Suryaa.co.in

Editorial

ఇదేం ‘మగ’ ప్రేమ.. జగనన్నా?!

  • కొడాలి నాని, అవినాష్, వంశీ గ్లామరస్‌గా ఉంటారని జగన్ ఫిదా

  • అందుకే వాళ్లను చూస్తే బాబు-లోకేష్‌కు ఈర్ష్య అంటూ అందానికి సరికొత్త భాష్యం

  • ఆ ముగ్గురూ తమంత అందంగా ఉండరని తండ్రీకొడుకుల ఆక్రోశమన్న జగన్

  • జగన్ ‘మగ’ప్రేమపై సోషల్‌మీడియాలో పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు

  • మగవారి అందాలు మెచ్చుకోవడమేమిటంటూ సెటైర్లు

  • అంతకుముందు చిన్నారికి ముద్దుతో జగన్‌కు జనంలో పెరిగిన ఇమేజ్

  • తన ‘మగప్రేమ’ మాటలతో ఆ ఇమేజ్‌ను పదినిమిషాల్లో డ్యామేజీ చేసుకున్నారని వైసీపీ నేతల ఆవేదన

( మార్తి సుబ్రహ్మణ్యం)

గోపి: నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తుంది రాధ . నువ్వు భువి నుంచి దివికి దిగివచ్చిన దేవతలా ఉన్నావు! నువ్వు ఒప్పుకుంటే నా గుండెలో నీ గుడికట్టుకుంటా రాధా!
రాధ.. నీది ఎంత మంచి మనసు గోపి ? నీ విశాల హృదయానికి నేను దాసినయ్యాను. ఐలయ్‌యు గోపీ!
రాము: సీతా.. నువ్వు లేకుండా నేను బతకలేను. మా పెద్దలను ఎదిరించయినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటా.
సీత: రాము నీ కోసం నేను కూడా మా పెద్దలను ఎదిరించి బయటకు వస్తా. నీ చల్లటి హృదయంలో నాకు ఇంత చోటు ఇస్తే చాలు.

ఇవన్నీ పాతకాలపు బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్‌మన్ కలర్ ప్రేమ కథా సినిమాలో.. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు ీహ రోయిన్లను ఉద్దేశించి చెప్పే డైలాగులు. ఇవి ఈ తరానికి తెలియకపోయినా, ఈ టీవీలో వచ్చే పాత సినిమాలు చూసినా అర్ధమవుతుంది.

పాత సినిమాలే కాదు. ఈ ట్రెండ్ సినిమా లవ్ స్టోరీలు కూడా దాదాపు అదే ఒరవడిలో ఉంటాయి. కాకపోతే కాస్తంత స్క్రీన్‌ప్లే మారుతుందంతే!

అంతేగానీ..
గోపీ అనే హీరో.. కృష్ణ అనే మరో హీరోనుద్దేశించి కృష్ణా.. నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తోంది అని అనడు.
అలాగే రాము అనే హీరో.. రాజు అనే మరో హీరోనుద్దేశించి.. ఇంత గ్లామరస్‌గా ఉన్న నిన్ను చూస్తే నాకెందుకో ఈర్ష్య కలుగుతోంది. నాకే కాదు. నిన్ను చూస్తే మగాళ్లందరికీ జెలసీ కలుగుతోంది అని అనడు.

అలాగే..
సీత తన మిత్రురాలైన సావిత్రితో అబ్బ.. నువ్వు ఇంత అందంగా ఉన్నావేమిటే.. నీ అందం నన్ను పిచ్చెక్కిస్తోంది అనదు.
విష్ణుప్రియ తన మిత్రురాలయిన శివప్రియతో.. మనం సమాజాన్ని పట్టించుకోవద్దు. ఇద్దరం కలసి ఉందాం అనదు.

ఇలాంటి డైలాగులు ఏ సినిమాలో వినిపించదు. అసలు ఏ రచయితా ఇలాంటి వివర్స్ డైలాగులు రాయడు. హీరో హీరోయిన్‌ను.. హీరోయిన్ హీరోను మాత్రమే ప్రేమిస్తుంది. ఒకరి అందాన్ని మరొకరు పొగుడుకుంటారు. ఒకరు లేకపోతే మరొకరు జీవించలేరని ఆర్తిగా చెప్పుకుంటారు. అంటే ప్రకృతి ధర్మం ప్రకారంగా ముందుకెళుతుంటారన్నమాట!
సీన్ కట్ చేస్తే…

అది విజయవాడ గాంధీనగర్‌లోని జైలు. ఆ లోపల గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విచారణ ఖైదీగా ఉన్నారు. దళితులపై దాడి, కిడ్నాప్ తదితర కేసులకు సంబంధించి అరెస్టయి, జైల్లో ఉన్న వంశీని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగనన్న కలిశారు. కేసు పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. నీకు నేనున్నా భయపడవద్దని మనోస్థైర్యం ఇచ్చారు.

అంతకంటే ముందు జగనన్నను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. వారంతా నిజంగా ఆయనను చూసేందుకు వచ్చిన వారే. డబ్బులిచ్చి తోలిన బాపతు కాదు. నిజానికి 40 శాతం ఓట్లు సంపాదించుకున్న జగనన్న పర్యటనలకు, ఎప్పుడూ జనాలకు లోటు ఉండదు. 11 సీట్లు వచ్చినా జగనన్న పర్యటనలకు జనం పోటెత్తుతుంటారు. ఆ క్రేజు-మోజు ఇంకా జగన్‌పై జనంలో ఉందన్నది నిష్ఠుర నిజం.

కొద్దికాలం క్రితం వినుకొండలో హత్యకు గురైన యువనేత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌కు, స్థానిక వైసీపీ నేతలు కూడా ఊహించని ఘన స్వాగతం లభించింది. అప్పటికీ పోలీసులు బయట నుంచి జనం రాకుండా సరిహద్దుల్లో బారికేడ్లు కూడా కట్టినా, జనం పోలోమంటూ వచ్చేసి, జగన్‌ను కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జగన్‌కు సంబంధించి జనంలో ఉన్న ఇమేజ్‌కు సజీవ సాక్ష్యాలు.

మాజీ ఎంపి నందిగం సురేష్ అరెస్టయి, గుంటూరు సబ్ జైల్లో ఉన్న సందర్భంలో.. ఆయనను పరామర్శించేందుకు వెళ్లినప్పుడూ, జగన్‌కు అదే జనసందోహం నీరాజనం పట్టింది. మీడియాతో మాట్లాడుతున్న జగన్ చేతిని, హటాత్తుగా అక్కడి జైలు మహిళా పోలీసు ముద్దాడిన వైనం విస్మయపరిచింది. అప్పటికి జగన్ పార్టీ ఓడిపోయింది. అధికారంలో లేదు. జగన్ సీఎంగా ఉంటే తనకు ప్రమోషన్ ఇస్తారన్న ఆశ కూడా లేదు. తన ఉద్యోగానికి ఎసరు వస్తుందని తెలిసినా భయపడని ఆ మహిళా పోలీసు, జగన్ చేతిని ధైర్యంగా ముద్దాడటం సామాన్యమేమీ కాదు.

తాజాగా.. జగన్ విజయవాడ జైలులో వంశీని పరామర్శించి వెళ్లే సమయంలో.. ఒక చిన్నారి, తాను జగన్‌ను కలుస్తానని మారాం చేసింది. జగన్‌ను చూస్తూ..జగనన్నా అంటూ చేయి పైకెత్తింది. తండ్రి భుజంపై ఉన్న ఆ చిన్నారిని చూసిన జగన్ తన కారు ఆపించారు.

చిన్నారిని దగ్గరకు పిలిచి ముద్దుపెడితే సంబరపడ్డ ఆ చిన్నారి కూడా, వెళ్లే ముందు జగన్ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి, సెల్ఫీ తీసుకున్న దృశ్యం చానెళ్లలో రోజంతా హోరెత్తిపోయింది. ఇక ఆ చిన్నారి ఆనందానికి హద్దులే లేవనుకోండి.

సరే.. ఆ అమ్మాయిని ‘బాలనటి’ అని కొందరు, బాగా ట్రైనింగ్ ఇచ్చారు అని ఇంకొందరు, ఐప్యాక్ స్థానంలో వచ్చిన కొత్త సలహా టీమ్ స్క్రీన్‌ప్లే అని మరికొందరు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెట్టడం, దానికి వైసీపేయుల నుంచి వచ్చిన కౌంటర్ల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.

ఈ వరస సంఘటనలు పరిశీలిస్తే… జగన్ పనయిపోయింది. ఆయన పార్టీ నుంచి అంతా వెళ్లిపోతున్నారు. ఇక ఆ పార్టీలో ఎవరూ మిగిలరంటూ.. సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టి ఆనందించే వారంతా భ్రమల్లో ఉన్నారని, పార్టీ మాదిరిగానే నేలవిడిచి సాముచేస్తున్నారన్న విషయం మాత్రం స్పష్టం చేసేవే. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, జగన్‌కు ఇంకా జనంలో క్రేజ్ ఉందని తెలుస్తూనే ఉంది. సద్విమర్శలు చేసే రాజకీయ పరిశీలకుల కోణం అది. ఇప్పటివరకూ జరిగిన జగన్ పర్యటనలే దానికి కొలమానం!

అంతవరకూ బాగానే ఉంది. కానీ వంశీని పరామర్శించి, మీడియాతో జగన్ చేసిన వ్యాఖ్యలే విస్మయం కలిగించి, విమర్శలకు దారితీసేందుకు కారణమయ్యాయి. బయటకు వచ్చిన జగన్.. జైలులో ఉన్న వంశీ అమాయకుడని, నోట్లో వేలు పెడితే కొరకడం కూడా రాని అమాయకుడని.. సరిగ్గా పెన్ను పట్టడమే రాని వంశీ కత్తి ఎలా పట్టుకుంటాడని.. ‘గన్నవరం అంబేద్కర్’ అయిన వంశీ, దళితులపై ఎలా దాడి చేస్తాడ ని వాదిస్తారనుకున్నారు. వంశీ కుటుంబాన్ని కూటమి సర్కారు వేధిస్తోందని ఆరోపిస్తారనుకున్నారు.

కానీ వాటికి పూర్తి భిన్నంగా.. వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ అందచందాలు.. వాళ్ల గ్లామరస్ గురించి మాట్లాడటం సొంత పార్టీ నేతలనే ఖంగుతినిపించింది. అందంగా, గ్లామరస్‌గా ఉన్న

వాళ్లను చూస్తే చంద్రబాబు-లోకేష్‌కు జెలసీ అని.. వాళ్లంత అందంగా తాము ఉండకపోవడమే తండ్రీ కొడుకుల ఈర్ష్యకు కారణమంటూ జగన్ చేసిన సూత్రీకరణ.. ఆయన వ్యక్తిగత ఇమేజీని భారీగా డ్యామేజీ చేసింది.

‘‘చంద్రబాబు కన్నా గ్లామర్‌గా ఉన్నాడు. లోకేష్ కన్నా గ్లామరస్‌గా ఉన్నాడు. అందుకే కొడాలి నానిని చూస్తే చంద్ర బాబుకు ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబునాయుడు కంటే నాని చక్కగా ఉంటాడు కాబట్టి. అవినాష్ కూడా ఏదో ఒక నాడు టార్గెట్ అవుతాడు. ఎందుకంటే లోకేష్ కంటే చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబునాయుడు మనస్తత్వం’’అంటూ మగాళ్ల అందం, గ్లామరస్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన మానసిక-శారీరక పరిస్థితికి అద్దం పడుతున్నాయంటూ, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు శరపరంపరగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కామెంట్లకు తోడు సినిమా పాటలు పెడుతూ, జగన్‌ను ర్యాంగింగ్ చే స్తున్నారు.

‘‘ఈ మగ ప్రేమ ఏమిటి జగనన్నా.. వాళ్లు నీకు అంత బాగా నచ్చారా జగనన్నా.. ఆ గుడివాడ గడ్డంలో ఏం నచ్చింది భయ్యా?.. ఆ బెజవాడ పకోడీ అంత బాగున్నాడా బాసూ?.. ఎవరైనా ఆడాళ్లను ప్రేమిస్తారు. నువ్వేంది భయ్యా?.. ఈ ప్రపంచంలో గుడివాడ గడ్డం, బెజవాడ పకోడి బాగుంటారని మెచ్చుకుంది నువ్వొక్కడివే బ్రో.. ‘మగప్రేమ’ పేరుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తీస్తే దానికి జగన్ హీరోగా, వంశీ, నాని, అవినాష్‌ను సైడ్ హీరోలుగా పెట్టాల్సిందే’’ నంటూ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు తెగ ఎకసెక్కాలాడుతున్నారు.

దీనితో రావలసిన మైలేజీ రాకపోగా, కొనితెచ్చుకున్న ‘కొత్త ముద్ర’తో వైసీపేయులు తెగ ఇదయిపోతున్నారు. జగన్‌కు సరైన సలహాదారులు లేరనే ఇప్పటివరకూ అనుకున్నామని.. కానీ సరైన స్క్రిప్టు రైటర్లు కూడా లేరన్న విషయం, ఇప్పుడే తెలిసిందని జగనన్న వీరాభిమానులు తలపట్టుకుంటున్నారు. ఏదేమైనా.. తనను కలవాలన్న ఒక చిన్నారిని దగ్గరకు పిలిచి ముద్దుపెట్టి, చిన్నారి పెదవులపై చిరునవ్వులు చిందించేలా చేసి తెచ్చుకున్న తిరుగులేని బోలెడెంత ఇమేజ్‌ను.. జగనన్న తన ‘మగప్రేమ’ మాటలతో మరికొన్నేళ్లు చెరిపేసుకోలేనంత, డ్యామేజీ చేసుకున్నారన్నది జగనాభిమానుల ఆవేదన.

LEAVE A RESPONSE