Suryaa.co.in

Editorial

‘న్యాయ’మెక్కడ నాయకా?

  • విపక్షంలో టీడీపీ లాయర్ల అవిశ్రాంత యుద్ధం

  • జగన్ సర్కారుపై లీగల్‌సెల్ జంగ్

  • నయాపైసా తీసుకోకుండా న్యాయపోరాటం

  • ఎవరికి వారు సొంత యుద్ధం చేసిన సీనియర్ లాయర్లు

  • అర్ధరాత్రి, తెల్లవారుఝామున సిఐడీ దాడులను ఎదుర్కొన్న లీగల్ సెల్

  • రంగనాయకమ్మ నుంచి చంద్రబాబు అరెస్టు వరకూ కోర్టులో అలుపెరుగని పోరాటం

  • సీఐడీ, పోలీసుస్టేషన్ల వద్దనే నిద్రాహారాలు

  • అయినా ఇప్పటిదాకా అందని పదవుల ‘న్యాయం’

  • ‘ఆయన’ సిఫార్సు చేసిన వారికే పదవులా?

  • బాబుకు బెయిల్‌లో విఫలమైనా ‘ఆయన’కే అందలం

  • విపక్షంలో మూడేళ్ల వరకూ హైకోర్టులో పిటిషన్ వేయని వైచిత్రి

  • బాబును కలిసిన లాయర్లు ఇక తెరమరుగే

  • బాబు మెచ్చుకున్న వారి సంగతీ అంతే

  • ఎవరినీ ఎదగనీయని మహా‘మర్రి’వృక్షం

  • ఇప్పటిదాకా లీగల్‌సెల్ అధ్యక్షుడికే పదవి లేని వైచిత్రి

  • ఇంకా పెండింగ్‌లో హైకోర్టు, జిల్లా స్థాయి పదవులు

  • జగన్ వచ్చిన నెలరోజుల్లోనే న్యాయపదవులు భర్తీ

  • ఇప్పటిదాకా సమీక్ష చేయని దయనీయం

  • ఎవరు దయతలిస్తే పదవులిస్తారంటున్న లీగల్ సెల్ నేతలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ ఐదేళ్ల జమానాలో సర్కారుకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసిన గుంటూరు శంకర్‌విలాస్ యజమాని రంగనాయకమ్మ అనే వృద్ధురాలి నుంచి.. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వరకూ అంతా సీఐడీ, ఏసీబీ, పోలీసుల వేధింపులు ఎదుర్కొన్నవారే. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అధికార ప్రతినిధులు, జిల్లా స్థాయి నేతలు జగన్ సర్కారు దురహంకారానికి అరెస్టు అయిన వారే.

ఆ మధ్యలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన లెక్కలేనంతమంది సోషల్‌మీడియా సైనికులను కేసులు, అరెస్టులతో జగన్ సర్కారు రాచిరంపాన పెట్టింది. ఆ భయాందోళన సమయంలో.. ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్న మంత్రులెవరూ కనిపించలేదు.. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు తీసుకున్నవారెవరూ కనిపించలేదు. అంతకుముందు మంత్రులు, ఎమ్మెల్యే పదవులనుభవించిన వారంతా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, సింగపూర్, థాయ్‌లాండ్, మలేసియాలో వ్యాపారాలు, పేకాట, క్యాసినోవాలో బిజీగా ఉన్నారు. ఇంకొంతమంది తమ రాజకీయ ఉనికి కోసం, బీజేపీలో చేరే ప్రయత్నాలు చేశారు. అలాంటివారు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు.

కానీ పార్టీ నేతలను అర్ధరాత్రి- తెల్లవారున పోలీసులు చెరబట్టినప్పుడు, అక్కడ వారిని అడ్డుకుని.. పోలీసుస్టేషన్ల వద్ద కావలి కాసి, కోర్టులో నల్లకోటు వేసుకుని యుద్ధం చేసింది మాత్రం లాయర్లే. పార్టీకి అనేక అనుబంధ సంస్థలున్నప్పటికీ.. నేతల అరెస్టు, కేసుల సమయంలో పోలీసు వాహనాలకు అడ్డం పడుకుని.. చివరకు సెల్‌లో ఉన్న నేతలను చూపిస్తే గానీ అక్కడి నుంచి కదిలేదంటూ, పోలీసుస్టేషన్లు- సీఐడీ ఆఫీసు ముందే బైఠాయించిన పట్టువదలి విక్రమార్కులు లీగల్ సెల్ నాయకులే. అప్పుడు వారే కనుక పోరాడకపోతే.. జగన్ సర్కారు వేధింపులకు భయపడి, సగానికి పైగా నేతలు వైసీపీలోకి జంపయ్యేవారన్నది మనం మనుషులం అన్నంత నిజం. అప్పటి భయానక వాతావరణం అలాంటిది మరి!

