Advertisements

విజయసాయిరెడ్డి  తొందరపడ్డారా?
విధేయ ప్రకటన అవసరమా?
ఇప్పుడెందుకీ స్వయంశీలపరీక్ష?
విబేధాల పుకార్లకు భయపడుతున్నారా?
అనుమానాలకు ఆయనే తెరలేపారంటున్న వైసీపీ సీనియర్లు
     (మార్తి సుబ్రహ్మణ్యం)

నిప్పులేకుండా పొగరాదు. కానీ మీడియా, అందునా సోషల్‌మీడియాలో అసలు నిప్పే లేకుండా పొగవస్తుంటుంది. పొగ లేకుండా నిప్పు కూడా రాజుకుంటుంది. అసలు సోషల్ మీడియా అంటేనే అమ్మా నాన్న లేని అనాధ. అందులో ఎవరు ఎవరిపైనయినా బురద చల్లవచ్చు. చాలా వీజీగా వ్యక్తిత్వ హననం చేయవచ్చు.  వైసీపీ సోషల్‌మీడియాను తన భుజస్కంధాలపై మోస్తున్న వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డికి ఈ రహస్యం తెలియనిది కాదు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీకి చెమటలు పట్టించి, టన్నుల కొద్దీ బురదపోసి బాబు అండ్ కోని భ్రష్టుపట్టించిన ఆ పార్టీ సోషల్‌మీడియాకు ఆయనే సారథి! మరి అంత సూక్ష్మం తెలిసిన  వేణుంబాక.. ‘నేను జీవితాంతం జగన్‌కు విధేయుడినే’నని ఇప్పుడు కొత్తగా ప్రకటించుకోవడమే, వైసీపేయులను విస్మయపరుస్తోంది.

చంచల్‌గూడ నుంచి తాడేపల్లి వరకూ అంతా ఆయనే..

వేణుంబాక విజయసాయిరెడ్డి.. వైసీపీలో ఇప్పటివరకూ జగనన్న తర్వాత అన్నింటా ఆయనే నెంబర్ టూ. చంచల్‌గూడ నుంచి తాడేపల్లి ప్రస్థానం వరకూ ఆ నెంబరును ఆయన విజయవంతంగా పోషిస్తున్నారు. జగన్‌కు కష్టాలు-నష్టాలు-సుఖాలలో వెన్నంటి నడిచిన వ్యక్తి.  నిజానికి జగన్ ఇప్పుడు ఈ స్థానంలో ఉండ టానికి విజయసాయి పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకరకంగా ఆయన జగన్ కోసం తన జీవితం త్యాగం చేశారు. జగన్ కోసమే పాపాలభైరవుడి అవతారమెత్తారు. అలాంటిది ఒక సమయంలో రాజ్యసభ సీటు దక్కకపోతే విదేశాలకు వెళ్లిపోదామనుకున్న వ్యక్తి కూడా ఆయనే.  జగన్ కోటరీలో ఇప్పుడు ప్రముఖపాత్ర పోషిస్తున్న ఒకరిద్దరు ఆయనను పట్టించుకోని సమయంలోనూ, జగన్ కోసమే జీవించిన నాయకుడు విజయసాయిరెడ్డి. ఆయన చదువు, దానివల్ల అబ్బిన విజ్ఞానం, మేధస్సు, వ్యూహం, సమన్వయం, ఓర్పు, కలివిడితనం, పట్టుదల, తెగింపు అన్నీ కలసివెరసి జగన్‌ను సీఎంగా పట్టాభిషిక్తుడిని చేశాయన్నది మనం మనుషులం అన్నంత నిజం.

వైసీపీలో అంతా విజయసాయి!

