-జనం నమ్మకాన్ని నిలబెడతా…ప్రజల కష్టాన్ని నేను తీసుకుంటా
– వైసీపీ అసమర్ధ పాలనతో ఆర్థిక ఆరోగ్య సూచీలో అట్టడుగున రాష్ట్రం
– గత ఐదేళ్లలో ఆర్ధిక వ్యవస్థ విధ్వంసం..బీహార్ కన్నా పతనం
– సంక్షేమం అని చెప్పుకున్న వైసీపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి
– నాడు ప్రతిపక్షంలో నేను చెప్పిన మాటల్ని నేడు నీతి ఆయోగ్ నిర్ధారించింది
– గతంలో ఎన్నడూ చూడని దారుణ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని పాలన చేస్తున్నాం
– సమస్యలు అధిగమిస్తాం..సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిస్తాం
– రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య సూచీపై ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి : ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం తమదని.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి తీరతామని.. కాస్త ఆలస్యమైనా, ఆర్ధిక సమస్యలున్నా పథకాలు పక్కాగా ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, కోలుకోలేనంతగా విధ్వంసం చేశారని.. చివరికి ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు కూడా పుట్టని స్థితికి దిగజార్చారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
రుణాల రీ షెడ్యూలింగ్ చేయాల్సిందిగా బ్యాంకులను కోరాల్సిన దుస్థితి తీసుకువచ్చారని అన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతోందని, ఈ 7 నెలల్లో తీసుకున్న చర్యలతో వృద్ధి రేటు పెరిగిందని చెప్పారు. వృద్ధి రేటు ఎంత సాధించగలిగితే అంతగా ఆదాయం వస్తుందని చెప్పారు.
సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య సూచీని వివరించారు. ప్రజలకు తాను ఒకటే హామీ ఇస్తున్నానని, తాము చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా.. ఇంకా మెరుగైన పాలన అందిస్తామని, ఇందుకు రాష్ట్రంలో సుస్థిర పాలన అవసరమని అన్నారు. 2019లో టీడీపీ కొనసాగి ఉంటే వృద్ధి రేటు పెరిగేదని వివరించారు.
ఎంత ఆదాయం వస్తే.. అంత సంక్షేమం
రాష్ట్రానికి ఎంత రెవెన్యూ వస్తే దానిని సంక్షేమానికి అంతలా ఖర్చు చేయొచ్చని చెప్పిన ముఖ్యమంత్రి… రాబోయే రోజుల్లో ఎక్కువ మూలధన వ్యయం చేస్తామని, ఆదాయం మార్గాలను అన్వేషిస్తామని.. మళ్లీ అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం చేస్తామని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, తలసరి అప్పులు తగ్గించడం.. తమ ముందున్న లక్ష్యాలని అన్నారు. ‘‘మూడుసార్లు సీఎంగా ఉన్నప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కంట్రోల్‌లోకి రాలేదు. తప్పకుండా గాడిన పెడతాం. కేంద్రం ఆదుకోబట్టే కొంతమేరకు ముందుకెళ్తున్నాం. అమరావతి, పోలవరం పనులు సాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌కు నిధులు ఇచ్చారు.’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
మన ఆరోగ్యంలానే… రాష్ట్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
మన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించుకున్న విధంగానే రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో రోగికి వెంటనే స్టంట్ లేదా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు ఆసుపత్రుల్లో చెప్తుంటారు… ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే శ్వేతపత్రంలో అప్పులన్నీ వివరించాం. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. నీతి ఆయోగ్ నివేదికలు ఈ విధంగా ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు కూడా ఇవ్వలేదు.
అసమర్ధ పాలనతో రాష్ట్రం అధోగతి
అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ ఆర్ధిక ఆరోగ్య పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చి 30 ఏళ్లు అయింది. 1994-95 మధ్య టెక్నాలజీ వచ్చింది. పాలకులు, పాలసీలు రూపొందించేవారు చిత్తశుద్ధితో పనిచేస్తే దేశంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారమవ్వడమే కాకుండా ప్రజల భవిష్యత్తు బంగారమవుతుంది. కానీ అసమర్థ, చేతకాని తనంతో పాలన చేస్తే రాష్ట్రం అధోగతిపాలవుతుంది. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే ఎవరం ఏ పని చేయలేము. ఆనందంగా ఉండలేం.
ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. అలాగే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పుడు ప్రజలకు కూడా ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని అందించలేం, ప్రజలపై పన్నుల భారం పడుతుంది. అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాలి. అభివృద్ధి చేయడానికి డబ్బులు ఉండవు. విష వలయంలో చిక్కుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ తన నివేదిక ద్వారా తెలియచేసింది. నీతి ఆయోగ్ నివేదికను స్వాగతిస్తున్నా.