కానీ ఇప్పుడు వారి త్యాగాలకు గుర్తింపులేదు. వారి పోరాటానికి ఫలితం లేదు. వారి కష్టాన్ని ఇప్పటిదాకా మెచ్చుకున్న వారే లేరు. అంతా ‘ఆయన ’దయాధర్మమే. ‘ఆయన’ దయతలిస్తేనే గుర్తింపు. పార్టీ కోసం పోరాడిన లాయర్లను, ‘ఆయన’ ఎదగనీయరన్న ఘనకీర్తి బహిరంగ రహస్యమే. ఆ ‘మహామర్రి వృక్షం’ కింద ఏ ఒక్క మొక్క మొలవదన్న చర్చ కూడా బహిరంగమే.

పనిచేసిన వారికి పదవుల వ్యవహారమంతా ‘ఆయన’’ దయ.. వారి ప్రాప్తమన్నట్లు మారింది. ఆయన సిఫార్సు చేస్తేనే పదవులు ఇస్తామని, విపక్షంలో పార్టీ కోసం పనిచేసినప్పుడు ఎందుకు చెప్పలేదు? మేమేం పనిచేశామన్నది చంద్రబాబు నుంచి నక్కా ఆనంద్‌బాబు వరకూ తెలిసినప్పుడు, మళ్లీ ఈ సిఫార్సులెందుకు? మేం ఇంకా ఏం చేస్తే పదవులిస్తారన్నది విపక్షంలో పనిచేసిన లాయర్ల ఆవేదన. మరి ఇదంతా పార్టీ నాయకత్వానికి తెలియదా? పార్టీలో ఓ సాధారణ నేతకే తెలిసిన ఇన్ని బహిరంగ రహస్యాలు పెద్దాయనకు తెలియవా? మరి తెలిసినా ఇంకా ‘ఆయన’కే ఎందుకు పట్టం కడుతున్నారు? స్వయంగా తన అరెస్టు సమయంలో, బెయిల్ ఇప్పించడంలో విఫలమైన ‘పెద్ద తలల’నే, పెద్దాయన ఇంకా ఎందుకు నమ్ముతారంటే.. నిజం ‘నారా’యణుడికెరుకన్నది సీనియర్ల నర్మగర్భ జవాబు.

టీడీపీ ఐదేళ్ల విపక్ష కాలంలో పార్టీ లీగల్ సెల్‌తో పాటు.. ఎవరికి వారు స్పందించి జగన్ సర్కారుపై కేసులు వేసిన న్యాయవాదులు బోలెడుమంది. పార్టీ అనుబంధ లీగల్ సెల్‌లో ఒక అరడజను మంది, లీగల్ సెల్‌తో సంబంధం లేకుండా వివిధ కేసులు వేసిన హైకోర్టు న్యాయవాదులు మరో పదిహేనుమంది వరకూ ఉంటారు. వీరిలో డబ్బులు తీసుకుని వాదించిన వారు కొద్దిమంది ఉన్నప్పటికీ, పార్టీ కోరకపోయినా.. చంద్రబాబునాయుడు, నాయకులపై ఉన్న వ్యక్తిగత అభిమానంతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేసిన వారి లాయర్ల సంఖ్యనే ఎక్కువ.

ప్రజలకు వాక్‌స్వాతంత్య్రం ఉంటుందని సెలవిచ్చిన నాటి డీజీపీ గౌతం సవాంగ్‌ను రెండుసార్లు హైకోర్టులో నిలబెట్టి, ఆయనతో రూల్ చదివించిన కేసు వేసింది కూడా ఈ తరహా లాయరే కావడం విస్మరించకూడదు. సీడీఐ కేసుల్లో 80 శాతంవరకూ వాదించడమే కాకుండా, అర్ధరాత్రి వేళ సీఐడీ ఆఫీసు వద్ద పడికాపులు కాసి, ఇడ్లీ-టీ తాగి కడుపునింపుకున్న పార్టీ లాయర్ల త్యాగాలు వెలకట్టలేనివి.

గుంటూరు శంకర్‌విలాస్ యజమాని రంగనాయకమ్మకు నోటీసుల నుంచి.. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, పట్టాభి, కొల్లు రవీంద్ర, ప్రణవ్ గోపాల్, టీడీపీ మీడియా పీఆర్వో దారపనేని నరేంద్ర అరెస్టు.. చంద్రబాబు అరెస్టు, అంగళ్లు, మదనపల్లి వంటి కీలక కేసుల్లో పాదరసంలా పనిచేసింది నాయకులు కాదు. లీగల్‌సెల్ న్యాయవాదులేనన్నది బహిరంగ రహస్యం. ఇక ఎన్నికల ముందు దొంగఓట్లు, ఈసీపై కేసులు, కార్యకర్తలకు నిలిచిపోయిన ఉపాథి హామీ పథకం బిల్లులపై న్యాయపోరాటం చేసింది కూడా పార్టీపై అభిమానం ఉన్న లాయర్లే కావడం విశేషం.

చివరకు జగన్‌కు వ్యతిరేకంగా కేసులు వేస్తున్నందుకు, పోలీసులు విజయవాడలో ఒక ప్రముఖ లాయర్ ఆఫీసు, ఆ కేసు వాదిస్తున్న లాయర్ ఇంటిపై దాడి చేసిన వైనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసుల దౌర్జన్యానికి సంబంధించి సీసీ టీవీ పుటేజీని సాక్ష్యంగా ప్రవేశపెట్టి, వారిని ముద్దాయిలుగా నిలబె ట్టిన ఆ కేసు అప్పట్లో పెనుసంచలనం రేపింది.

అయితే వీరెవరూ పార్టీ నుంచి నయాపైసా ఆశించకుండా, చంద్రబాబుపై అభిమానంతో ఎవరికివారు దూరప్రాంతాలకు వెళ్లి, జగన్ సర్కారుపై న్యాయపోరాటం చేసిన వారే కావడం విశేషం. చాలా సందర్భాల్లో స్వయంగా చంద్రబాబునాయుడు వారితో చర్చించిన సందర్భాలూ లేకపోలేదు.

ఆ సమయంలో మంత్రులు-ఎమ్మెల్యేలు-ఎంపీగా చేసిన కీలకనేతలు, పార్టీకి లీగల్ వ్యవహారాల్లో పెద్దతల అని ప్రచారంలో ఉన్న ఆ ప్రముఖుడు సైతం పత్తా లేరని పలువురు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీ పుణ్యాన ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్న ఆ ప్రముఖుడు.. చంద్రబాబు అరెస్టయితే బెయిల్ తీసుకురావడంలో విఫలమైనందుకే, లోకేష్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి న్యాయవాదులతో చర్చించాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.

పార్టీ లీగల్ సెల్, చంద్రబాబుపై అభిమానంతో సొంతగా జగన్ సర్కారుపై కేసులు వేసిన లాయర్లతో పోలిస్తే.. వరసగా పదవులనుభవిస్తున్న ఆ ప్రముఖుడి ప్రతిభ- సేవలు పదోవంతు కూడా ఉండదని, సీనియర్లు సైతం స్పష్టం చేస్తున్నారు. బాబు బెయిల్ పిటిషన్ సందర్భంలో ఒక న్యాయమూర్తి.. తాను బెంచ్‌పై ఉంటే మీకేమైనా అభ్యంతరమా అని ప్రశ్నిస్తే.. అలాంటిదేమీలేదన్న సమర్ధులపై, పార్టీ నాయకత్వం ఆధారపడటంపై అప్పట్లోనో విస్మయం వ్యక్తమయింది.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. విపక్షంలో రాత్రింబవళ్లు పోలీసుస్టేషన్ల దగ్గర కాపలాకాసి, కోర్టులో న్యాయపోరాటం చేసి నాయకులను విడుదల చేయించిన లాయర్లకు, ‘న్యాయం’ జరుగుతుందని చాలామంది ఆశించారు. లీగల్‌సెల్ నేతలతోపాటు.. పది పదిహేనుమంది హైకోర్టు లాయర్లకు సర్కారు గుర్తింపు ఇస్తుందని భావించారు. ఇంకా జిల్లా స్థాయిలో పార్టీ కోసం నయాపైసా తీసుకోకుండా, కార్యకర్తల కోసం పనిచేసిన లీగల్‌సెల్ నాయకులకు న్యాయపరమైన పదవులు వస్తాయని ఆశ పడ్డారు.

జగన్ అధికారంలోకి వచ్చిన రెండునెలల్లోనే హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో ప్రభుత్వ పదవులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేశారు. దానితో తమ ప్రభుత్వం కూడా హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్, జీపీ, ఏజీపీ వంటి పదవులను.. విపక్షంలో అవిశ్రాంతంగా పనిచేసిన లీగల్ సెల్, ఇతర న్యాయవాదులకు ఇస్తుందని ఆశించారు. కానీ ఇప్పటిదాకా అవి డజన్ల సంఖ్యలోనే భర్తీ చేయడం వారిని నిరాశ పరుస్తోంది. ఇక జిల్లా కోర్టులు, మున్సిఫ్ కోర్టుల్లో వైసీపీ హయాంలో పనిచేసిన పీపీలే ఇంకా కొనసాగడం ఆశ్చర్యపరుస్తోంది.

ప్రతిపక్షంలో ఉండగా తమతో పనిచేయించుకున్న నాయకత్వం ఇప్పుడు ఎందుకు గుర్తించడం లేదు? లేక ఇంకా కొత్తగా ఏమైనా విధేయత ఆశిస్తోందా? మేం ఎవరికి విధేయతగా ఉండాలి? పెద్దసారుకా? ఆ ప్రముఖుడికా? మాకు పదవులివ్వాలంటే ఇంకా ఏం చేయాలో చెబితే సరిపోతుంది కదా?

పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని కూడా అప్పుడు పోలీసులు విడిచిపెట్టలేదు. అయినా ఎదుర్కొన్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్నందున ప్రభుత్వ పదవులు వస్తాయనుకుంటే, మేం గుర్తుపట్టని వాళ్లకు, ఐదేళ్ల ప్రతిపక్షంలో కనిపించని వారికి పదవులివ్వడం చూస్తుంటే.. మేం ఐదేళ్లు ఎందుకు పనిచేశామా అన్న కొత్త ఆలోచన కలుగుతోందని హైకోర్టు న్యాయవాది ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే పార్టీకి న్యాయపరమైన అంశాల్లో కీలకంగా ఉండే ఓ ప్రముఖుడు సిఫార్సు చేస్తేనే పదవులొస్తాయన్న భావన, పార్టీ న్యాయవాదులకు మనస్తాపం కలిగిస్తోందట. మేం పార్టీ కోసం న్యాయపోరాటం చేస్తున్న సమయంలో ఆయనెక్కడ ఉన్నారు? ఆయన అంత సమర్ధుడైతే చంద్రబాబు అరెస్టయితే బెయిలెందుకు తీసుకురాలేకపోయారు? ఢిల్లీ లాయర్లు వస్తే తప్ప బాబుకు బెయిలెందుకు రాలేదని పార్టీ సీనియర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

‘‘ పేరున్న లాయర్లు, పనిచేసే లాయర్లు, లా తెలిసిన లాయర్లను ఆయన దగ్గరకు రానీయరు. సార్ దగ్గరకు వెళ్లనీయరు. సార్ అందరిముందు ఎవరినైనా లాయర్లను మెచ్చుకుంటే ఇక ఆ లాయర్ పని అయిపోయినట్లే లెక్క. ఆయన ఇటీవల చాలామందిని పదవుల కోసం సిఫార్సు చేశారు. అందులో కొందరు తప్ప, మిగిలిన వారిని మేం ఎప్పుడూ ఐదేళ్లూ పార్టీ కోసం పోరాడగా చూడలేదు. ఆయన ఒక మహా మర్రి వృక్షం. ఆయన నీడలో ఏ మొక్క మొలవదు. ఆయనదంతా ఢిల్లీ సారు స్ట్రాటజీ. పోనీ ఆయనేమైనా న్యాయశాస్త్రంలో నిష్ణాతుడా అంటే, ఆయన తన ప్రతిభతో ఒక్క ఆర్డరు తీసుకువచ్చింది లేదు. అయినా మా భవిష్యత్తును పార్టీ నాయకత్వం ఆయనకు వదిలేయడం విచారకమ’’ని హైకోర్టు న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు.

అసలు ఇప్పటిదాకా విపక్షంలో ఉండగా పార్టీ నేతల కోసం న్యాయపోరాటం చేసిన లీగల్ సెల్ చైర్మన్‌కే ‘న్యాయం’ జరగలేదంటే, పదవుల సిఫార్సు ఏ స్థాయి వ్యక్తుల అధీనంలో ఉన్నాయో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
చివరకు స్టాండింగ్ కౌన్సిల్స్ నియామక అంశంలో యువనేత, మంత్రి లోకేష్ సిఫార్సులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. లోకేష్ ఆఫీసు సిఫార్సు చేసిన వారిపై ఫిర్యాదులున్నాయనో, వారికి పనిరాదనో, వారు పనేమీ చేయలేదన్న కారణం చూపించి తిరస్కరిస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.

కాగా అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా.. విపక్షంలో పార్టీ కోసం పోరాడిన లాయర్లకు, పార్టీ పక్షాన కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం కూడా నిర్వహించకపోవడం, వారందరినీ చంద్రబాబు-లోకేష్‌తో భేటీ వేయించే ఆలోచన కూడా రాకపోవడం బట్టి.. ‘పనిచేసిన వారు పనికిరార’న్న సంకేతాలిస్తోందని సీనియర్లు వాపోయారు. ‘‘అదే జగనయితే తన కోసం పనిచేసిన వాళ్లను నె త్తిన పెట్టుకుంటారు. వారిపై ఎన్ని విమర్శలున్నా పట్టించుకోరు. అధికారంలోకి వచ్చిన వెంటనే పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టు ఇవ్వడమే దానికి నిదర్శనం. మాదగ్గర అలాంటి వ్యవస్థ లేద’ని పార్టీ వ ర్గాలు పెదవి విరుస్తున్నాయి.

LEAVE A RESPONSE