Suryaa.co.in

Editorial

ఎర్రగొండపాలెం కేసు ఏమాయె?

  • ఎన్నికల సమయంలో బాబుపై ఆదిమూలపు అనుచరుల రాళ్ల దాడి

  • ఎన్‌ఎస్‌జీ కమాండర్ తలకు తీవ్ర గాయం

  • దాడికి గురై ఆసుపత్రిలోనే మరణించిన టీడీపీ దళిత కార్యకర్త

  • మృతుడి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చిన చంద్రబాబు

  • ఇప్పటికీ అతీగతీలేని ఎర్రగొండపాలెం దాడి కేసు

  • ప్రభుత్వం- పోలీసులపై విరుచుకుపడుతున్న టీడీపీ సోషల్‌మీడియా సైనికులు

  • పోలీసులు నిద్రపోతున్నారా అంటూ విరుచుకుపడుతున్న పార్టీ శ్రేణులు

  • మంత్రి స్వామి, గొట్టిపాటి రవి, ఇన్చార్జి మంత్రి ఆనంకు పట్టదా?

  • నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్షన్‌బాబుకు పెత్తనం తప్ప బాధ్యత పట్టదా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

అది ఎన్నికల ప్రచార సమయం. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ అనుచరులు విధ్వంసకులు అవతారమెత్తారు. చేతిలో రాళ్లు తీసుకుని చంద్రబాబుపై దాడి చేశారు. దానిని ఎన్‌ఎస్‌జీ కమాండర్ ఒకరు అడ్డుకున్నారు. ఫలితంగా అతని తలకు తీవ్ర గాయమయింది.

ఆ దాడిలో తీవ్రంగా గాయాలపాలయి ఆసుపత్రిలో చేరిన టీడీపీ కార్యకర్త దళిత కార్యకర్త చేదూరి రాజయ్య, కొద్దిరోజుల తర్వాత మృత్యువుతో పోరాడి అలసిపోయాడు. ఆయన మరణంతో ఖిన్నుడైన చంద్రబాబు, ఆ కుటుంబానికి 10 లక్షల సాయం చేశారు. ఈ ఘటన జరిగింది 2023 ఏప్రిల్ 21న.

సీన్ కట్ చే స్తే.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడునెలలు దాటిపోయింది. ఆ జిల్లాకు స్వామి మంత్రి అయ్యారు. ఉమ్మడి జిల్లాకు మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా మంత్రి అయ్యారు. ఆ జిల్లాకు ఆనం రామనారాయణరెడ్డి ఇన్చార్జి మంత్రి అయ్యారు. ఎన్నికల్లో ఓడినా ఎరిక్షన్‌బాబు నియోజకవర్గ ఇన్చార్జిగా పెత్తనమంతా తానే చేస్తున్నారు. కానీ పార్టీకోసం చనిపోయిన దళిత కార్యకర్త రాజయ్య కేసును.. అంతా కలసి ‘విజయవంతంగా మర్చిపోయారు’. ఇదేఇప్పుడు సోషల్‌మీడియాలో పసుపు సైనికుల ఆగ్రహజ్వాల.

ఒక్క ఎర్రగొండపాలెంలోనే కాదు. ఏపీలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలది ఇదే రోదన-వేదన. అయినా పట్టించుకునే దిక్కులేదు. కార్యకర్త త్యాగాల పునాదులపై పదవులు అనుభవిస్తున్న వారికి.. ఎన్నికల ముందు ఎదుర్కొన్న చేదు అనుభవాలు గుర్తు రావడం లేదు. ఈ విషయంలో యధా రాజా తథా ప్రజ అన్నట్లుంది ఎమ్మెల్యే, మంత్రుల వ్యవహారం.

అయితే, అధిష్ఠానం మర్చిపోయినా.. ఎమ్మెల్యేలు, మంత్రులు మర్చిపోయినా, సోషల్‌మీడియా సైనికులు మాత్రం.. శూలాల్లాంటి మాటలతో, కొరడా ఝళిపిస్తున్నారు. ఎందుకంటే వారికి పోయేదేమీ లేదు. అందుకే ఎర్రగొండపాలెంలో బాబుపై రాళ్ల దాడిచేసిన పోలీసులు నిద్రపోతున్నారా? మంత్రులు స్వామి, గొట్టిపాటి, ఆనం ఎక్కడున్నారు అంటూ ధైర్యంగా నిలదీస్తున్నారు.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నాటి విపక్ష నేత, నేటి సీఎం చంద్రబాబునాయుడుపై.. ఎన్నికల సమయంలో జరిగిన రాళ్ల దాడిని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఫలితంగా ఆ కేసు అటకెక్కినట్లేనన్న భావన కార్యకర్తల్లో నెలకొంది. ఆ ఘటనకు కారకులు ఎవరో స్పష్టంగా తెలిసినా, సూత్రధారి ఎవరో తెలిసినప్పటికీ ప్రభుత్వం-పోలీసులు.. ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ కార్యకర్తలు, సోషల్‌మీడియా వేదికగా నిప్పులు కురిపిస్తున్నారు.

ఆ దాడికి అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ అని.. ఐప్యాక్ వ్యూహరచనతో జరిగిన దాడి అని టీడీపీ నేతలు అప్పుడే ఆరోపించారు. మంత్రి సురేష్‌కు దాడి వ్యూహం వివరిస్తున్న ఐప్యాక్ ఉద్యోగి ఫొటోతోపాటు.. దాడికి సారథ్యం వహించిన ఏఎంసీ మాజీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి ఫొటోలను కూడా మీడియా ప్రచురించింది. ఆ మేరకు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. బహుశా ఆధారాలు లేనందున మూసివేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.

అయితే విచిత్రంగా ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి చంద్రశే ఖర్ విజయం సాధించారు. అయినప్పటికీ, ఆయన చేతిలో ఓడిపోయిన ఎరిక్షన్‌బాబు మాత్రం నియోజకవర్గ ఇన్చార్జిగా, అన్నింటా తానై పెత్తనం చేస్తున్నారు. కానీ.. ఎన్నికల సమయంలో బాబుపై జరిగిన రాళ్ల దాడి కేసులో, ముద్దాయిలను అరెస్టు చేయించాలన్న స్పృహ ఏమాత్రం లేకుండా, సొంత పనుల్లో బిజీగా ఉన్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి ప్రకాశం నుంచి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ మంత్రులయ్యారు. కానీ వారిద్దరూ బాబుపై జరిగిన రాళ్లదాడిని మర్చిపోయారు. నిందితులను చెరబట్టిందామన్న ధ్యాస లేకుండా, ఎవరి సొంత వ్యవహారాల్లో వారు మునిగిపోయారని తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు. అటు జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అసలు ఈ వ్యవహారమే పట్టకుండా పోయిందంటున్నారు.

జిల్లా ఎస్పీని పిలిచి, బాబుపై రాళ్ల దాడి కేసు పురోగతి ఎంతవరకూ వచ్చింది? నిందితులపై చార్జిషీట్ వేశారా లేదా? అని ఆరా తీయడాన్ని మంత్రులంతా మర్చిపోవడంపై తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు.

‘‘ఇలాంటి నిర్లక్ష్యవైఖరి వల్లే మేం స్థానికంగా వైసీపీ నేతల ముందు చేతకానివారిలా నిల్చుంటున్నాం. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే పల్నాడు లాంటి జిల్లాల్లో, ఇప్పటికీ మన పార్టీ వారిపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. ఇది మన అసమర్ధత. చేతకానితనమే కదా? సీఎంపై రాళ్ల దాడి చేసిన వారిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదంటే అది ఎవరికి సిగ్గుచేటు? ఈ పార్టీ ఎటుపోతోంది? ఎవరు ఎవరికి భయపడుతున్నారు? నాయకత్వమంటే ఎవరికీ లెక్కలేదని తేలిపోతుంది కదా? అసలు సెంట్రల్ ఆఫీసు నుంచి కూడా బాబుగారిపై రాళ్ల దాడి కేసు ఎందాకా వచ్చిందని అడిగే దిక్కే లేదు. మా నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు కూడా పట్టించుకోకపోతే.. చంద్రబాబు వచ్చి నా కేసు ఏమైందని పట్టించుకుంటారా ఏంటి?’’ అని ఎర్ర గొండపాలెం నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ దళిత నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానికి ఇలాంటి వ్యవహారాలన్నీ స్థానిక ఎమ్మెల్యే, ఇన్చార్జి, జిల్లా మంత్రులు, జోనల్ ఇన్చార్జులు సమన్వయం చేసుకుని, తీసుకోవాల్సిన నిర్ణయాలని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ‘ప్రతి ఒక్కటీ చంద్రబాబు, లోకేష్ చెప్పరు కదా? వాళ్లు అనేక పనుల్లో బిజీగా ఉంటారు. ఇలాంటి వాటిని పరిశీలించి సమన్వయం చేసుకోవలసింది జిల్లా, నియోజకవర్గ నాయకులు కదా? కానీ వాళ్లేమో కలెక్షన్ల బిజీలో పడ్డారు. పైగా బాబుగారు, లోకేష్ వేధింపులు మా నైజం కాదని చెప్పడం వీళ్లకు కలసివస్తోంది. వాళ్లు జగన్ మాదిరిగా అనవసరంగా వేధించవద్దన్నారు తప్ప, దాడులు చేసిన వారిని వదిలిపెట్టమని అనలేదు. లీగల్‌గానే వారిపై యాక్షన్ తీసుకోమంటున్నారు కదా? అది కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు చేయర న్నదే కార్యకర్తల ఆగ్రహానికి అసలు కారణం’’ అని మాజీ మంత్రి ఒకరు విశ్లేషించారు.

LEAVE A RESPONSE