5 ప్రధాన సూచికలపై నీతి ఆయోగ్ ఫోకస్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్ సర్వే చేసింది. 2014-19 మధ్య పరిస్థితులను అధ్యయనం చేసింది. దీంతో పాటు ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి చేస్తే బాగుండేది. ఎవరి పాలనలో పరిస్థితి ఎలా ఉందో తెలిసేది. 5 ప్రధాన సూచికలు, 9 మైనర్ సబ్ ఇండికేటర్ల ఆధారంగా నీతియో ఆయోగ సర్వే చేసింది. వాటిలో… ఉత్పాదక వ్యయం, రెవెన్యూ లోటు, వడ్డీ చెల్లింపులు, ప్రస్తుత రుణాలు, రుణ సామర్ధ్యం, జీఎస్డీపీ వృద్ధి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది.
బిహార్ కన్నా ఏపీ పతనం
ఆర్థిక ఆరోగ్య సూచీ-2025లో ఒడిసా 67.8 స్కోర్‌తో మొదటి స్థానంలో ఉంటే ఏపీ 20.9 స్కోర్‌తో అట్టడుగున ఉంది. మన రాష్ట్రం కంటే ఒడిస్సా 3 రెట్లు అధికంగా ఉంది. గతంలో బీహార్‌తో పోల్చేవాళ్లం… కానీ బీహార్ కూడా ఏపీ కంటే ఆర్థికంగా బాగుంది. గత ప్రభుత్వం అప్పు తీసుకుని తిరిగి చెల్లించే పరిస్థితి రాష్ట్రానికి లేకుండా చేసింది. బ్యాంకులు, రుణాలిచ్చే సంస్థలు రాష్ట్రానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే గత ప్రభుత్వం ఎమ్మార్వో కార్యాలయాలు, ప్రభుత్వ భూములు తనఖా పెట్టింది. మద్యం ఆదాయాన్ని చూపించి అప్పులు తీసుకొచ్చింది. ప్రజల ఆస్తులను ఇష్టానుసారంగా తాకట్టు పెట్టారు. నీతి ఆయోగ్ ఈ సర్వేను మన రాష్ట్రాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేయలేదు, దేశ ఆర్థిక స్థితిని తెలుసుకునేందుకు చేసింది.
అభివృద్ధికి పైసా ఖర్చు చేయలేదు
మూలధన వ్యయంలో 10 శాతం కూడా అభివృద్ధికి ఖర్చు చేయలేదు. మూలధన వ్యయంలో సామాజిక సేవా రంగంలో 2018-19లో రూ.2,369 కోట్లు ఖర్చు చేస్తే, 2022-23లో కేవలం రూ.360 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఎకనమిక్ సర్వీస్‌లో 2018-19లో రూ.16,691 కోట్లు వ్యయం చేయగా, 2022-23లో రూ.6,684కోట్లు మాత్రమే వ్యయం చేయడం గత ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుంది. 2019-24 మధ్య ఆదాయం, అప్పులు పెరిగాయి… అయినా మూలధన వ్యయంపై తక్కువ వ్యయం చేసి అభివృద్ధిని అటకెక్కించారు. ఆర్థిక వ్యయం వ్యవసాయం, ఇరిగేషన్, పరిశ్రమలు, ఎనర్జీ, రవాణా, గ్రామీణాభివృద్దితో పాటు మరికొన్ని విభాగాలు ముఖ్యమైనవి ఉంటాయి.
సామాజిక సేవ, సామాజిక భద్రత-సంక్షేమం, విద్య, వైద్యం మొదలైనవి వస్తాయి. సామాజిక సేవలో కూడా గత ప్రభుత్వం చేసిందేమీ లేదు. గిరిజనులకు, ఎస్సీలకు ఎక్కువ వ్యయం చేశామని చెప్పారు. అలా చేయకపోగా వచ్చిన డబ్బులు ఏం చేశారో తెలియడం లేదు. ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసి పెట్టారు. 2022-23లో మొత్తం ఖర్చు, తెచ్చిన అప్పులు రూ.67,985 కోట్లు…. అందులో రూ.7,244 కోట్లు మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేశారు. తెచ్చిన అప్పుల్లో కనీసం సగమైనా మూలధన వ్యయానికి ఖర్చు చేస్తేనే ఆదాయం పెరుగుతుంది. అప్పులు తెచ్చి జల్సాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది.? అని ముఖ్యమంత్రి అన్నారు.
కేంద్ర నిధులు దారి మళ్లించారు
రాష్ట్ర సొంత ఆదాయం 2018-19కి 17.10 శాతం ఉంటే 2022-23కి 9.80 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ అప్పులు 16.5 శాతం పెరిగాయి. రెవెన్యూ లోటు 2018-19 మధ్య 13.4 శాతం ఉంటే 2022-23కి 16.2కు పెరిగింది. కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు మళ్లించారు. రుణ సామర్థ్యం స్కోర్ 2014-19కి 22.7 ఉంటే 2022-23 నాటికి సున్నాకు పడిపోయింది. ఆర్థికంగా ఎదిగే మంచి రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. 2014-19 మధ్య తెచ్చిన రూ.1,35,106 కోట్ల అప్పుల్లో ఏటా సగటున 59.15 శాతం మూలధన వ్యయానికి ఖర్చు చేశాం. కానీ గత ప్రభుత్వం రూ.3,06,606 కోట్లు అప్పులు చేసి కేవలం రూ.69,117 కోట్లు మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం కంటే టీడీపీ ప్రభుత్వంలో 36.61 శాతం అదనంగా మూలధన వ్యయం చేశాం.
