Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడలో సంగీత విభావరికి ఎలా భద్రత కల్పించారు

– కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు
– జగన్‌కు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరాం
– ఎన్నికల కోడ్‌ అంటూ పోలీసులు కుంటి సాకులు చెబుతున్నారు
– పోలీస్‌ భద్రత తొలగించడంపై గవర్నర్‌ ఆశ్చర్యపోయారు
– శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడి

విజయవాడ: మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనల్లో ప్రభుత్వం ఆయనకు ఏ మాత్రం కల్పించడం లేదంటూ.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరు నాగేశ్వరరావుతో పాటు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎం.అరుణ్‌కుమార్‌ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

జగన్, బుధవారం గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా ప్రభుత్వం ఏ మాత్రం భద్రత కల్పించకపోవడాన్ని ప్రస్తావించిన వారు, ఇకనైనా జగన్‌కు రక్షణ కల్పించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
అనంతరం పార్టీ నేతలందరితో కలిసి రాజ్‌భవన్‌ వద్ద మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చూపుతోందని, దురుద్దేశంతోనే ప్రభుత్వం ఆ పని చేస్తోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.

బుధవారం గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా, జగన్‌కు ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రత తొలగించిన విషయాన్ని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. ఇది పునరావృతం కాకుండా విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ నిన్న (బుధవారం) గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్లి రైతులను పరామర్శించారు. ధర లేక నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయాన్ని ఆరా తీసేందుకు ఆయన గుంటూరు వెళ్ళారు. ఈ సందర్బంగా ఆయనకు ఉన్న జడ్‌ ప్లస్‌ భద్రతను పోలీసులు తొలగించారు.

యూనిఫామ్‌తో ఒక్క కానిస్టేబుల్‌ కూడా అక్కడ లేరు. ఆయన భద్రతకే ముప్పు కలిగించేలా పోలీసులు వ్యవహరించారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే అలా వ్యవహరించింది. అందుకే జగన్‌కు రక్షణ కల్పించాలని, చట్టం తన పని తాను చేసేలా చూడాలని గవర్నర్‌గారికి నివేదించాం. జగన్‌కు పోలీసులు భద్రత తొలగించడంపై గవర్నర్‌గారే ఆశ్చర్యపోయారు. తక్షణం దీన్ని పరిశీలిస్తామని, విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఎన్నికల కోడ్‌కు, భద్రతకు ఏం సంబంధం?:
మాజీ సీఎం జగన్‌ జడ్‌ ప్లస్‌ భద్రతను తీసేయడం చూస్తే, ఈ ప్రభుత్వం ఆయనను ఏం చేయాలని అనుకుంటుందో అర్థం కావడం లేదు. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏనాడు ఇలా వ్యవహరించలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో, ఒక దురుద్దేశంతోనే భద్రతను తొలగించింది. ఎన్నికల కోడ్‌కు, బందోబస్త్‌కు సంబంధం లేదు. మాజీ సీఎం అయిన ఆయనకు జడ్‌ ప్లస్‌ భద్రత అన్ని సందర్భాల్లోనూ వర్తిస్తుంది.

ఒకవేళ, ఎన్నికల కోడ్‌ ఉంటే జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించడం కుదరదు అని ముందుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఇదే ఎన్నికల కోడ్‌ విజయవాడలో జరిగిన సంగీత విభావరీ సందర్బంగా ఎందుకు అమలు చేయలేదు? రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మిర్చియార్డ్‌ కు వైయస్‌ జగన్‌ వెడితే ఎన్నికల కోడ్‌ పేరుతో ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు.

అనుమతి లేకుండా మిర్చియార్డ్‌కు వెళ్ళారంటున్న పోలీసులు ముందురోజు మేము సమాచారం ఇచ్చినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుభరోసాను క్రమం తప్పకుండా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయ్యింది. రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చింది కూడా రైతులకు ఇవ్వలేదు.

ఆర్బీకేల ద్వారా మా హయంలో విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఉన్నాం. నేడు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. నేడు దళారీలు రైతులను దోచుకుంటున్నారు. ఎరువులు, విత్తనాల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదని.. వీటన్నింటి వల్ల రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.

LEAVE A RESPONSE