(ములుగు రాజేశ్వర రావు )
పౌర పాత్రికేయుడు :- ఆగాగు! సీనియరా ! హహ్హ ఏమంటివి? ఏమంటివి ? పాత్రికేయ జాతి నెపమున కొమ్మినేనికి నిలువ అర్హత ఉందందువా ! ఎంత మాట, ఎంత మాట ! ఇది పాత్రికేయ విలువల పరీక్షయే కాని ప్రజాస్వామ్య పరీక్ష కాదే ? కాదు, కాకూడదు, ఇది పాత్రికేయుల పరీక్షయే అందువా ! అంతకుముందు నీవు పని చేసిన పత్రిక విలువలు ఎట్టివి ? పాత్రికేయునిగా అతి జుగుప్సాకరమైన నీ పాత్రికేయ జీవితమెట్టిది ?
రాజకీయ పార్టీల సిఫార్సులతో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ పార్టీ మీడియా ? ఇంతయేల, మన సంపాదకులే ఎందరో ఇలా జనియించలేదా !
నాతో చెప్పింతువేమయ్యా , సందర్భావసరములనుబట్టి రాజకీయ, స్వార్థ ప్రయోజనములతో సంకరమైన మన పాత్రికేయ రంగము- ఏనాడో సంస్కారహీనమైనది, భ్రష్టుపట్టినది… కాగా, నేడు విలువలు.. విలువలు అను వ్యర్ధవాదమెందులకు?
సీనియర్ :- నాయనా యువ పౌర పాత్రికేయా! ఏరుల, పారుల, సీనియరుల జననములు మనము విచారించదగినవికావు. ఇది, నీవన్నట్లుగా, ముమ్మాటికీ పాత్రికేయ పరీక్షయే! పత్రికా రచన చేస్తున్న ప్రతి వారూ పాత్రికేయులే ! వారిలో పార్టీ పత్రికల్లో పనిచేస్తున్న వారే పెత్తనం చలాయించగల పాత్రికేయులు! అట్టివారే ఇటువంటి వివాదములలో పాల్గొనుటకు అర్హులు!
పౌర పాత్రికేయుడు:- ఓహో ! రాజకీయ పార్టీల అండలా అర్హతను నిర్ణయించునది. అయిన మా ప్రజాస్వామ్యములో సస్యశ్యామలమై వెలుగొందునటుల, మా పౌర సమాజ పత్రికకు ఇప్పుడే అంకురార్పణ గావించెదను, చైతన్యవంతుడయిన ఒక యువ పౌరుని సంపాదకునిగా నియమించుచున్నాను.
సోదరా.. ప్రజా సంఘ నాయకుడా ! అనర్ఘనవరత్న ఖచిత కిరీటమును వేగముగ తెమ్ము; మామా.. సిటిజన్ మీడియా సార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము; జర్నలిజం స్కూలు విద్యార్థులారా ! మంగళతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు
పుణ్యాంగనలారా ! నవయువ పౌర పాత్రికేయుల పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది, వీరగంధము విదరాల్పుడు. నేడీ సకలమహాజన సమక్షమున, పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వథా, శతథా సహస్రథా ఈ పాత్రికేయరంగమున పేరుకుపోయిన మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను.
వార్తల ప్రచురణకు, ప్రసారములకు కైంకర్యములు గ్రహించుచున్న పాత్రికేయులారా ! మీరందరూ కొమ్మినేని మహారాజువెంట ఆయన విలువలను సమర్ధించు పరివారము వెంట నడువుడు;
తెలుగు సమాజ పౌరులారా, మీ బుద్ధి ఇకనయిననూ వికసనము పొందుగాక… నా ఈ ప్రక్షాళనా యజ్ఞమునకు జేజేలు పలికెదరుగాక, ప్రజల, ప్రభుత్వ ఖజానానుంచి పలు రాయితీలు, ప్రోత్సాహకాలతో మీరు పోషించుచున్న మీడియాను సప్త సముద్రములలో నిమజ్జనం కావింపుడు… లెండు.