టీడీపీ ప్రభుత్వంలో ప్రధాన రంగాలపై ఎక్కువగా ఖర్చు చేశాం. వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన రంగాలపై చేసిన మూలధన వ్యయంలో చాలా తేడా ఉంది.
రంగం 2014-19 కోట్లలో 2019-24 కోట్లలో
నీటి పారుదల రూ.47,383 కోట్లు రూ.20, 752 కోట్లు
రవాణా, రోడ్లు, భవనాలు రూ.8,868 కోట్లు రూ.1357 కోట్లు
సోషల్ వెల్ఫేర్ రూ.1045 కోట్లు రూ.405 కోట్లు
మహిళలు, చిన్నారులు, సిటిజన్లకు రూ.375 కోట్లు రూ.186 కోట్లు
ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యునికేషన్ రూ.289 కోట్లు 0
పరిశ్రమలు, కామర్స్ లో 1142 కోట్లు రూ.965 కోట్లు
ట్రైబల్ వెల్ఫేర్ రూ.609 రూ.229 కోట్లు
మౌలిక వసతులు, పెట్టుబడులు రూ.732 రూ.372 కోట్లు
2014-19తో పోల్చుకుంటే గడిచిన 5 ఏళ్లలో మూలధన వ్యయం 60 శాతం దిగజారింది. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. వాటిని పూడ్చడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. మొత్తం మూలధన వ్యయంలో టీడీపీ ప్రభుత్వం రూ.60,879 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.24,267 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
‘‘మేము చేసిన సంస్కరణలు కొనసాగించినట్లైతే వృద్ధి రేటు 15 శాతానికి చేరుకోవడంతో పాటు రూ.7 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగేది. రూ.76 వేల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. తలసరి ఆదాయంలో 2018-19కి 13.21 శాతం గ్రోత్ రేట్ సాధించగా, 2023-24 నాటికి కేవలం 9.61 శాతం తగ్గింది. అంటే వైసీపీ హయాంలో 3.6 శాతం మేర తలసరి ఆదాయంలో గ్రోత్ రేట్ తగ్గింది.
సంక్షోభంలోనూ సంక్షేమాన్ని మరువలేదు
సుధీర్ఘమైన కసరత్తు చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ ను సిద్ధం చేశాం. అప్పటికి వృద్ధి రేట్ 15 శాతం నమోదైతే తలసరి ఆదాయం 45,787 డాలర్లకు చేరుతుంది. ఏపీకి 15 శాతం పైగా గ్రోత్ రేట్ సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం.
దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.895 కోట్లు విడుదల చేశాం. తొలి 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 204పైగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ.5లకే పేదలకు భోజనం పెడుతున్నాం. మెగా డీఎస్సీని ప్రకటించాం. రాష్ట్రాభివృద్ధికోసం ఉచిత ఇసుక, క్లీన్ ఎనర్జీ, నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎమ్ఎస్ఎంఈ పాలసీలను ప్రకటించాం. ఉద్యోగులకు సమయానికి పెన్షన్లు, జీతాలు అందిస్తున్నాం.
7 నెలల్లో రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాం. మూలధన వ్యయంపై ప్రత్యేక దృష్టి పెట్టి రూ.8,258 కోట్లు ఇరిగేషన్, రోడ్లు, ఇతర పనులు చేసి సంపద సృష్టికి బాటలు వేస్తున్నాం. రూ.1,443 కోట్ల నిధులను స్థానిక సంస్థల బలోపేతానికి, 73 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.9,015 కోట్లు విడుదల చేశాం. గత ప్రభుత్వం పెట్టిన పాత బకాయిలు రూ.22,252 కోట్లు విడుదల చేశాం.
ఇంకా చెల్లించాల్సినవి చాలా ఉన్నాయి. 7 నెలల కాలంలో ప్రత్యేక దృష్టి పెట్టి రూ.6,35,568 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం. దీని ద్వారా 4,10,125 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఎన్నికల ముందు మేము చెప్పిన 20 లక్షల ఉద్యోగాల కోసం కసరత్తు చేస్తున్నాం. గూగుల్ వంటి ప్రముఖ సంస్థల రాకతో 10 లక్షల కోట్ల వరకూ పెట్టుబడులు వస్తాయి. అన్ని వ్యవస్థలను పునరుద్ధరించి పరుగులు పెట్టించేలా కార్యక్రమాలు అమలు చేస్తాం.