– గండ్లు పడకుండా చెరువులు,కాల్వ గట్ల పటిష్ఠతకు చర్యలు
– లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
-సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు/ఏలూరు: భారీ వర్షాలు, వరదల కారణంగా చెరువులు, కాల్వల గట్లకు గండ్లు పడకుండా గట్ల పటిష్టత కు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు.
భారీ వర్షాల కారణంగా నీట మునిగిన నూజివీడు పట్టణంలోని గాంధీనగర్, ఎన్టీఆర్ కాలనీ, అప్పారావు పేట, నూజివీడు మండలంలోని బత్తులవారిగూడెం, యలమందల తదితర పలు గ్రామాలలో ఆదివారం మంత్రి పార్థసారధి విస్తృతంగా పర్యటించి బాధితులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించేలా దగ్గరుండి చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వర్షాలు తగ్గే వరకు ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.
చెరువులు, కాల్వలను డీసిల్టింగ్ చేయడం, గట్లను పటిష్టం చేయడం ద్వారా వర్షాల ద్వారా కలిగే నష్టాలను నివారించడం, ప్రజల కష్టాలను తీర్చడంతోపాటు వర్షం ద్వారా కురిసిన నీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. చెరువులు, కాల్వగట్లపై ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
నూజివీడులోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి పరిశీలించి వారికి కల్పిస్తున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. నూజివీడులోని మోటుపల్లి తాతారావు జూనియర్ కళాశాల వరదనీటిలో మునగడంతో హాస్టల్ విద్యార్థులు 70 మందిని నిన్న ఉదయం సాంఘిక సంక్షేమ హాస్టల్ కి తరలించారు.
హాస్టల్ సందర్శించి విద్యార్థుల యోగ క్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కావలసిన త్రాగునీరు బట్టలు మరియు నిత్యావసర సరుకులు బియ్యం తక్షణమే అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మందులు అందజేయమని అధికారులు కు ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా నిరంతరం వారి యోగ క్షేమాలు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు తదనంతరం హెల్పింగ్ హేండ్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు బట్టలు, నగదు ను మంత్రి అందజేశారు.