ఈ వీవీఐపీల వీరసేవ ఏమిటి స్వామీ?

( మార్తి సుబ్రహ్మణ్యం)

సర్వసంగ పరిత్యాగి అంటే ఐహిక సుఖాలకు దూరంగా ముక్కుమూసుకుని జపం చేసేవాడన్నది చాలామంది నమ్మకం. అలాంటి వారికి పైసలతో గానీ, ప్రచారంతోగానీ పనిలేదు. అది నిజం కూడా. కానీ ఏసీ కార్లు, బిజినెస్ క్లాసులో విమానప్రయాణం, వీవీఐపీలను స్వయంగా తామే వెళ్లి కలవడం, ఫ్లెక్సీలు-కటౌట్ల షోకులు, మాల్స్-షాపింగు కాంప్లెక్సుల ఇనాగరేషన్లు, ప్రచారం కోసం పరితపించేవారే అసలు సిసలైన సర్వసంగ పరిత్యాగులున్నది ఈనాటి స్వాముల భావన.

ఇప్పుడు వీవీఐపీలు ఎంతమంది వస్తే సదరు స్వాములోరు అంత పాపులర్ కింద లెక్క. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పాదాభిషేకాలకు రేట్లు ఫిక్సు చేయడం, ఆయా కార్యక్రమాలకు గిరాకీ తెచ్చిన వారికి పర్సంటేజీలు కూడా ఇవ్వడం ఇప్పటి స్వాముల స్టైల్. బెంజికారుకు తగ్గకుండా, గన్‌మెన్లు, పీఠాలకు
swamy-tpt పోలీసు అవుట్‌పోస్టులు పెట్టించకోకపోతే ఆ స్వామికి బయట ఇమేజే లేదన్నది ఇప్పటి కొందరు పీఠాథిపతుల మనోగతం. సర్కారీ జర్నలిస్టుల మధ్యవర్తిత్వం లేనివారు, పాత్రికేయ ప్రముఖులతో సత్సంబంధాలు లేనివారు అసలు స్వాములే కాదన్నది మరో భావన.

ఈ మధ్య పొలిటికల్ ఫాలోయింగ్ ఉన్న స్వాములు కొందరు ఆధ్యాత్మికం, ధర్మప్రచారం వదిలేసి, లౌకిక విషయాల్లో యమా ఫాస్టుగా ఉంటున్నారు. నామినేటెడ్ పోస్టుల నుంచి, పాలక శిష్య పరమాణువులకు
ram-swamy చెప్పి కొత్త కాంట్రాక్టులు, పాత పెండింగ్ బిల్లులు ఇప్పించేవరకూ తమ తపోశక్తిని ధారపోస్తున్నారు. దేశంలోని ప్రముఖులు తమ ఆశ్రమాలకు వచ్చినప్పుడు, తమ శిష్య పరుమాణువులయిన కాంట్రాక్టర్లను వీవీఐపీలకు పరిచయం చేసి, వారికి నాలుగురాళ్లు వెనక వేయించడం అనే ‘సుపారీ పనులు’ సులువుగా చేస్తున్నారు. ఇంకొందరు సర్వసంగ పరిత్యాగుల పీఠాలన్నీ, సదరు వీవీఐపీ పారిశ్రామికవేత్తల నల్లధనంతో పునీతమవుతున్నాయట. నిజం నారాయణుడికెరుక?

సరే.. ఇవన్నీ జనం నోట్లో నానుతున్నవే కాబట్టి అందులో ఆశ్చర్యం, కొత్తదనం లేకపోవచ్చు. కానీ సర్వసంగ పరిత్యాగులయిన స్వాములు, ఒక పీఠానికి ఉత్తరాధికారి అయి ఉండీ.. ‘మా పీఠం వార్షికోత్సవాలకు వీలుచూసుకుని రమ్మని’ స్వయంగా వెళ్లి ఇన్విటేషన్ కార్డు-కమ్ బహుమతులిచ్చే కొత్త కల్చర్ తెలుగునేలపైన దర్శనమివ్వడమే, భక్తశిఖామణులను బిత్తరపోయేలా చేస్తోంది. జనరల్‌గా భక్తులే స్వాములకు బహుమతులిస్తుంటారు. అప్పుడు స్వాములు వారికి ఫలమో, పుష్పమో ఇస్తారు. అది కూడా తాకకుండా దూరంగా! కానీ రివర్సులో స్వాత్మానందేంద్రుల వారే జగనన్నకు బహుమతులివ్వడమే ఆశ్చర్యం.

విశాఖలో కొలువుదీరిన శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు, ఫిబ్రవరి 7 నుంచి 11 వ తేదీ వరకూ జరగనున్నాయి. సంతోషం. పాత తరం, ఈ తరం కళ్లు తెరిచిన తర్వాత అనేక పీఠాలు, స్వాములను చూసినప్పటికీ.. వారెవ్వరికీ రాని పాపులారిటీ, కేవలం మూడేళ్లలోనే సంపాదించుకుని, పాలకులకే గుగ్గురువులయి, జగ ద్గువు కాస్తా జగన్గురు’గా మారిన అదృష్టం ఒక్క విశాఖ శారదా పీఠానికే దక్కింది. ఈ
swamy-birth-day విషయంలో కంచి, హంపి, శృంగేరీ, పుష్పగిరి వంటి పరంపరగా వచ్చిన పీఠాలన్నీ ఈర్ష్యపడే స్థాయికి శారదా పీఠం ఎదగడం మంచిదే. ఎవరి ఆర్టు వారిది. ఎవరి టాలెంటు వారిది. ‘పోకిరి’ సినిమాలో మహేష్‌బాబు చెప్పినట్లు.. ‘ఎప్పడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా’ అన్నదే ఇంపార్టెంట్. అంటే పీఠాలు పెట్టి ఎన్ని వందలేళ్లయిందన్నది కాదు. జెండా పాతేశామా? లేదా అన్నదే ముఖ్యం. సరే ఎవరి అదృష్టం వారిది. వేటగాడయిన వాల్మీకి మహర్షిగా మారి, రామాయణం రాయగా లే నిది, మానవాధములమయిన మనమెంత? అందులోనూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నది అందరికీ రాదు. అదొక కళ. అందరూ రవిశంకర్లు కాలేరు కదా?

