Suryaa.co.in

Political News

‘రాజు’ గారిని బాబు గారు ఏం చేద్దామనుకుంటున్నారు!?

ఇతర తెలుగుదేశం జనానికి మల్లే, “ఉండి” నియోజక వర్గం ఎంఎల్ఏ రఘు రామకృష్ణం’రాజు’ ఒక చట్రం లో ఇమిడిపోయే రాజకీయ నేత కాదనే విషయం ‘తెలుగు దేశం’ పెద్దలకు ఈపాటికే అర్ధమై ఉంటుందనడం లో సందేహం లేదు.

ఆయన దాదాపు నాలుగేళ్లు ఢిల్లీ నుంచి అప్పటి ముఖ్యమంత్రి జగన్, ఆయన చుట్టూ చేరి ఉన్న ముఖ్య నేతల పై అలుపెరగని పోరాటం చేశారు. ఆయన పోరాట పటిమకు రాష్ట్రమే నివ్వెరపోయింది.

జగన్ పై రాజకీయ పోరాటం చేస్తున్న వారు… రఘు రామకృష్ణం రాజును సమర్ధించక, మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో పడిపోయారు.

జగన్ పాలనా రీతులను తీవ్రం గా నిరసించే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్, టీవీ 5 న్యూస్ ఛానల్, ఈనాడు మీడియా కూడా ఆయనకు బాసటగా నిలబడడం తో, రఘు రామరాజు…. ఆంధ్రప్రదేశ్ లో ‘ఇంటింటి పేరు ‘ గా మారిపోయారు. లక్షల సంఖ్యలో అభిమానులు తయారయ్యారు.

జగన్ అరాచక జమానా ను ఎదిరించి పోరాడిన వారిలో అత్యధికులు – తమ తమ తమ నియోజక వర్గాలకే పరిమితమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ టికెట్ పై దృష్టి పెట్టుకుని, జగన్ పై పోరాడినవారే ఎక్కువమంది కనిపిస్తారు.

కానీ, రఘు రామరాజు…. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా చేసుకుని పోరాడారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోరాడారు. అందుకే, ఆయన ‘స్టేట్ ఫిగర్ ‘ అయ్యారు. అలా, ‘స్టేట్ ఫిగర్ ‘ గా ప్రజల ముందు ఆవిష్కృత మైన వారు మరో ముగ్గురే.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. టీడీపీ లో గానీ, జనసేనలో గానీ, బీజేపీ లో గానీ… ఇక మిగిలినవారందరూ నియోజకవర్గం నేతలే. అయినప్పటికీ ; ఈ “జైంట్ కిల్లర్ ” కు కూటమి నుంచి రావలసిన గుర్తింపు రాలేదనే భావం…. రఘు రామరాజు ను అభిమానించే చాలా మంది లో ఉంది.

ఆయనకు చంద్రబాబు నాయుడు బాసట గా నిలబడ్డారనడం లో సందేహం లేదు. ఆయనకు నరసాపురం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి గా పోటీ చేసే అవకాశం రాకపోవడం తో, చంద్రబాబు సైతం కొద్దిగా ఆశ్చర్యానికి గురైనట్టు వార్తలు వచ్చాయి.
ఆయనకు ఎంతో కొంత న్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.

అప్పటికే ఉండి నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిత్వం ప్రకటించిన శివరామ రాజు ను ఒప్పించి, పోటీ నుంచి తప్పించి… ఆ టికెట్ ను రఘు రామరాజు కు కేటాయించారు. నిజానికి, రఘు రామరాజు కు “ఉండి” నియోజక వర్గం కేటాయించడానికి, చంద్రబాబు నాయుడు పెద్ద కసరత్తే చేశారు.

ఆ తరువాత, అసెంబ్లీ స్పీకర్ పదవి గానీ, రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవి గానీ వస్తుందని ఆయన భావించారు. ఊహించిన దానికంటే కూడా అత్యధిక స్థాయిలో కూటమి సభ్యులు విజయం సాధించడం తో ; రకరకాల సమీకరణాల నేపథ్యం లో రఘు రామకృష్ణం రాజు కు అవకాశం లభించి ఉండక పోవచ్చు. ఫలితం గా, ఆయన ఎంఎల్ఏ గానే మిగిలిపోయారు.

