మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటాం

0
275

-జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటాం
– వచ్చిన అభ్యంతరాలు, సలహాలు మీద వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకుని వారి ఆలోచనలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది
– కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి జిల్లాలో కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ల నిర్మాణం
– రాష్ట్ర ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్

అనంతపురం, ఫిబ్రవరి 26 : జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా మార్చి 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా శాఖకార్యదర్శి విజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం పై రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, కడప జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ తో సమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రణాళికా విభాగం కార్యదర్శి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరుగుతోందని, అందులో భాగంగా అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ లో రాయలసీమలోని నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో సమావేశం నిర్వహించామని, ఆయా జిల్లాల కలెక్టర్లకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు మీద స్టడీ చేసేందు కోసం వచ్చామన్నారు.

ఇందులో ప్రధానంగా నాలుగు జిల్లాల ప్రజల యొక్క ఆలోచనలు, ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో చూశామన్నారు. కొన్నికొన్ని జిల్లాల్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ అభ్యంతరాల స్వీకరణకు మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.

అనంతరం వచ్చిన అభ్యంతరాలు, సలహాలు మీద వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకుని కలెక్టర్ లు వారి ఆలోచనలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. తదనంతరం ప్రతి అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని తుది నోటిఫికేషన్ వస్తుందన్నారు. తుది నోటిఫికేషన్ వచ్చిన అనంతరం జిల్లాలు ఏ రోజు నుంచి ఆవిర్భావం అవుతాయి అనే అంశంపై తుది నోటిఫికేషన్లో తెలియజేయడం జరుగుతుందన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలలో మౌలిక వసతులు ఏర్పాటు విషయమై కూడా కలెక్టర్లు చూస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి జిల్లాలో కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ లను నిర్మించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఆ ప్రక్రియ సమాంతరంగా జరుగుతుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు కొత్త జిల్లాలో పనిచేయాల్సినటువంటి ఆదేశాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, విభజన అనేటువంటిది నెమ్మదిగా దానికున్నటువంటి నూతన ప్రక్రియ ప్రకారం జరుగుతుందన్నారు.

పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగులు పనిచేసేందుకు ఆర్డర్ టు సర్వ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగుల విభజన అనేది వెంటనే జరగదన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో జోన్ల ఏర్పాటులో పెద్దగా ఇబ్బంది లేదని, రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని, జోనల్ స్థాయిలో కూడా ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కువ ఇబ్బంది లేదని, గ్రామ స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జిల్లా స్థాయిలో ఉన్న చోట్ల కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు.
రాయలసీమలో నాలుగు జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు సుమారు 16 వందల కుపైగా వచ్చాయని, సమస్యల వారిగా తీసుకున్నప్పుడు ఒక్కో జిల్లాలో 5, 6 అంశాలు మాత్రమే ప్రధానంగా కనిపిస్తున్నాయన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రం పెనుకొండ గానీ, హిందూపురం గాని పెట్టాలని పుట్టపర్తి పెట్టారనే భావన వ్యక్తమైందని, ఆ అంశం పూర్తిగా పరిశీలనలో ఉందన్నారు. దీంతోపాటు రామగిరి మండలాన్ని అనంతపురం రెవెన్యూ డివిజన్ లో కలపాలని అడుగుతున్నారన్నారు.

కర్నూలు జిల్లాకు సంబంధించి పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాలలో ఉంచమని, అవకాశం ఉంటే కొత్త జిల్లాలు ఇంకా ఏర్పాటు చేయమని కొన్ని దరఖాస్తులు వచ్చాయన్నారు. కడప జిల్లాకు సంబంధించి ప్రధానంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండాలని, చిత్తూరు జిల్లాకు సంబంధించి నగరిని తిరుపతిలో ఉంచాలని ప్రధానమైన అంశాలపై దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి అంశానికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలిస్తున్నామని, వాస్తవ పరిస్థితి ఏమిటి అనేది చూస్తున్నామని, గతంలో చెప్పినట్టుగా చారిత్రాత్మక భావాలు, ఆ ప్రాంతంలో సాంస్కృతిక పరమైన అనుబంధాలు, ఆర్థిక పరమైన అభివృద్ధి లాంటి అన్ని రకాల కారణాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయాలు ఉంటాయన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, వారి భావాలు ఏ విధంగా ఉన్నాయి అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. కొత్త జిల్లాలకు కేటాయించి ఉద్యోగులకు పని విభజన మాత్రమే ఉంటుంది. ఆర్డర్ టు సర్వ్ ప్రాతిపదికన వారు విధులు నిర్వహిస్తారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లుగా ఉగాది నుంచి కొత్త జిల్లాలు ప్రారంభమవుతాయన్నారు.ఈ సమావేశంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్, కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) గౌతమి తదితరులు పాల్గొన్నారు.