Suryaa.co.in

Editorial

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంశీచంద్‌రెడ్డి?

  • వంశీకి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మద్దతు?

  • రేవంత్ వ్యతిరేకవర్గ మద్దతు వంశీచంద్‌రెడ్డికే

  • వంశీకి కలసివచ్చిన ఏఐసిసి సంబంధాలు

  • రేవంత్ వర్గం నుంచి ఎంపి చామల పోటీ

  • రోహిన్‌రెడ్డిని కూడా వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిన రేవంత్

  • వంశీ రాకుండా చూసేందుకు రేవంత్ వర్గం వ్యూహాలు

  • రేణుకా చౌదరికి ప్రచార కమిటీ పగ్గాలు?

  • గ్రేటర్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు సీటు దక్కని వైనం

  • సెటిలర్లు, కమ్మవారిని ఆకర్షించేందుకు రేణుకకు ప్రచారకమిటీ పగ్గాలు?

  • మైనారిటీ నేత కోసం అన్వేషణ

  • పరిశీలనలో షబ్బీర్‌అలీ, ఫయీమ్, ఓ ఉర్దు దినపత్రిక యజమాని?

  • ఫయూమ్‌కు ఇవ్వకపోతే ఎమ్మెల్సీ చాన్స్?

  • మైనారిటీ కోటాలో షబ్బీర్‌అలీకే వర్కింగ్ ప్రెసిడెంట్?

  • అజారుద్దీన్ వల్ల ఉపయోగం లేదన్న భావన
    ( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గంపై కసరత్తు తీవ్రతరమవుతోంది. ప్రధానంగా ప్రెసిడెంట్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఏఐసిసి యువనేత వంశీచందర్‌రెడ్డి, భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరి పేర్లు రెడ్డి కోటాలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితీ వంశీకి.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గంతోపాటు, ఏఐసిసి ఆఫీసు ప్రముఖుల ఆశీస్సులున్నట్లు సమాచారం. అటు ఎంపి చామలకు సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు దండిగా ఉంది. అయితే రేవంత్ ముందుజాగ్రత్తగా రెడ్డి వర్గం నుంచి.. తన మద్దతుదారైన చామలను మాత్రమే కాకుండా, తన సన్నిహితుడైన డాక్టర్ రోహిన్‌రెడ్డిని కూడా తన ఆప్షన్‌గా బరిలోకి దింపినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కాగా ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. రెడ్డికోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం పోటీపడుతున్న వారిలో, సీనియర్ నేత వంశీచంద్‌రెడ్డి వైపే నాయకత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరు దాదాపు ఖరారయినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. వంశీచంద్‌రెడ్డికి సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా సీనియర్ల మద్దతు బలంగా ఉంది.

అదీగాక.. చాలాకాలం నుంచి జాతీయ రాజకీయాల్లో ఉన్న వంశీచంద్‌కు, ఏఐసిసి కార్యాలయ ప్రముఖులతో సంబంధాలు అక్కరకు రానున్నాయి. ప్రధానంగా ఐఏసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆశీస్సులు, ఆయనకు పుష్కలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో వంశీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖాయమన్నది స్పష్టమవుతోంది.

అదీకాకుండా తొలి నుంచి పార్టీ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న వంశీచంద్‌రెడ్డి, పార్టీకష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్నారు. ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్న వంశీకి మంచి ఆర్గనైజర్ అన్న పేరుంది. ఏఐసిసి కార్యదర్శి హోదాలో కర్నాటక వంటి రాష్ట్రానికి ఇన్చార్జిగా పనిచేశారు. ఇటీవలి ఎంపి ఎన్నికల్లో బలమైన బీజేపీ అభ్యర్ధి డికె అరుణకు గట్టిపోటీ ఇచ్చి, ఓడిపోయారన్న సానుభూతి నాయకత్వానికి లేకపోలేదంటున్నారు. ఇది కూడా వంశీకి కలసివస్తున్న అంశంగా పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

అయితే వంశీచంద్‌రెడ్డికి పోటీగా, సీఎం రేవంత్‌రెడ్డి వర్గం బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. రెడ్డి కోటాలో వంశీకి వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కకుండా ఉండేందుకు.. అదే సామాజికవర్గం నుంచి భువనగిరి యువ ఎంపి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని, సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా బరిలోకి దింపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒక్క చామలను మాత్రమే కాకుండా.. ముందుజాగ్రత్తగా తన సన్నిహితుడైన డాక్టర్ రోహిన్‌రెడ్డిని మరో ఆప్షన్‌గా ఎంచుకుని, వ్యూహాత్మకంగా బరిలోకి దింపినట్లు పార్టీ వర్గాలు చె బుతున్నాయి.

తన సన్నిహితుడైన రోహిన్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ రాకపోయినా.. ప్రధాన కార్యదర్శి లాంటి కీలక పదవి ఇప్పించుకునే వెసులుబాటు ఉంటుందనేది మరో దూరాలోచన అంటున్నారు. ఆరకంగా పిసిసి ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులన్నీ తన సన్నిహితులకే ఇప్పించుకోవడం ద్వారా, పార్టీపరంగా తలనొప్పి రాకుండా చూసుకోవడమే కాకుండా.. వైఎస్ తరహాలో పార్టీపైనా పట్టు సాధించాలన్నది, రేవంత్ లక్ష్యంగా కనిపిస్తోందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

కానీ ఏఐసిసికి తరచూ ఫిర్యాదులు చేసే రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం.. సీఎంను వ్యతిరేకించే తొలినుంచి కాంగ్రెస్‌లో ఉన్న నేతలను, పీసీసీలో ఉంచాలని ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. నిజానికి వంశీచంద్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే, ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తారన్నది సీఎం రేవంత్ ఆందోళన అని, అందుకే ఆయన బదులు.. తన వర్గీయుడికి ఆ పదవి ఇప్పించుకునే ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాహుల్‌గాంధీ, ఏఐసిసి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్న వంశీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే, పీసీసీలో సమానపాలన సాగిస్తారన్న ఆందోళన కూడా రేవంత్‌లో లేకపోలేదంటున్నారు.

అదీగాక ఇటీవల ఎంపి ఎన్నికల్లో వంశీ ఓటమికి రేవంత్ వర్గమే కారణమన్న ప్రచారం అప్పట్లో ఉధృతంగా సాగిన విషయం తెలిసిందే. అందుకే ఆయన రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో లేకపోలేదు. అయితే ఆ ఎన్నికల్లో రేవంత్ వర్గం కష్టపడి పనిచేయడం వల్లే వంశీకి అన్ని ఓట్లు వచ్చాయని, వంశీని ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఎందుకు ఉంటుందని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. అది వేరే విషయం.

ఇక మైనారిటీ కోటా నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కొనసాగించే అవకాశాలు లేవంటున్నారు. ఆయన వల్ల మైనారిటీలు పార్టీవైపు ఆకర్షితులయ్యే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదని.. గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటిచ్చినప్పటికీ, ముస్లిములు ఉన్న ప్రాంతాల్లో సైతం, ఆయన ఓట్లు వేయించుకోలేకపోయారంటున్నారు. పైగా ఆయనకు కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పటికీ, ఆ పదవిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో లేకపోలేదు.

ఆ క్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫయూమ్, ఫిరోజ్‌ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో నాంపల్లిలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్‌ఖాన్‌కు దూకుడు ఎక్కువున్న నేతగా పేరుంది. మజ్లిస్‌ను ఎదుర్కొనే బలమైన నేతగా పేరున్నప్పటికీ, ఆయన వ్యవహారశైలి కొందరికి నచ్చడం లేదంటున్నారు. ఒకవేళ యువకుడైన ఫిరోజ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే, పాతబస్తీలో కాంగ్రెస్ బలపడటం ఖాయమన్న భావన పార్టీ వర్గాల్లో లేకపోలేదు.

ఆయనకు స్థానికంగా హిందువుల్లోనూ, సానుకూలత ఉండటం కలసివచ్చే అంశమంటున్నారు. నిజంగా పాతబస్తీలో పార్టీ బలపడాలని నాయకత్వం భావిస్తే, ఫిరోజ్‌ఖాన్‌కు ఆ పదవి ఇవ్వడమే సమంజసమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులకు నిధుల పంపిణీ కార్యక్రమానికి నాయకత్వం వహించి, అందులో సక్సెస్ అయిన ఫయీమ్ కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. రేవంత్‌కు నమ్మినబంటుగా పేరున్న ఆయనకు, ఇప్పుడు తెరవెనుక కొన్ని కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. అయితే ఆయనకు ఏ కారణంతోనయినా వర్కింగ్ ప్రెసెడెంట్ పదవి రాకపోతే.. ఫయీమ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మైనారిటీ కోటాలో, మంత్రివర్గంలో తీసుకున్నా ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు. ఇక మజ్లిస్‌ను వ్యతిరేకించే ఒక ఉర్దు దినపత్రికకు చెందిన యజమాని కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయనను మజ్లిస్ వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ సమీకరణల నేపథ్యంలో మైనారిటీ కోటా నుంచి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదీగాక అటు మజ్లిస్ కూడా ఫిరోజ్‌ఖాన్, ఫయీమ్, ఉర్దు దినపత్రిక యజమానికి బదులు, షబ్బీర్ అలీ పేరు సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల మజ్లిస్ స్నేహం కోసం ఆ పార్టీ సూచించిన షబ్బీర్‌అలీ వైపే నాయకత్వం మొగ్గుచూపే అవకాశం లేకపోలేదంటున్నారు.

నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో షబ్బీర్ అలీకి, నాటి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గులామ్‌నబీ ఆజాద్‌తో సన్నిహిత సంబంధాలుండేవి. మాజీమంత్రి దానం నాగేందర్‌కు సైతం ఆజాద్‌తో సత్సంబంధాలుండేవి. వీరితోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే ఒక ప్రముఖ టీవీ చానెల్ అధిపతికి సైతం, ఆజాద్‌కు సత్సంబంధాలుండేవన్నది బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు ఆజాద్ కాంగ్రెస్‌ను వీడటంతో, షబ్బీర్ అలీ కర్నాటకకు చెందిన మైనారిటీ నేతల ద్వారా తన ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక ప్రచార కమిటీ కన్వీనర్ పదవిని ఎంపి రేణుక చౌదరికి ఇస్తే బాగుంటున్న సూచన వ్యక్తమవుతోంది. పిసిసి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను బీసీ, రెడ్డి, మైనారిటీ, ఎస్సీకి ఇస్తున్నందున.. ప్రచార కమిటీ కమ్మ వారికి ఇస్తే కులసమీకరణ కూర్పు సమంగా చేసినట్లు ఉంటుందని, కొందరు నేతలు కెసి వేణుగోపాల్‌కు సూచించినట్లు తెలుస్తోంది. పైగా గత ఎన్నికల్లో సెటిలర్లు, కమ్మ వర్గం ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు సీటు రాకపోవడాన్ని వారు కేసీ వేణుగోపాల్ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కోణంలో తెలంగాణలో ఫైర్‌బ్రాండ్‌గా అందరికీ తెలిసిన సీనియర్ నేత రేణుకాచౌదరికి ప్రచార కమిటీ చైర్మన్ పగ్గాలు అందించాలన్న యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

జానారెడ్డికి స్టీరింగ్ కమిటీ పగ్గాలు?

కాగా సీనియర్ నేత జనారెడ్డికి స్టీరింగ్ కమిటీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మళ్లీ పుంజుకోవడం, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటం, బీజేపీ సైతం పార్టీని విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీకి దిక్సూచి-పెద్దదిక్కు అవసరమవుతోంది. ప్రస్తుతం రేవంత్ దగ్గర అనుభవజ్ఞులైన వారు లేకపోవడం, ఉన్న సలహాదారు కేవలం రేవంత్ కోసమే పనిచేస్తుండటం, సరైన వ్యూహబృందం లేకపోవడం వల్ల.. జానారెడ్డి లాంటి అనుభవజ్ఞుడికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఇవ్వడం ద్వారా, ఆ లోటును భర్తీ చేయనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ పార్టీ ఇన్చార్జి దీపాదాస్‌మున్షీ సైతం జానారెడ్డి సేవలు అవసరమని గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం మౌనంగా ఉన్న జానారెడ్డికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ అప్పగించడం ద్వారా, మళ్లీ ఆయనను క్రియాశీల రాజకీయాల్లో ఉండేలా చూడాలన్నది వారి అభిమనమంటున్నారు.

ప్రస్తుతం ఉన్న వ్యూహబృందాలు, సోషల్‌మీడియా బృందాలన్నీ పార్టీ కోసం కాకుండా.. రేవంత్‌ను వ్యక్తిగతంగా ఎలివేట్ చేసేందుకు మాత్రమే పనిచేస్తున్నాయని, అవన్నీ ఆయన సొంతంగా నియమించుకున్న బృందాలేనని పార్టీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి.

అదీగా భవిష్యత్తులో సీనియర్ల మధ్య విబేధాలు రాకుండా, సమన్వయం నెరపాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే సోనియా-రాహుల్‌తో సత్సంబంధాలున్న ఓ సీనియర్ మంత్రి తరచూ రేవంత్‌ పనితీరు-నిర్ణయాలపై, ఏఐసిసికి ఫిర్యాదులు చేస్తున్నారన్న ప్రచారం లేకపోలేదు. ప్రస్తుతానికి మిగిలిన సీనియర్లు వివిధ కారణాలతో మౌనంగా ఉన్నప్పటికీ, ఆ మౌనం ఎక్కువకాలం కొనసాగకపోవచ్చన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వ్యూహాలను రాజకీయంగా తిప్పికొట్టడం, సీనియర్ల మధ్య సమన్వయం కోసం పెద్దమనిషి, వివాదరహితుడు, అందరివాడిగా పేరున్న జానారెడ్డికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. ఆయన సేవలు ఆ రకంగా వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా రానున్న మునిసిపల్, స్థానిక ఎన్నికల్లో అర్హులైన అభ్యర్ధులను గుర్తించడం, టికెట్లు రాని నేతలు తిరుగుబాటు చేయకుండా బుజ్జగించడం కత్తిమీదసాములాంటిది. అలాంటివాటిలో సుదీర్ఘ అనుభవం ఉన్న జానారెడ్డి సేవలు ఇప్పడు అవసరం అని పార్టీ సీనియర్లు కూడా వేణుగోపాల్, దీపాదాస్ మున్షీకి సూచించినట్లు చెబుతున్నారు.

LEAVE A RESPONSE