– వెంటిలేటర్ మీద ఉన్న ప్లాంట్‌కు కేంద్ర ప్యాకేజీ జీవం
– గత ఐదేళ్లలో ప్లాంట్‌ను ఎలా అమ్మాలి? వాటాలు ఎలా పంచుకోవాలి?
– ఈ ఆలోచనల్లో గత పాలకులు నిమగ్నమయ్యారు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విమర్శ
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వ దోపిడీ విధానాలకు బలై వెంటిలేటర్ దశకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లతో జీవం పోసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలకు తెలుగుదేశం పార్టీ ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రం 11,440 కోట్ల ఆర్థికసాయాన్ని అందించిన నేపథ్యంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు… విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సెంటిమెంట్… దీన్ని గౌరవించి సహకారం అందించిన కేంద్ర ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి కుమార్ స్వామి, సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, నిర్మలా సీతారామన్, పురందేశ్వరీలు తమ సహాయ సహకారాలు అందించారు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ అందరినీ సమన్వయం చేస్తూ, విశాఖ ఉక్కును కాపాడేందుకు శ్రమించారు.
కూటమి ప్రభుత్వం సమిష్టి కృషితో విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమైంది. కొనఊపిరితో ఉన్న విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు, నిర్వాసితుల మనోభావాలు, కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని అందరం సమిష్టి కృషితో విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. కేంద్రానికి మరోసారి కృతజ్ఞతలు. 1998లో ప్లాంట్ ను బీఏఎఫ్ఆర్డీకి రిఫర్ చేసిన సమయంలో ప్లాంట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు ఉన్నాయి.
ప్లాంటులోని అన్ని శాఖలను సమన్వయం చేయడం, ఆర్థిక పరిస్థితులను అధిగమించడం కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయీ ని ఒప్పించి, ఈక్విటీ షేర్ క్రింద కన్వర్ట్ చేసి రూ.1,333కోట్లు తీసుకొచ్చారు. ఆ సమయంలో యాజమాన్యం, కార్మికుల సమిష్టి కృషితో ప్లాంటును లాభాల బాటలో నడిపించుకునేందుకు మార్గం ఏర్పడింది.
రిజర్వ్ క్యాపిటల్ కూడా సుమారు రూ.10వేల కోట్లకు వెళ్లిపోయింది.. ఆ సమయంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.3 మిలియన్ టన్నుల నుండి 7.3 మిలియన్ టన్నులకు పెంచేందుకు లోన్లు తీసుకొచ్చి పనులు చేశారు. ఆ సమయంలో వచ్చిన కొన్ని విపత్తులు, నిర్వహణ లోపాలు, కార్మికులు, యాజమాన్యానికి మధ్య సమన్వయ లోపంతో మరోసారి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసమయానికి ప్లాంట్ రన్నింగ్ కెపాసిటీ 25శాతం మాత్రమే ఉంది.
25శాతం కెపాసిటీకి తగ్గిపోవడం వల్ల ప్లాంటు నిర్వహణ విషయంలో ఆర్థికభారం అధికమైంది. నష్టాల బాటలోకి వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితిలో సుమారు రూ.1650కోట్లతో దానిని 75శాతం కెపాసిటీకి పెంచి, వెంటిలేటర్ పరిస్థితిలో నుండి లాభాల బాటలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం కృషి చేసింది.
ప్లాంటు కెపాసిటీ మొత్తాన్ని వినియోగించుకుంటేనే ప్లాంటు లాభాల బాటలో వెళుతుందని కేంద్రం గుర్తించి సహకరిస్తోంది. విశాఖ స్టీల్ పై కేంద్రానికి నమ్మకం వచ్చింది, విశాఖ ప్రజల సెంటిమెంట్ ను గౌరవించారు, గుర్తించారు, నాయకులు, కార్మికుల పోరాటాలు, నిర్వాసితుల ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం రూ.11,440 కోట్లను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చింది. ఈ ప్యాకేజీని కేంద్రం ప్రకటించే ముందు ముఖ్యమంత్రి, నాయకులు ప్లాంటు పూర్తి సామర్థ్యంతో రెండు సంవత్సరాలు పనిచేస్తే దీన్ని సెయిల్ లో విలీనం చేయడానికి అవకాశం ఉందని అన్నారు. మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాం… ఇకపై యాజమాన్యం, కార్మికులు ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నిర్వహించే బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని శ్రీనివాస్ అన్నారు.
విశాఖ ఉక్కుకు వచ్చిన డబ్బులు ప్రజా ధనం… భవిష్యత్తు తరాలకు ఉద్యోగావకాశాలు పెంచాలనే ఉద్దేశంతో విశాఖ స్టీల్ ప్లాంటుకు కేంద్రం సహకరిస్తోంది. ప్లాంటును పరిరక్షించే బాధ్యతను మేం తీసుకుంటాం…. బాబు ఉంటేనే ప్లాంటు ఉంటుంది…..ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. కార్మికులు, యాజమాన్యం సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. 0.5 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న ప్లాంటుకే రూ.15వేల కోట్లు ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారు. ప్లాంటు రేటెడ్ కెపాసిటీకి అనుగుణంగా ప్లాంటును నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
విశాఖ ఉక్కు కోసం టీడీపీలో రెండు తరాలు కృషి చేశాయి… చేస్తున్నాయి. విశాఖ ఉక్కు కోసం నేను, గంటా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా చిత్తశుద్ధితో గత ఐదేళ్లలో పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చాక సమిష్టి కృషితో విశాఖ ఉక్కును పరిరక్షించాం. విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నేతలు పిచ్చి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి…. ప్రజలు నవ్వుతున్నారని గ్రహించాలని పల్లా శ్రీనివాస్ అన్నారు.