సరే.. విశాఖ గడ్డపై పుట్టిన విశాఖ పీఠం వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని పీఠాథిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాథికారి స్వాత్మానందేంద్ర సరస్వతి జమిలిగా సంకల్పించడం సంతోషమే. అందులోనూ తమ తపశ్శక్తితో జగన్‌ను సీఎంగా చేసి, ఆంధ్రరాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న విశాఖ పీఠం వార్షికోత్సవమంటే, అది ప్రతి తెలుగువారి ఇంట్లో జరిగే పండుగే. రొటీన్‌గా అయితే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలేమైనా సంకల్పిస్తే.. పీఠానికి రెగ్యులర్ స్వాన్సర్లయిన భక్తబృందంతో ఒక కమిటీని వేసి, దాని ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం ఏ పీఠాల్లోనయినా కనిపించేవే. జనరల్‌గా ఏ స్వాములకయినా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, రియల్టర్లే రెగ్యులర్ స్పాన్సర్లు కాబట్టి ఆయా కార్యక్రమాలన్నీ పెద్దగా నిధుల కొరత లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతుంటాయి.

కానీ రొటీన్‌కు భిన్నంగా విశాఖ పీఠం ఉత్తరాథికారి శ్రీమాన్ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములుం గార్లు, సదరు వార్షికోత్సవ మహోత్సవాలకు దయచేయండని వీవీఐపీల గడప తొక్కడతమే వింత. ఎవరైనా మా కూతురు పెళ్లి ఉందనో, కొడుకు పెళ్లి ఉందనో, మా అమ్మాయి పెద్ద మనిషయిందనో, బర్త్‌డే పార్టీ ఉందనో కార్డులు కొట్టించి వీఐపీలకు ఇస్తుంటారు. వారంతా తమ కార్యక్రమాలకు వస్తే.. బంధుగణంలో కొంచెం ఇమేజ్, ఇంకొంచెం భయం ఉంటుందన్న ముందుచూపు. కానీ సర్వసంగ పరిత్యాగులయిన స్వాత్మానందేంద్ర సరస్వతి వంటి ‘కలియుగ పరమాచార్య’ కూడా, పామరుల మాదిరి వీవీఐపీల ఇళ్లకు వెళ్లి కార్డులివ్వడంపునే ఇప్పుడు రచ్చంతా!

ఐహిక సుఖాలు వదిలేసిన నయా జమానా సర్వసంగ పరిత్యాగులు.. బెంజి కార్లు, బిజినెస్ క్లాసులో తిరిగి.. నిద్రించే సమయంలో కూడా వెంట ఉండాల్సిన ‘సత్యదండ’ను, పైన అటకెక్కించి ప్రయాణీకులకు పెట్టే టిఫిన్లు అందరితోపాటు లాగిస్తున్న ఈ ఆధునిక యుగంలో, వారి నుంచి సంప్రదాయాలు ఆశించడం అత్యాశే అయినప్పటికీ.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విశాఖ పీఠమే దిగివచ్చి, మా కార్యక్రమాలకు ర మ్మని వీవీఐపీల ఇళ్లకు వెళ్లి పిలవడం తమకే చిన్నతనంగా ఉందన్నది భక్తశిఖామణుల ఆవేదన. ఇప్పుడే కాదు. గతంలో కూడా ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిష్టర్లూ, రామ్‌మాధవ్ లాంటి వాళ్లను కలవడం కూడా తమకు నచ్చలేదన్నది కొందరి భక్తుల మనోవేదన.

కానీ హుండీలో పదిరూపాయలు వేసే కామన్ భక్తుల కంటే.. కార్పొరేట్ ఆసుపత్రులు, పాపింగ్ మాల్స్ ఇనాగరేషన్లు, భక్తుల ఇళ్లకు వెళ్లి చేయించుకునే పాదపూజల సందర్భంలో ఇచ్చే కానుకల విలువే ఎక్కువుంటుందని, పిచ్చి భక్తులకు ఏం తెలుసు? సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ వారూ మనుషులే
swamy1-2 కదా? వారికి కోరికలు, ప్రచార కాంక్ష, వీవీఐపీల సాంగత్యం,రాచమర్యాదలు, రాజగురువుల హోదాలూ ఉండకూడదంటే ఎట్లా? అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ జమానాలో కంచి పరమాచార్య తన వద్దకు విరాళాలతో వచ్చిన భక్తుడిని పిలిచి, వాటిని ఒక పేద భక్తుడికి ఆయన చేతులతోనే ఇప్పించేవారట. అసలు ఆ డబ్బులవైపే చూసేవారు కాదట. మరి ఇప్పుడు దానికి పూర్తి రివర్సు! తన 13వ ఏటనే సన్యాసాశ్రామం స్వీకరించిన పరమాచార్యుల వారు, సత్యదండను తన వంటికే చుట్టుకుని నిద్రించే అలవాటు చేసుకునేందుకే కొన్నేళ్లు పట్టిందట. ఇప్పుడు నయా స్వాములు అంత కష్టపడాల్సిన పనిలేదు. బెంజి కారులో వెళ్లినా, బిజినెసు క్లాసులో వెళ్లినా దండను ఎంచక్కా పక్కనపెట్టవచ్చు.

Leave a Reply