ఆ పదవి, ఆయన ఇమేజ్ కు తగినట్టుగా లేదని ఆయన పోరాట పటిమను చూస్తూ వస్తున్నవారు ఎవరైనా అంగీకరిస్తారు. నియోజక వర్గ స్థాయికి ఆయనను కుదించడం కూడా కుదరనంతగా…. జగన్ పుణ్యమా అని, గత నాలుగేళ్ళల్లో ఆయన ఇమేజ్ పెరిగిపోయింది.

ఆయన ఇమేజ్ కి తగిన స్థాయి కల్పించడమూ తెలుగు దేశం పార్టీకి అంత తెలికైన విషయం కాదు. అలా అని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయిన ఆయనను ఉండి నియోజకవర్గానికే పరిమితం చేయడమూ సముచితం అనిపించుకోదు. అందుకని ; ఆయనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపించడం వల్ల తెలుగు దేశం పార్టీ కి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

తెలుగు వారి తక్షణ స్మృతి పథంలో ఆయన ప్రస్తావన ఉండదు. రఘు రామరాజు కు చంద్రబాబు నాయుడు న్యాయం చేశారనే భావన, చంద్రబాబు ప్రతిష్ట ను ఇనుమడింప చేస్తుంది.
*ఒక గవర్నర్ కు ఉండవల్సిన స్టేచర్, హుందాతనం, ఇంగ్లీష్… హిందీ భాషల పై కమాండ్ ఆయనకు ఉన్నాయి.

*”మన రాజ్యాంగాన్ని ఎవరు రాశారోయ్… “అని అడిగితే, ” మాకెందుకు తెలియదు…, ఇందిరా గాంధీ రాసింది ” అని ధీమా గా చెప్పే చాలామంది సగటు రాజకీయ నేతల కంటే, రాజ్యాంగం పై రఘు రామరాజుకు మంచి అవగాహన ఉంది. లోకసభ లో ఒక సభ్యుడిని అనర్హతకు ఎప్పుడు గురి చేయాలో వైసీపీ ఎంపీలకు తెలియకపోయినా ; రఘుకు తెలుసు. అందుకే, తల్లకిందులుగా తపస్సు చేసినా, ఆయనను లోకసభ నుంచి వైసీపీ గ్యాంగ్… బయటకు పంపించలేకపోయింది.

ప్రధానమంత్రి, ఇతర సీనియర్ కేబినెట్ మంత్రులతో సహా, వందల మంది ఎంపీ లు ఆయనకు పరిచయం. ఇంతకంటే, గవర్నర్ కు అర్హతలు ఇంకేమి కావాలి? చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని కొందరు టీడీపీ నేతలు సైతం అభిప్రాయ పడుతున్నారు.

ఇప్పటికే, ఈశాన్య రాష్ట్రాల్లో ఇద్దరు తెలుగు వారు ఉన్నారు. కంభంపాటి హరిబాబు, ఇంద్రాసేనారెడ్డి. హర్యానా కు బండారు దత్తాత్రేయ గవర్నర్ గా ఉన్నారు. వారు ముగ్గురూ బీజేపీ నేతలే. రఘు ను గవర్నర్ గా పంపించడం వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించే పక్షం లో ; ఆయనను ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి గా నియమించ వచ్చు. అప్పుడు, చంద్రబాబు, మంత్రులు… నిధులు, ప్రాజెక్ ల అనుమతుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. హి ఈజ్ ఏ పాలిటీసియన్ విత్ ప్రూవెన్ టాలెంట్. ఆయన సేవలను వాడుకోలేకపోతే, ఒక సమర్ధ నేత సేవలను సక్రమంగా వినియోగించుకోలేక పోయారన్న అపకీర్తికి ముఖ్యమంత్రి లోనయ్యే ప్రమాదం లేకపోలేదు.

భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE