నరహంతకులతో పోరాడుతున్నాం…ధైర్యంగా నిలబడండి!

• నెల్లూరులో ఉన్నది ఆకురౌడీలే…తిరగబడితే పారిపోతారు
• అమరావతి రైతుల బసను అడ్డుకుంటారా…పదిరెట్లు శాస్తిచేస్తాం
• వారిది కిరాయి మూక…మనది 70లక్షల సైన్యం
• అధికారపార్టీపై వ్యతిరేకతను ఓటుబ్యాంకుగా మలచడంలో నేతల వైఫల్యం
• ఎన్నికల్లో తెగువచూపిన కార్యకర్తకు రాష్ట్రస్థాయి పదవి
• నెల్లూరు సమీక్షలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
అమరావతి: నా 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశా…పెద్దపెద్ద గూండాలను చూశా…నెల్లూరులో ఇప్పుడున్న ఆకురౌడీలు నాకో లెక్కకాదు… వారి కథ తేలుస్తా…ధైర్యంగా ఉండండి…ఆకురౌడీలకు భయపడకండి…నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలకు అభయమిచ్చారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై చంద్రబాబునాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల కోసం సొంత కుటుంబసభ్యులను చంపేసిన ఫ్యాక్షనిస్టులు, నరహంతులతో మనం పోరాడుతున్నాం…వారిని దీటుగా ఎదుర్కోవాలే తప్ప పారిపోకూడదని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదు, ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు…మనది 70లక్షల సైన్యం…అందరం కలసికట్టుగా తిరగబడితే పారిపోతారు…ఎవరూ భయపడొద్దని అన్నారు. నెల్లూరు ప్రజలు శాంతికాముఖులు…మాఫియాలను, గూండాలను సింహపురి ప్రజలు ఆదరించిన దాఖలాలు చరిత్రలో లేవని అన్నారు.
ఇకపై నేను ముందుండి పోరాడతా….నా వెనుక కలసిరండి….వారి సంగతి చూద్దామని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నెల్లూరు నగరాన్ని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశాం, 40వేల ఇళ్లు టిడ్కో ఇళ్లు కట్టాం…చేసినది చెప్పుకోవడంలో విఫలమయ్యాం, అధికారపార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచడంలో నేతలు విఫలమయ్యారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరులో నాయకత్వ లోపం స్పష్టం కన్పిస్తోంది…ప్రక్షాళన చేసి తీరుతామని అంటూ 15రోజుల్లో సమర్థులతో నెల్లూరులో అన్ని డివిజన్ లో కమిటీలు ఏర్పాటుచేస్తామని అన్నారు.
అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే సర్వేపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కనీసం వారు బసచేయడానికి, భోజనం చేయడానికి కూడా స్థలం ఇవ్వకుండా చేశారు… రాబోయే రోజుల్లో వారికి పదింతలు గుణపాఠం చెబుతా…రాసిపెట్టుకోండని చంద్రబాబునాయుడు అన్నారు. ప్రత్యర్థుల బెదిరింపులకు తలొగ్గకుండా ఎన్నికల సందర్భంగా ధైర్యసాహసాలను ప్రదర్శించిన రాచగిరి చంద్రశేఖర్ అనే యువకుడ్ని రాష్ట్ర పార్టీలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు. బెదిరింపులకు తలొగ్గకుండా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడే వారికి వారి ఆర్థికస్థోమతతో సంబంధం లేకుండా గుర్తింపు ఇస్తామని, నెల్లూరుకు చెందిన మరికొందరు యువకులకు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
వారికి అధికారం, డబ్బు, అంగబలం, పోలీసులు ఉన్నారు…మనకు ప్రజాబలం ఉంది…ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమనిర్ణేతలు, రాబోయే ఎన్నికల్లో విజయం మనదే, ప్రజాక్షేత్రంలో ధైర్యంగా పోరాడాలని కేడర్ కు పిలుపునిచ్చారు. కొందరు ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగిపోయారు, ఈ ఎన్నికలను గుణపాఠంగా తీసుకుందాం, ఒక నాయకుడు వెళ్లిపోయిన చోట పదిమందిని తయారుచేస్తానని తెలిపారు. జరిగిందేదో జరిగిపోయింది…ప్రస్తుతం నాకు కావాల్సింది ఎదురొడ్డి పోరాడే సైనికులు…ప్రత్యర్థులకు లొంగిపోయే బలహీనులు, కోవర్టులు కాదని అన్నారు.
గత సమావేశంలో పలు ఫిర్యాదులు రావడంతో షోకాజ్ నోటీసు జారీచేసిన రవికుమార్ చౌదరి సమావేశంలో వివరణ ఇవ్వగా, చంద్రబాబునాయుడు సంతృప్తి చెందారు. ఇకపై పార్టీకోసం కష్టపడి పనిచేయాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ సీనియర్ నేతలు బిసి జనార్దనరెడ్డి, దామచర్ల సత్య, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు పార్లమెంటు ఇన్ చార్జి అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply