– జైభీమ్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్ : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆశయాల మేరకు సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ కలలుకన్న సమాజాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఈనెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, అంబేద్కర్ ఉత్సవాల కమిటీ ఛైర్మన్ డాక్టర్ వీసాల మల్లేష్ ఆధ్వర్యంలో జైభీమ్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను గురువారం నాడు మంత్రిగారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు నగరంలో నిర్వహించే సూటు- బూటు ర్యాలీని జయప్రదం చేయాలని అన్నారు. బషీర్ బాగ్‌లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుంది.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, అంబేద్కర్ ఉత్సవాల కమిటీ ఛైర్మన్ డాక్టర్ వీసాల మల్లేష్, కో ఆర్డినేటర్ రాపోలు రాములు, కన్వీనర్లు బొమ్మర స్టాలిన్, గజ్జల మల్లిఖార్జున్, వరలక్ష్మి , బోరెళ్లి సురేష్ తదతరులు పాల్గొన్నారు.