కానీ మోడీ ప్రభుత్వానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ది లేదు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరు వల్ల వచ్చే పదేళ్ల వరకు మహిళా బిల్లు అమలులోకి వచ్చే పరిస్థితి లేదు
వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలోనే మహిళా బిల్లు అమలులోకి వచ్చే విధంగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్
కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో ప్రతిపాదిస్తున్న మహిళా బిల్లును స్వాగతిస్తున్నాం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.కానీ మోడీ ప్రభుత్వానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ది లేదని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరు వల్ల వచ్చే పదేళ్ల వరకు మహిళా బిల్లు అమలులోకి వచ్చే పరిస్థితి లేదు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలోనే మహిళా బిల్లు అమలులోకి వచ్చే విధంగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లు తీరును గమనిస్తే.. వచ్చే ఎన్నికలలో మహిళా బిల్లు రిజర్వేషన్లు వర్తించవు అని స్పష్టం అవుతోంది అని వినోద్ కుమార్ తెలిపారు.
2002 లో చేసిన 82 వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాతనే డీ-లిమిటేషన్ జరుగుతుందని, 2031 లో జనాభా గణన ఉంటుందని, వివిధ రకాల ప్రాసెస్ పూర్తి అయిన తర్వాతనే మహిళా బిల్లు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది మోడీ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదని, మహిళా బిల్లుపై మహిళలకు ఆశలు కల్పించి … ఆచరణలో మాత్రం మోడీ ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
2031 లో జన గణన పూర్తయిన తర్వాత అంటే.. మరో పదేళ్ల పాటు మహిళా బిల్లు అంశం కొనసాగుతుందని స్పష్టం అవుతోంది అని వినోద్ కుమార్ అన్నారు. ఆ తరువాత పార్లమెంటులో మళ్ళీ చట్టం చేస్తేనే మహిళా బిల్లు సాధ్యం అవుతుంది అని వినోద్ కుమార్ తెలిపారు.
షెడ్యూలు ప్రకారం 2021లోనే జనగణన ప్ర్రక్రియ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. డిజిటల్ పద్ధతిలోనే జనాభా లెక్కల సేకరణ జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినా 2031లో సెన్సెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని, ఆ లెక్కల ప్రక్రియ పూర్తయ్యి దాని ఆధారంగా డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత మహిళా రిజర్వేషన్ ఖరారు కానున్నదని కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లు ప్రక్రియ స్పష్టం చేస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లు ఆచరణలోకి రావాలంటే రాజ్యాంగానికి సవరణలు (ఆర్టికల్ 230-ఏఏ, 230ఏ, 232ఏ, 334) జరగాల్సి ఉంటుందని, దీనికి అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికీ సవరణలు అనివార్యం అని వినోద్ కుమార్ తెలిపారు.