జగన్‌తో పాటు జైలు శిక్ష అనుభవించిన సహచరుడిగా విజయసాయికి వైసీపీ కొట్టినపిండి. శ్రీకాకుళం నుంచి పిడుగురాళ్ల వరకూ, ఎవరేమిటో ఆయనకు తెలిసినంతగా బహుశా జగన్‌కూ తెలియకపోవచ్చు. జైలులో కూడా జగన్ తన మీడియా, ప్రైవేటు సర్వే సంస్థల నుంచి తెప్పించుకునే సర్వేలపై, ఆయనతోనే కలసి కసరత్తు చేసేవారు. జగన్-విజయసాయిరెడ్డి బృందం చంచల్‌గూడ జైలులో ఉండగా, అప్పట్లో నేను పనిచేసిన ఓ మీడియా సంస్థ అధిపతి కూడా జైలులో ఉండేవారు. ఆ సందర్భంగా శని, ఆదివారం మినహా ప్రతిరోజూ జైలుకు వెళ్లే నాకు విజయసాయితో 16నెలల పరిచయం ఉంది. చాలా విషయాలు చర్చించేవారు. ఒక్కోసారి జోకులేసేవారు. ‘మనమంతా ఉద్యోగులం. వీళ్లంతా యజమానుల’ని మా సంస్థ అధిపతినుద్దేశించి జోకులేసేవారు. ఆయన ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కాకపోతే లాయర్ల ఎంపిక, వారి పారితోషికం విషయంలో ఇప్పుడు జగన్ వద్ద ఉన్న ఓ సలహాదారు వైఖరిపై మస్తాపం చెందేవారు. అప్పట్లో జగన్ సొంత మీడియా సంస్థ వ్యవహారాలు ఆయనే చూసేవారు. అయినా విజయసాయి జగన్‌కు విధేయుడిగానే ఉండేవారు.  జగన్ కూడా ఆయనను బాబాయ్ అని పిలిచేవారు. ఇదీ చంచల్‌గూడ జైలులో నేను స్వయంగా చూసిన జగన్-విజయసాయి అప్పటి అనుబంధం.

అభ్యర్ధుల ఎంపికలో అంతా ఆయనే..

తొలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల ఎంపిక అప్పట్లో జైలు నుంచే జరిగింది. ఆశావహులు జైలులో ఉన్న జగన్-విజయసాయిరెడ్డిని కలిసేవారు. జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ఆర్ అప్పుడు జైలు బయట నుంచి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించి, సమన్వయపరిచేవారు. జగన్‌ను కలవాలనుకున్న వారి పేర్లు లోపల ఉన్న జగన్‌కు పంపించడం, ఆయన అంగీకరించిన వారే లోపలకు వెళ్లి జన్‌తో మాట్లాడటం జరిగేది. ఒక్కో సందర్భంలో ఫలానా నేత, లేదా ఫలానా పారిశ్రామికవేత్త, లేక టీడీపీలో ఉన్న బలమైన నేత సమర్ధుడని నివేదికలు వస్తే, వారిని జైలుకే పిలిపించి మాట్లాడేవారు. మొన్నటి ఎన్నికల ముందు కూడా ఆశావహులు ముందు విజయసాయినే కలిసేవారు. వారి ఆర్ధికపరిస్థితి, నియోజకవర్గంలో పలుకుబడి అన్నీ బేరీజు వేసుకున్న తర్వాతనే, వారిని జగన్ ముందు ప్రవేశపెట్టేవారు. అభ్యర్ధులు-పార్టీ ఆర్ధికపరమైన వ్యవహారాలు విజయసాయే చూశారు. వైఎస్ జీవించినంతవరకూ కెవిపి ప్రమేయం లేకుండా ఒక్కరికీ ఎలా సీటు రాలేదో, విజయసాయి ప్రమేయం లేకుండా జగన్ ఒక్కరిటీ టికెట్ ఇవ్వలేదన్నది నిర్వివాదం.

వైఎస్‌కు కెవిపి.. జగన్‌కు విజయసాయి!

వైఎస్ జీవించి ఉండగా కెవిపి రామచంద్రరావు ఆయనకు ఆత్మగా ఉంటే, జగన్‌కు వేణుంబాక కూడా అలాంటి ఆత్మవంటివారే. వైఎస్ రాత్రి ఎనిమిదిన్నర తర్వాత పార్టీ-ప్రభుత్వం గురించి మర్చిపోయి హాయిగా నిద్రపోతే, కేవీపీ వాటిని చక్కబెట్టేవారు. విజయసాయి మాత్రం జగన్ మెలకువగా ఉన్నా, పార్టీ-ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. జగన్-రిలయన్స్ అంబానీ మధ్య ఎంత శత్రుత్వం ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన తండ్రి మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందని జగన్, ఆయన తల్లి సహా వైసీపీ నేతలు ఆరోపించారు. అలాంటి అంబానీకి సన్నిహితుడైన నత్వానీని జగన్‌తో కలిపించడం ద్వారా, వారిద్దరి దూరాన్ని తగ్గించడంలో విజయసాయి పోషించిన భూమిక కీలకం. విపక్షంలో ఉన్నప్పటినుంచీ… బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించిన టీడీపీని దాని నుంచి దూరం చేసి, జగన్‌ను బీజేపీకి చేరువ చేయడంలో విజయసాయిరెడ్డి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.

బీజేపీని బాబు నుంచి విడదీసిన విజయసాయి..

ఎప్పుడూ పీఎంఓలో తిష్టవేయడం ద్వారా, టీడీపీ నాయకత్వంలో బీజేపీపై అనుమానాలు కల్పించడం ద్వారా, వారి బంధాన్ని విజయవంతంగా విడదీయడంలో విజయసాయి సఫలీకృతులయ్యారు.అప్పట్లో ఆంధ్రజ్యోతి కూడా ఆ వ్యూహంలో ఇరుక్కుని.. పీఎంఓలో ఉన్న విజయసాయి ఫొటోలు వేసి, బాబులో అనుమానం పెంచేందుకు తనవంతు సాయం చేసింది.  అలాంటి విజయసాయి.. ఇప్పుడు, పార్టీ-ప్రభుత్వంలో  నెంబర్‌టూ. మంత్రులకు ఆ నెంబరు ఎప్పటికీ దక్కదు. ఎంపీల్లో ఉంటే గింటే మిధున్‌రెడ్డి ఉంటారేమో? ఢిల్లీలో పార్టీ ఎంపీలు ఎంత సీనియర్లయినా, విజయసాయి అనుమతిలేనిదే ఏ ఒక్క కేంద్రమంత్రినీ కలవడానికి వీల్లేదని జగన్ గీత గీశారు. రఘురామకృష్ణంరాజు తప్ప, మిగిలిన ఎంపీలంతా ఆ గీతదాటే ధైర్యం ఈరోజుకీ చేయడం లేదంటే.. విజయసాయిపై జగన్‌కు ఎంత గురో అందరికీ అర్ధమవుతుంది. అసలు విజయసాయి లేని జగన్‌ను గానీ, జగన్ లేని విజయసాయిరెడ్డిని గానీ ఊహించుకోవడం చాలా కష్టం.

ఎందుకీ స్వయం శీలపరీక్ష?

జగన్-విజయసాయి బాంధవ్యం, అనుబంధం గురించి బయట ప్రపంచంతోపాటు, పార్టీ నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేని నేపథ్యంలో.. స్వయంగా విజయసాయిరెడ్డే ‘నేను జగన్‌కు జీవితాంతం విధేయుడినే’నని కొత్తగా ప్రకటించుకోవడం, అందరినీ విస్మయపరిచింది. విశాఖను రాజధానిగా చేసేందుకు తెరవెనుక జరుగుతున్న పరిణామాలకు సూత్రధారిగా ఉన్న విజయసాయి.. ఎవరో కొత్త నాయకుడి మాదిరిగా అధినేత పట్ల విధేయత ప్రకటించుకోవడం, ‘స్వయం శీలపరీక్ష’గానే భావించక తప్పదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన తొందరపడ్డారా? లేక నోరుజారారా? అదీకాకపోతే పార్టీలో తనకు విరోధులున్నారన్న సంకేతాలను అనుకోకుండా బయటపెట్టారా?  ఇవన్నీ కాకపోతే,  తనకూ-జగన్‌కూ మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సంకేతాలను,  ఆయనే తన ప్రకటన ద్వారా ఇచ్చారా? అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.

విశాఖ ఘటన తర్వాత తగ్గిన విజయసాయి..

విశాఖ ఎల్జీపాలిమర్స్‌లో ఘటన జరిగిన రోజు, విమానంలో జగన్‌తోపాటు వెళ్లాల్సిన విజయసాయిరెడ్డి.. జగన్ కారులో కూర్చుని, రెండు క్షణాల్లోనే కిందికి దిగిన వీడియో బయటకు పొక్కడంపై పార్టీలో విజయసాయి పాత్రపై చర్చలకు తెరలేచింది. ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని కొందరు, జగన్ ఆయనను దూరంగా పెట్టారని మరికొందరు చర్చలు ప్రారంభించారు. అసలు జగన్, ఆయన విధేయుల అనుమతి లేకుండా.. సీఎం ఇంట్లో  వీడియో తీయడం, దాన్ని లీక్ చేసే ధైర్యం కూడా ఎవరూ చేయరు. అలాంటిది ఆ రెండూ జరిగిపోయాయంటే, దాని వెనుక పార్టీలోని విజయసాయి ప్రత్యర్ధుల పాత్ర ఉందన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. దానికి తగినట్లుగానే.. అటు విజయసాయి కూడా దానిపై చాలారోజులు స్పందించకపోవడం జరుగుతున్న ‘అనుమానపు చర్చల’ను నిజం చేసినట్టయింది.ఇది కూడా చదవండి: విజయసాయి జగన్ కారు ఎందుకు దిగిపోయారు?

కారు ఘటన తర్వాత విజయసాయి మౌనం..

ఎప్పుడూ ట్విట్టర్‌లో చురుకుగా ఉంటూ, ప్రత్యర్ధులపై దాడి-ఎదురుదాడి చేసే విజయసాయి.. తనను కారు నించి దించేసిన వీడియో లీక్ అయిన తర్వాత చాలారోజులపాటు మౌనంగా ఉండటం, కొద్దిరోజులు విశాఖకు దూరంగా ఉండటం కూడా.. విజయసాయిపై జరుగుతున్న చర్చలు నిజమేనేమో అనిపించేందుకు ఒక కారణమయింది. చాలారోజుల తర్వాతనే ఆయన ‘విమానంలో సీఎంతోపాటు విశాఖకు నేను వెళ్లే కంటే, వైద్యశాఖమంత్రి వెళితే బాగుంటుందని నేనే కిందకు దిగాన’ని సమాధానం చెప్పాల్సివచ్చింది.

వెంటాడుతున్న వెంకన్న ట్వీట్లు..

అప్పటినుంచీ ఇప్పటివరకూ విజయసాయిపై, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అదే అంశాన్ని గుర్తు చేస్తూ ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు జగన్‌కు తాను ఎప్పటికీ విధేయుడినేనంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలనూ బుద్దా వెంకన్న  విడిచిపెట్టలేదు. ‘కారు దింపేసి ఒగ్గేసినాడు. నిన్నోగ్గేసి ఢిల్లీ వెళ్లిపోతాండు. పగోడికి కూడా ఇంత కష్టం రాకూడదు. కష్టం మనుషులకు కాకపోతే పశువులకు వస్తాదా? అప్రూవర్‌గా మారే సమయం ఆసన్నమయింది. లేకపోతే బాత్‌రూం సీన్ సిద్ధంగా ఉంద’ని విజయసాయిపై వెంకన్న ట్వీట్ చేశారు. విజయసాయి లేకుండానే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని వెంకన్న ప్రత్యేకించి చెప్పడం బట్టి, ఆయనను పక్కనబెడుతున్నారన్న సంకేతం వెంకన్న ట్వీట్‌లో ధ్వనించింది.

ఆయనేమైనా కొత్త నాయకుడా..?

