Suryaa.co.in

Andhra Pradesh

బాధితులను ఆదుకోవడంలో మేము సైతం..

-25,000 మంది బాధితులకు టమాటా బాత్ ప్యాకెట్లు పంపిన రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు

రాజమహేంద్రవరం: విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు మేము సైతం అంటూ పెద్ద మనసుతో సాయానికి ముందడుగు వేశారు. జైలు పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ నేతృత్వంలో పాతిక వేల మందికి టమాటా బాత్ (ఉప్మా) ప్యాకెట్లు సిద్ధం చేసి గురువారం తెల్లవారుజామున విజయవాడకు పంపించారు.

జిల్లా కలెక్టర్ ప్రశాంతి వారి ఆదేశాల మేరకు, జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ ప్రోద్బలంతో ఖైదీలు శ్రమించి టమాటా బాత్ తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్ లోని 300 గ్రాముల ఉప్మాను ప్రత్యేక ప్యాక్ లలో పొట్లం గా కట్టారు. కలెక్టర్ పర్యవేక్షణలో వీటిని విజయవాడలోని బాధితులకు అందించేందుకు పంపించారు. పర్యవేక్షణాధికారి దగ్గరుండి స్వీయ పర్యవేక్షణలో ఈ అల్పాహారం తయారు చేయించారు.

గతంలో కరోనా సమయంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు లక్ష మాస్కులు తయారుచేసి (కుట్టి) ఇవ్వటం గమనార్హం. ఖైదీలు మానసిక పరివర్తన ద్వారా పెద్ద మనసు చేసుకొని ఇలాంటి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడంలో, సెంట్రల్ జైల్లోంచే తమ వంతు మానవతా సహాయాన్ని అందించడం ఎంతో ఆనందమని సూపరింటెండెంట్ శ్రీరామ్ రాహుల్ పేర్కొన్నారు.

ఆపదలో బాధితులను ఆదుకోవటం మానవత్వమని ప్రత్యక్ష నిదర్శనం అని అన్నారు. ఈ జల విపత్తు వేళ దాతలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు.ఈ అవకాశాన్ని చ్చిన జిల్లా కలెక్టర్, జైలు శాఖ డీజీ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడిన ఖైదీలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు , అభినందనలు తెలిపారు.

LEAVE A RESPONSE