* జన గణనలో కుల గణనతో రిజర్వేషన్ల పెంపు
* కమండల్ ప్రతినిధి నరేంద్ర మోదీ
* రిజర్వేషన్ల పెంపు తీర్మానంతో దేశానికి దిక్సూచిగా తెలంగాణ
* బీసీ గర్జన సభలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
ఢిల్లీ: రిజర్వేషన్లు పెంచాలనే బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు… ధర్మబద్దమైన కోరిక.. ఆ కోరిక నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకురావాలి.. అలా రాకుంటే ఎర్ర కోటపై జెండా ఎగురవేసి తామే రిజర్వేషన్లను సాధించుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.
విద్యా, ఉద్యోగాలతో పాటు చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను తొమ్మిది షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిర్వహించిన బీసీల పోరు గర్జన సభలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మండు టెండల్లో, గడ్డ కట్టే చలిలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర స్ఫూర్తి, ఆ సమయంలో ఆయన ఇచ్చిన హామీ మేరకే తాము బలహీన వర్గాలకు రిజర్వేషన్లను పెంచుతూ తీర్మానం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలన్నా.. స్థానిక సంస్థల్లో ఇప్పుడున్న రిజర్వేషన్లు కొనసాగాలన్నా జన గణనలో కుల గణన జరగాల్సిందేనని సీఎం అన్నారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జన గణనలో కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. జన గణనలో కుల గణన చేర్చి దాని ఆధారంగా విద్యా, ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ ప్రకటించారని, ఆయన మాటను నిలబెట్టాల్సిన బాధత్య ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో 2023, డిసెంబరు 7న తాము అధికారం చేపట్టిన వంద రోజులు తిరగకముందే బలహీనవర్గాల లెక్కలు తేల్చేందుకు శాసనసభలో తీర్మానం చేశామని, ఏడాది తిరగకముందే కుల గణన పూర్తి చేసి 2024 ఫిబ్రవరి 4న ఆ వివరాలను శాసనసభలో పెట్టామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందుకే ఫిబ్రవరి నాలుగును సోషల్ జస్టిస్ డే గా ప్రకటించామన్నారు. కొలువుల కోసమే తెలంగాణ ఉద్యమం సాగిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయమని గల్లీ నుంచి ఢిల్లీ వరకు యువత పోరాడితే నాటి దుర్మార్గ పాలకుడు ఏ మాత్రం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి విమర్శించారు.
ఎంత కొట్లాడినా.. ఎందరు మరణించినా నాటి పాలకుల చెవులకు ఎక్కలేదని, ఆ సమయంలో పాదయాత్ర చేస్తూ తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టమని తాను చెప్పిన మాటను విశ్వసించి దానిని చేసి చూపించారని సీఎం అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.
బీసీల రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ వ్యతిరేకం
బలహీన వర్గాల రిజర్వేషన్ల పెంపునకు వాళ్లు (బీజేపీ నేతలు) విధానపరంగా వ్యతిరేకులని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ నియమిస్తే.. వీపీ సింగ్ మండల్ కమిషన్ దుమ్ము దులిపి ముందుకు తెచ్చారని సీఎం గుర్తు చేశారు. మండల్ కమిషన్‌పై బీజేపీ కుట్ర చేసి కమండల్ యాత్ర మొదలుపెట్టిందని, ఆ కమండల్ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ అని సీఎం విమర్శించారు. ఇందిరాగాంధీ దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన వారు కాకపోయినా ఆ వర్గాలకు అమ్మలా వ్యవహరించి.. రిజర్వేషన్లు, ఇళ్లు, భూస్వాముల దగ్గర ఉన్న వేల ఎకరాలు గుంజుకొని ఆ వర్గాలకు అందజేసిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
అలా చేయబట్టే నేటికీ దళితులు, ఆదివాసీలు ఇళ్లలో ఇందిరమ్మ ఫొటోలు ఉన్నాయని సీఎం తెలిపారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికి బీజేపీ వ్యతిరేకమని, ఆ వర్గాల లెక్కలు తేల్చాల్చి వస్తుందనే 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేపట్టడం లేదని సీఎం మండిపడ్డారు. రాహుల్ గాంధీ కుల గణన చేయాలని డిమాండ్ చేయడంతో 2025 వచ్చినా జన గణన చేయకుండా వాయిదా వేస్తున్నారని సీఎం ఆరోపించారు. బలహీన వర్గాలకు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం తెలంగాణలో నిలబెట్టుకుందన్నారు.
దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాల్సిందేనని, అందుకే తాము తెలంగాణలో కుల గణన చేపట్టి బీసీల లెక్క తేల్చామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, పరిపాలనలోనూ బీసీలు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగాలు, చట్ట సభల్లో రిజర్వేషన్ల పెంపునకు శాసనసభలో తీర్మానాలు ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ఏకగ్రీవ తీర్మానం చేశామని సీఎం గుర్తు చేశారు. కుల గణన చేపట్టి రిజర్వేషన్ల పెంపు తీర్మానాలు చేసి దేశానికే తెలంగాణ ఓ దిక్సూచిగా నిలిచిందని సీఎం అన్నారు.
తెలంగాణలో తాము రిజర్వేషన్లు పెంచితే కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వచ్చిన ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టలేదని సీఎం విమర్శించారు. మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని మేం కోరితే ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.
హస్తినకు వచ్చాం… ఇక రాం
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అయిదు ఊళ్ల కోసం కృష్ణుడు రాయబారానికి వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయిననూ పోయి రావలె హస్తినకు అనే రీతిలోనే తాము హస్తినకు వచ్చామని… తెలంగాణలో ఆమోదించిన తీర్మానాలను పార్లమెంట్‌లో ఆమోదిస్తే 10 లక్షల మందితో సభ పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా గుండె చప్పుడు పంచుకోవాలని, మా అభిప్రాయాలు వినాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మాపై ఆధిపత్యం చలాయించాలనుకున్న నిజాంలకు, గడీల దొరలకు ఏమైందో తెలుసుకోవాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి సూచించారు. బుక్కెడు బువ్వ పెట్టినా, మంచినీళ్లు ఇచ్చినా మర్చిపోని బలహీన వర్గాలను మీరెందుకు పట్టించుకోరని ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చట్టసభల్లో మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్, 370 రద్దు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను దేశ ప్రజలపై రుద్దారని సీఎం విమర్శించారు. తెలంగాణలోని అన్ని పార్టీలు సమర్థించిన తీర్మానాలకు ఎందుకు అనుకూలంగా ఉండరని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీసీల రిజర్వేషన్ల పెంపుపై జంతర్‌మంతర్లో 15-16 పార్టీలు ఏకమై మద్దతు ప్రకటించినప్పుడు మీరెందుకు స్పందించరని బీజేపీ నేతలను సీఎం ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారని, ఆయన ప్రాణం తమకు వద్దు.. వందేళ్లు ఆయన జీవించాలని… రిజర్వేషన్లు పెంచితే చాలునని సీఎం తెలిపారు. మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకునేందుకు తాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరామని, గుజరాత్ ,ఇతర రాష్ట్రాల్లో పెంపున అడగలేదని సీఎం అన్నారు.
తాము గుజరాత్‌లో కుంట భూమి అడగడం లేదని, ఉద్యోగాలు ఇవ్వమనడం లేదని, తెలంగాణలో రిజర్వేషన్లు పెంచితే నరేంద్ర మోదీకి వచ్చే నష్టమేమిటో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. మా పిల్లల చదువులు, ఉద్యోగాలు, పదవులకు రిజర్వేషన్లు అడిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించరని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్ల పెంపు అనే ధర్మమైన డిమాండ్ కోసం తాము హస్తినకు వచ్చామని… ఇకపై ఢిల్లీకి రామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.
ఒకనాడు ధర్మ యుద్ధ సభ పెట్టాలని మంద కృష్ణ మాదిగకు సూచించానని… అలా చేసి ఆయన విజయం సాధించారని.. పరేడ్ గ్రౌండ్‌లో బీసీలు ధర్మయుద్ధ సభ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోతే గద్దె దిగాలి.. లేకుంటే గల్లీలో ఆ పార్టీ గద్దెలను కూల్చాల్సిందేనని సీఎం అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేసి రిజర్వేషన్లు సాధిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సభలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తదితరులు ప్రసంగించారు.