* ఘనంగా కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది సంబరాలు
* ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నాం
– కేక్ కట్ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిమంత్రి సవిత
అమరావతి : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్బంగా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మొదటి సంవత్సరం విజయోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి మంత్రి సవిత కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్నో ఆశలతో ప్రజలు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. కేవలం ఏడాది కాలంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధితో పాటు సంక్షేమా పథకాలు అమలు చేశామన్నారు.
సూపర్ సిక్స్ లోని పథకాన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. వేద విద్యార్థులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద 67,27,164 మంది విద్యార్థులకు వర్తింపుచేస్తున్నామని, విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.8,745 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేయనున్నామని వెల్లడించారు. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నామన్నారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పించి తీరుతామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామన్నారు. త్వరలోనే నూతన గురువులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వనున్నామన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, ఉచిత ఇసుక అందజేస్తున్నామని తెలిపారు. జగన్ చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్డు రద్దు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు లబ్ఢి కలిగేలా పథకాలు ప్రారంభించామన్నారు.
రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను, పల్లె పండుగ పేరుతో గ్రామీణ రహదారులను నిర్మిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో 12 నెలల కాలంలో రాష్ట్రంలో రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగామన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రానికి అభివృద్ధిపథం వైపు సీఎం చంద్రబాబునాయుడు పరుగులు తీయిస్తున్నారన్నారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ త్వరలోనే దేశంలో అగ్రగామిగా నిలవడం ఖాయామని ఆమె ధీమా వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, డూండీ రాకేశ్, పేరేపి ఈశ్వర్, దేవంద్రప్పతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.