Suryaa.co.in

Andhra Pradesh

మైనారిటీల సంక్షేమం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం

· మైనారిటీ ల సంక్షేమం, సమృద్ధి, వారి జీవితంలో ఆనందం నింపడం కోసం కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తే పరిశీలించి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
· మైనారిటీ ల అభ్యున్నతికి బడ్జెట్ లో అడిగినన్ని నిధులు కేటాయిస్తామన్న సీఎం
· క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సేవలు వినియోగించుకోవాలని అధికారులకు సూచన
· గ్రామసెక్రటేరియట్ లు కలెక్టరేట్ లా పనిచేస్తున్నాయని కితాబు
· ఉప ముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ బాషా మరియు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ ల సూచనల ప్రకారం మైనారిటీల అభివృద్ధి మరియు సంక్షేమం
: రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ డా.జి.సి. కిషోర్‌ కుమార్‌

ముస్లిం, మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని.. వారి సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేయడం కోసం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ డా.జి.సి. కిషోర్‌ కుమార్‌ వెల్లడించారు. శనివారం విజయవాడ భవానీపురం(హౌసింగ్ బోర్డు కాలనీ, మాళవిక విల్లా)లోని ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ కాన్ఫరెన్స్ హాల్ లో మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా డా. జి.సి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేద మైనారిటీ లను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మైనారిటీల నవరత్నాల అమలుకు భారీగా నిధులు వెచ్చించిందన్నారు. మైనారిటీ ల సంక్షేమం, సమృద్ధి, వారి జీవితంలో ఆనందం నింపడం కోసం కొత్త ప్రతిపాదనలు ఏవైనా తీసుకువస్తే వాటిని పరిశీలించి త్వరలో మైనారిటీ ల శ్రేయస్సు కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నారన్నారు. ప్రధానంగా కొత్త పథకాలతో పాటు కొత్తగా ప్రొఫెషనల్ హబ్స్, మైనారిటీలోని ఎంస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, మైనారిటీ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కాలేజీలు, ఐటీఐ, పాలిటెక్నిక్ తదితర వసతుల కల్పనకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో మైనారిటీలకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు పునర్నిర్మాణ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందన్నారు.

ఈ సందర్భంగా మైనారిటీ శాఖ పనితీరుపై జిల్లాల వారీగా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరుపై క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరీశీలన జరగాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్క మైనారిటీకి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలన్నారు. ఇప్పటికే నాలుగైదు దఫాలుగా మైనారిటీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చర్చించారని త్వరలోనే మరోసారి మైనారిటీ సంక్షేమ శాఖ పనితీరుపై చర్చించే అవకాశముందన్నారు. మైనారిటీ శాఖలో అధికారుల కొరత కారణంగా క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్7 సేవలు వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా మైనారిటీ వర్గాలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ సెక్రటేరియట్ లు కలెక్టరేట్ లా పనిచేస్తున్నాయని కొనియాడారు. మైనారిటీ వెల్ఫేర్‌ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడు కింద జరుగుతున్న ఆధునికీకరణ పనులు ఏ ఏ దశలో ఉన్నాయో గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అధికారులు వీలైనంత త్వరగా అభివృద్ధి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. అభివృద్ధి పనులు పూర్తయ్యాక వాటి నిర్వహణ సక్రమంగా ఉండేలా ఎప్పటికప్పుడు పరిశీలన జరగాలన్నారు.

ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం లో భాగంగా ముస్లిం, మైనారిటీ లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక దృష్టి కేంద్రీకరించి ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకానీ, కమ్యూనిటీ హాల్, కొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, హెల్త్ సెక్టార్ తదితరమైన నిర్మాణాలను నిర్మించుకునే అవకాశం ఉందని సూచించారు.

మైనారిటీల జీవితాల్లో మంచి రోజులు రావాలని చెబుతూనే మైనారిటీల కోసం జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల స్థాయిల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం మినహాయించి మిగిలిన రోజుల్లో ప్రతి సంక్షేమ శాఖ తరపున ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించి వారి ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జగనన్న విదేశీ విద్యా పథకానికి సంబంధించి జిల్లాల్లో అధికారులు లోకల్ ఛానల్స్ లో ఫోన్ ఇన్ కార్యక్రమాలు పెట్టి తద్వారా మైనార్టీ అభ్యర్థులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. అవసరమైతే అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమీక్షా సమావేశం చివర్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మైనారిటీల కోసం అమలు చేస్తున్న ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ ఆధారిత స్కాలర్ షిప్ లను తెలిపే పోస్టర్ ను విడుదల చేశారు.

మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఇమామ్ లు, మౌజమ్ లకు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణతో పాటు వక్ఫ్ భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్ పథకాలు, హాస్టల్స్, రెసిడెన్షియల్స్ స్కూల్స్, మైనారిటీ కమ్యూనిటీల ప్రయోజనాల కోసం చేపట్టిన వినూత్న ప్రాజెక్టులు, వాటి కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డు సీఈవో, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్ధుల్ ఖదీర్, సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ షేక్ షీరిన్ బేగం, దూదేకుల నూర్ బాషా ఫెడరేషన్ ఎం.డి డా.మహ్మద్ మస్తాన్, సీఈడీఎం డైరెక్టర్ మహ్మద్ మస్తాన్ వలీ, క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ ఎలీషా, 26 జిల్లాల మైనారిటీ సంక్షేమ అధికారులు, యూనిట్ అధికారులు మరియు రాష్ట్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE