Suryaa.co.in

Andhra Pradesh

ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ డ్యాం సందర్శన

– టి. లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ తెలుగు ప్రజలకు గర్వకారణం. పదుల వేల కుటుంబాలకు జీవనాధారం. ఈ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా, 1967 ఆగస్టు 4న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసి ప్రారంభించారు. నాగార్జునసాగర్ డ్యాం శంకుస్థాపన సందర్భంగా ప్రాజెక్టును ఆధునిక దేవాలయంగా జవహర్ లాల్ నెహ్రూ అభివర్ణించారట. ఆ ఆధునిక దేవాలయాన్ని మా డాక్టరమ్మ ప్రశాంతి కొల్లితో కలిసి నేను సందర్శించాను. చాలా సంతృప్తి చెందాను.

1974లో నేను ఇంటర్మీడియేట్ బైపీసీ చదువుతున్నప్పుడు “బొటానికల్ టూర్”లో భాగంగా నాగార్జునసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు వద్ద అభివృద్ధి చేసిన “బొటానికల్ గార్డెన్” సందర్శనకు మా బోటనీ లెక్చరర్ వెంకటేశ్వరరెడ్డి తీసుకెళ్ళారు. కమ్యూనిస్టు భావజాలం వైపు నా ఆలోచనలను మళ్ళించిన మా హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎం.సి. ఆంజనేయులు తమ్ముడు ఆంజనేయులు(ఇద్దరి పేరు ఒకటే) అప్పుడు నాగార్జునసాగర్ దగ్గర ఇంజనీర్ గా పని చేస్తుండేవారు. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, మా బృందాన్ని డ్యాంలోని వివిధ ముఖ్యమైన భాగాల్లోకి స్వయంగా వెంటబెట్టుకొని తీసుకెళ్ళి చూపించి, ప్రాజెక్టును గురించి సవివరంగా తెలిపారు. నాకు నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల జిజ్ఞాసను ప్రేరేపించిన పర్యటన అది.

నాగార్జునసాగర్ డ్యాంకు దిగువ భాగంలో, జలవిద్యుత్ కేంద్రానికి పక్కన అభివృద్ధి చేసిన ఉద్యానవనం నాడు నాకు అత్యంత ఆహ్లాదాన్ని కలిగించింది. అందులో పెంచిన పలురకాల పూల మొక్కలు, ఇతర వృక్ష జాతుల గురించి మా వృక్షశాస్త్ర అధ్యాపకులు వెంకటేశ్వరరెడ్డి పూసగుచ్చినట్లు చాలా చక్కగా వివరించి విజ్ఞానాన్ని పాదుకొల్పారు. ఆ అనుభూతి నేటికీ పదిలంగా ఉన్నది. నాటి నాగార్జునసాగర్ సందర్శనే జలవనరుల లభ్యత – అభివృద్ధి – వినియోగం – నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఆవశ్యతపై అధ్యయనం పట్ల నాలో ఆసక్తిని రేకెత్తించింది. 1975-78 కాలంలో తిరుపతి, ఎస్.వి. ఆర్ట్స్ కాలేజీలో బి.కాం విద్యార్థిగా ఉన్నప్పుడు, “కరవు పీడిత రాయలసీమ ఎడారి నివారణకు కృష్ణా జలాల మళ్లింపే ఏకైక పరిష్కార మార్గం” అన్న ప్రధానమైన డిమాండుతో 1977 నవంబరు 17న “రాయలసీమ సమగ్రాభివృద్ధికి విద్యార్థి – యువజన సదస్సు” పేరుతో దాదాపు వెయ్యి మందితో త్యాగరాయ గాన సభ ఆడిటోరియంలో సదస్సు నిర్వహించడంలో నేను ప్రధాన భూమిక పోషించాను. అంతటి ప్రభావాన్ని నాగార్జునసాగర్ డ్యాం పర్యటన నాపై కలిగించింది. నాటి నుంచి నేటి వరకు జలవనరులు, నీటిపారుదల ప్రాజెక్టుల అంశాలపైన అధ్యయనం నా జీవితంలో అంతర్భాగమైనది.

నాగార్జునసాగర్ డ్యాం సందర్శనకు మూడు, నాలుగు దఫాలు వెళ్ళాను. చారిత్రక ప్రాధాన్యత ఉన్న నాగార్జున కొండపైకి వెళ్ళాను. పలు దఫాలు డ్యాం పైనుంచి రాత్రిపూట బస్సుల్లో ప్రయాణించాను. నాగార్జునసాగర్ డ్యాం సందర్శనకు వెళ్ళడమంటే నాకు నిజంగానే ఒక ఆధునిక దేవాలయానికి వెళ్ళిన అనుభూతికలుగుతుంది. అలాంటి అనుభూతే నిన్నటి సందర్శన కలిగించింది. కానీ, కొంత అసంతృప్తి కూడా కలిగింది.

నాగార్జునసాగర్ డ్యాం దిగువ భాగంలోను, డ్యాం ముఖ్యద్వారం ఎదురుగా ఉన్న ఉద్యానవనాల నిర్వహణ, అభివృద్ధి పట్ల ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధకనబరచకపోగా, నిర్లక్ష్యంతో గాలికి వదిలేసిందన్న భావన కలిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 మేరకు నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ సాంకేతికంగా తెలంగాణ ప్రభుత్వానిదే కావచ్చు! కానీ, ప్రాజెక్టు తెలుగు జాతి ఉమ్మడి ఆస్తి. దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి, పరిరక్షించుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపైన ఉన్నది. ఆధునిక దేవాలయంగా, ఉత్తమశ్రేణి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన పూర్తిగా కొరవడింది.

తెలుగు రాష్ట్రాల పాలకులు ఒకసారి పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కృష్ణా నదిపై నిర్మించిన ఆలమట్టి డ్యాం, తుంగభద్ర నదిపై నిర్మించిన తుంగభద్ర డ్యాం, కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ డ్యాం వద్ద అభివృద్ధి చేసిన అత్యంత ఆకర్షణీయమైన ఉద్యానవనాలను సందర్శించివస్తే బహుశా జ్ఞానోదయం కలుగుతుందేమోనన్న ఆశ! అంతే!

LEAVE A RESPONSE