అయితే.. జగన్‌కు కొత్త నాయకుడి మాదిరిగా.. విజయసాయిరెడ్డి వంటి కీలక నేత, విధేయత ప్రకటించుకోవడం కచ్చితంగా తొందరపాటేనని వైసీపీలో ఆయనను అభిమానించే నేతలు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల ద్వారా ఆయనే కొత్త ఆలోచనలు, కొత్త చర్చలకు అవకాశమిచ్చారంటున్నారు. పార్టీలో సోషల్‌మీడియా సహా అన్ని వ్యవహారాలూ తానే చూసుకుంటున్నానని ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడమంటే, తన శీలపరీక్షను నిరూపించుకునే మాదిరిగానే కనిపిస్తోందంటున్నారు. దీన్ని బట్టి జగన్ ఆయనను అనుమానిస్తున్నారన్న కొత్త అంశానికి, ఆయనే ఆస్కారమిచ్చినట్టయిందంటున్నారు. ‘విజయసాయి గారే ఎక్కడయినా నె ంబర్‌టూ. జగన్ ఆయనను అనుమానించే అవకాశమే ఉండదు. ఆయన చేసిన సిఫార్సులే నడుస్తున్నాయి. సీఎంఓ అధికారులు కూడా ఆయన చెప్పిందే చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన జగన్‌కు విధేయత ప్రకటించుకోవడం అంటే, శీలపరీక్ష చేసుకోవడం లాంటిదే. నిజానికి అంత అవసరం ఆయనకు లేదు. కానీ విజయసాయి చేసిన వ్యాఖ్యలు మాత్రం పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న చర్చలు, ఆసక్తికి కారణమయ్యాయి. పైగా సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారన్న వార్తలు మీ మీడియాలో కూడా వస్తున్నాయి.  బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని విజయసాయి గారు అలా చెప్పి ఉండవచ్చేమో? ఇప్పుడు మా పార్టీ నేతల మధ్య ఇలాంటి సంభాషణలనే జరుగుతున్నాయి. ఏదిఏమైనా విజయసాయి చేసిన వ్యాఖ్యలు తొందరపాటుగానే కనిపించాయ’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటివి ప్రమాదమే..

ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని విజయసాయి చెప్పడం, ఆ మేరకు ఓ టీవీ చానెల్ పేరు కూడా ప్రస్తావించడం  పార్టీ నేతలను ఆశ్చర్యపరుస్తోంది. అంటే మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలు, జగన్ నమ్మే ప్రమాదం ఉన్నట్లు విజయసాయి కూడా నమ్ముతున్నట్లే ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రాంతీయ పార్టీలో ఇలాంటివి చాలా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని, టీడీపీలో కొన్ని దశాబ్దాలు పనిచేసిన  వైసీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. టీడీపీలో ఎన్టీఆర్-నాదెండ్ల మధ్య కూడా తొలుత ఇలాంటి అభిప్రాయాలు, సొంత పార్టీ నేతల చాడీలు కలసి వెరసి.. పార్టీని చీల్చి, నాదెండ్లను బయటకు పంపేందుకు కారణమయ్యాయని గుర్తు చేశారు.

గతంలో ఎన్టీఆర్-నాదెండ్ల మధ్య ఇలాగే..

వైసీపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను గతంలో ఎన్టీఆర్-నాదెండ్ల ఎపిసోడ్‌ను సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ‘అధినేత సీటుకు ఎసరు తెస్తున్నారని ఫిర్యాదు, చాడీలు చెప్పేవారు చాలామంది ఉంటారు. సహజంగా అధినేత తర్వాత రెండో స్థానంలో ఉన్నవారు ఏ ప్రాంతీయ పార్టీలోనయినా వెంటనే సొంత పార్టీ నేతల లక్ష్యానికి బలవుతుంటారు. ఎందుకంటే అధినేత వద్దకు వెళ్లాలంటే రెండో స్థానంలో ఉన్న వారి అనుమతి అవసరం. సీనియర్లు దీనిని ఎక్కువకాలం భరించలేరు. దీర్ఘకాలం మంత్రులుగా చేసిన వారు, మరొకరిముందు చేతులుకట్టుకుని కూర్చోవడాన్ని అవమానంగా భావిస్తుంటారు. అధినేతలు కూడా వాటిని ఆసక్తిగా వింటారు. ఇవన్నీ మేం ఎన్టీఆర్ దగ్గర చూసినవే.   తెలివైన అధినేతలితే వెంటనే నష్టనివారణ చర్యలు తీసుకుంటారు. కానీ అందరూ చంద్రబాబులా తెలివైన వారుండరు. నాకు తెలిసి మా పార్టీలో ఈ వ్యవహారం, టీ కప్పులో తుపానేననుకుంటా. ఎందుకంటే విజయసాయికి జగన్ వద్ద స్వేచ్ఛగా మాట్లాడే చనువు ఉంది. వారిద్దరి మైండ్‌సెట్ ఒకటే కాబట్టి, పెద్ద సమస్య ఉండదుకుంటా’నని ఆ మాజీ మంత్రి.. విజయసాయి వ్యాఖ్యల అనంతర పరిణామాలు విశ్లేషించారు.

Leave a Reply