫుల్ జోష్ నింపింది. తమ కోరిక ఆలస్యమైనప్పటికీ, ఎట్టకేలకూ నెరవేరిందని ఖుషీ అవుతున్నారు. వంశీ అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారంటే.. వారి మానసిక పరిస్థితి ఏమిటన్నది స్పష్టమవుతుంది.

‘మేమేమీ ప్రభుత్వంలో పదవులు కోరుకోవడం లేదు. చంద్రబాబు కుటుంబాన్ని, పార్టీ నేతలను వేధించి జైలుపాలుచేసిన వారిని జైలుకు పంపించమంటున్నాం. మా కోరిక తప్పుకాదు కదా? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ పనికూడా చేయకపోతే మమ్మల్ని లోకల్‌గా వైసీపీ వాళ్లు ఎందుకు కేర్ చేస్తారు? మీరు మమ్మల్ని ఏమీ పీకలేరని ఓపెన్‌గానే సవాల్ చేస్తారు కదా? మరింక మనం గెలిచి ఎవరికి ఉపయోగం? జగన్ మాదిరిగా చేయమనడం లేదు. కనీసం వాళ్లపై కేసులు పెట్టి కోర్టులకు తిప్పాలి కదా అని మాత్రమే అడుగుతున్నాం. ఇప్పుడు వంశీని అరెస్టు చేసిన వార్తతో మా ఆనందం అంతా ఇంతా కాదు. మిగిలిన వాళ్లను కూడా ఇలాగే అరెస్టు చేయమంటున్నాం’’ అన్న కామెంట్లు సోషల్‌మీడియాలో పెడుతున్నారు.

అయితే.. వంశీ అరెస్టు నేపథ్యంలో టీడీపీ నాయకత్వం తీసుకున్న వ్యూహాత్మక అడుగులు పరిశీలిస్తే.. పార్టీని వేధించిన ఎవరినీ విడిచిపెట్టే ఉద్దేశం లేనట్లు స్పష్టమవుతూనే ఉంది. కాకపోతే కార్యకర్తల మాదిరిగా తక్షణ చర్యలు కాకుండా.. వంశీ కేసు మాదిరిగా ఉచ్చు బిగించడం ద్వారా, వారిని దీర్ఘకాలం జైలులో ఉంచాలన్న లక్ష్యం నాయకత్వంలో కనిపిస్తోంది.

అయితే దానిని కార్యకర్తలు అర్ధం చేసుకోకపోవడమే ఇబ్బందిగా ఉందని, కనీసం వంశీ కేసును చూసయినా.. పార్టీ వ్యూహాన్ని అర్ధం చేసుకుంటున్నారని ఆశిస్తున్నామని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

‘‘పార్టీ అధినేత కుటుంబాన్ని, పార్టీ నేతలను దూషించి జైళ్లకు పంపేందుకు కారకులైన వైసీపీ నేతలను మేం ఎందుకు వదిలేస్తాం అనుకుంటారు? కాకపోతే మనం జగన్ మాదిరిగా చేయం. న్యాయపరంగానే వారందరికీ శిక్షలు వేయిస్తాం. అప్పటిదాకా కార్యకర్తలు సంయమనంతో ఉండాలి. ఇప్పుడు మీరే చూశారు కదా వంశీని ఎలా కేసులో బిగించామో? మిగిలిన వారికీ ఆ సమయం వస్తుంది. కాకపోతే కొంత ఆలస్యం కావచ్చు. అంతమాత్రాన పార్టీని విమర్శిస్తే ఎలా? కార్యకర్తల ఆవేశం-విమర్శల వల్ల నాయకత్వం-ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. కార్యకర్తల విమర్శల వల్ల అనేక నిర్ణయాలు మార్చుకోవలసి వచ్చింది. ఇచ్చిన పోస్టింగులను కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య పరిపాలన చేస్తే ఫలితాలు ఎలా వస్తాయి? మళ్లీ మనం అధికారంలోకి ఎలా వస్తామన్న ఆలోచన లేకపోతే ఎలా? అలాగని వారి త్యాగాలను తక్కువ చేయడం లేదు. కానీ పరిస్థితులను కూడా చూసుకోవాలి కదా’’ అని ఆ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE