వెలగపూడి సీతారామయ్య జీవితం ఆదర్శప్రాయం

– ‘శ్రీ వెలగపూడి సీతారామయ్య గారి జీవిత సంగ్రహం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం

విజయవాడ: రైతాంగం, అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక క్షోభపై దివంగత వెలగపూడి సీతారామయ్య పడిన ఆత్మక్షోభను అర్ధం చేసుకోవలసి ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. సీతారామయ్య జీవితం ఆదర్శప్రాయమని నివాళులర్పించారు. విజయవాడలో ‘శ్రీ వెలగపూడి సీతారామయ్య గారి జీవిత సంగ్రహం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు.. వ్యవసాయరంగంపై సీతారామయ్యకు ఉన్న అపార అవగాహన, ఆసక్తి, ఆవేదన భావితరాలకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. ఆయన జీవితంలో ఎదురయిన కీలకమైన ఘట్టాలతో పుస్తకం ప్రచురించిన ఆయన కుమారుడు వెలగపూడి గోపాలకృష్ణను వక్తలు అభినందించారు. ఈ పుస్తకాన్ని అందరూ చదవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యకమానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, బీజేపీ ఫీడ్‌బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.