Suryaa.co.in

Andhra Pradesh

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం

– పాల్తూరులో మంచినీటి అవసరానికి 24 గంటల విద్యుత్ సరఫరా
– మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గం, విడపనకల్లు మండలంలోని పాల్తూరు గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్.వితో కలిసి మంత్రి కేశవ్ పాల్గొన్నారు. గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి నెల ఒకటో తారీఖున 4,000 రూపాయలను ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఏదో ఒక గ్రామంలో పర్యటన చేస్తూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఆర్థికంగా ఎంత భారంగా ఉన్నా శక్తినంత వినియోగించి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా పాల్తూరు గ్రామంలో మంచినీటి అవసరానికి సంబంధించి 9 గంటల వ్యవసాయ విద్యుత్తు 25 కే. వి ట్రాన్స్ఫారంను 24 గంటలు పాటు నిరంతరం విద్యుత్ అందించే విధంగా మార్పు చేసి ట్రాన్స్ఫార్మర్లు ప్రారంభించామని మంత్రి తెలిపారు. పాల్తూరులో ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్లను ఒకటో తేదీనే వంద శాతం పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో పెన్షన్ల పంపిణీపై ఉదయం నుంచే మానిటర్ చేస్తున్నామన్నారు. పూర్తిగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ మొక్కలు నాటారు.

LEAVE A RESPONSE