– 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్.
అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం అనంతపురం జిల్లాలో ” కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపైన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మరియు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ లతో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో 20 సూత్రాల కార్యక్రమం చైర్ పర్సన్ లంకా దినకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం వికాసిత భారత్ 2047 అని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష స్వర్ణాంధ్ర 2047 అని, ఈ లక్ష్యంతో చేసే కార్యాచరణ ద్వారానే అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ప్రస్తుత సవాళ్లను అధిగమించి విజయవంతంగా “ వికసిత అనంతపురం “గా దిశగా లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు.
ఈ సమీక్షలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం మరియు 2019- 24 మధ్య జరిగిన అవకతవకలు మరియు ప్రస్తుత అమలు తీరు పైన, ప్రతి గ్రామ పరిధిలోని ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీరు ఇచ్చే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్ జీవన్ మిషన్ అమలు తీరు, అనంతపురం పట్టణంలో అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాలపైన, గ్రామీణసడక్ యోజన, లక్ పతి దీదీ, కళ్యాణ్ అన్నయోజన, పీఎం సూర్య ఘర్ మరియు కుసుమ్, పీఎం ఆవాస యోజన, పీఎం విశ్వకర్మ, మరియు పట్టణ అభివృద్ధి నిధుల వినియోగ ప్రణాళిక, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు, జిల్లాను ఎలెక్ట్రానిక్ వస్తు తయారీ కేంద్రంగా మలచడానికి ప్రణాళికలు మరియు పారిశ్రామికీకరణ అభివృద్ధి తదితర అంశాలపైన సమీక్ష చేయడం జరిగింది.
ఈ సంవత్సరం ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్ 201.63 కోట్లలో ఇప్పటివరకు 115.76 కోట్లు మాత్రమే వ్యయం అయునందున దాదాపు 85 కోట్లు నిధులు మురిగిపోయే ప్రమాదం ఉన్నందున, ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాలు ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చు చేసిన వివరాలను మరియు నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన వివరాలు ఇవ్వమని అధికారులను ఆదేశించారు.
గత 5 సంవత్సరాలలో మెటీరియల్ కాంపోనెంట్ వ్యయం ద్వారా కల్పించిన ఆస్తుల నాణ్యత మరియు నిబంధనలకు విరుద్ధంగా చేసిన వ్యయం పైనా విచారణ చేయమని జిల్లా జాయింట్ కలెక్టర్ కు చెప్పడం జరిగింది. ఒక రోజుకు ఉపాధిహామీ వేతనం రూ. 300 అయితే జిల్లాలో సగటున రూ.263.20 మాత్రమే, మిగతా జిల్లాలకన్నా సగటు వేతనం బాగానే చెల్లిస్తున్నప్పటికీ ఇంకా పెంచేందుకు కృషి చేయాలన్నారు. గత 5 సంవత్సరాలు జల్ జీవన్ మిషన్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత లేకుండా 2019-24 మధ్య పనులు చేయడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాలు జిల్లా చేరుకోలేక పోయిందని మరియు నిధులు దుర్వినియోగం జరిగిందని, సమీక్షకు అధికారులు సరైన సమాచారంతో రావాలని ఆదేశించడం జరిగింది.
పీఎం సూర్య ఘర్ పథకం అమలులో వేగం పెంచాలి, ఈ పథకం క్రింద కనిష్ఠంగా 30 వేలు, గరిష్టంగా 78 వేలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. స్వయం సేవ గ్రూపులతో అనుసంధానం అయ్యి నిర్దేశించిన లక్ష్యాలు అందుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ పథకం క్రింద 5,268 రిజిస్ట్రేషన్లు పూర్తి అయినా, ఇన్స్టాలేషన్ చాలా మందగమనంగా కేవలం 785 మాత్రమే అయ్యాయి, ఎస్సీ, ఎస్టీల సర్వీసులు 71,170 ఈ కేటగిరీ వర్గాల పైన ప్రత్యేక దృష్టి అవసరమని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, ఏపీఎస్పీడిసిల్ ఎస్ఈ సంపత్ కుమార్, సిపిఓ అశోక్ కుమార్, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, డ్వామా పిడి సలీం భాష, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ప్రతాప్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.