నవ వసంతాల్లో పేదల నవ్వేదీ?

-తొమ్మిదేళ్లలో చేసిందేమున్నది చెప్పుకోవడానికి?
-కార్పొరేట్ వర్గానికి మోదీ చౌకీ దారు
-వ్యవసాయ రంగాన్ని, కార్పోరేట్‌ కంపెనీలకు ధారాదత్తం
-గతాన్ని తవ్వడం తప్ప, దేశానికి తాను ఏం చేశారో చెప్పలేని దుస్థితి
-ఆత్మనిర్భర్ భారత్ అంటూనే మరోపక్క అప్పుల దుర్భర్ భారత్
-తొమ్మిదేళ్లలో ఒక్కసారీ మీడియా ముందుకు రాని మోదీ
-ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగ హామీ ఏదీ?
-స్వప్రయోజనాలకు ఐటీ, సీబీఐ, ఈడీ, ఆర్బీఐ
-హరించుకుపోతున్న రాష్ట్రాల హక్కులు
-మోదీ తొమిదేళ్ల పాలనలో ఫలితం సున్నా
-తొమ్మిదేళ్లుగా అసత్య మేవ జయతే

ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి అవుతుంది. దేశ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అసమర్ధ,అసంబద్ద పాలనా విధానాల ద్వారా.. దేశ ఆర్ధిక,సామాజిక జనజీవనాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు.

2014 ఎన్నికల్లో అభివృద్ది ఎజెండాతో కొత్త తరం నేతగా మోదీ తెరపైకి రావడంతో దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ జీవితాల్లో ఏదో అద్భుతమైన మార్పు జరగబోతుందని ప్రజలు ఆశ పడ్డారు.రాజకీయ వ్యవస్థను మెరుగుపరచి,ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచి, అందరి శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకొనే, సమర్ధవంతమైన నేత మన ముందుకు వచ్చారని సంబరపడ్డారు.

అద్భుత ప్రసంగాలు,అమోఘమైన వాగ్దానాలు,హావభావ విన్యాసాలు,ఆచరణ ఎరుగని ఆదర్శాలతో దేశ ప్రజలను బురిడి కొట్టించి, అధికారంలోకి వచ్చిన మోదీ దేశాన్ని అన్ని విధాలా అధోగతి పాలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి అంశాలను మోడీ ఎన్నికల అస్త్రాలుగా మలుచుకున్నారు.

దేశంలోని అవినీతిపరులు దేశ సంపదను లూటీ చేసి, స్విస్‌ బ్యాంకుల్లో లక్షల కోట్లు దాచుకున్నారని, దానిని దేశ ప్రజలకు పంచితే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తాయని, ప్రతి ఒక్కరి అకౌంట్‌లో వేస్తామని మోడీ వాగ్దానం చేసారు . ప్రతి సంవత్సరం వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఆత్మహత్యలు నివారించడానికి రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు ఆదాయం పెరిగే విధంగా చేస్తామన్నారు.

రెట్టింపు మాట దేవుడెరుగు. పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేశారు. ఉపాధి అవకాశాలు లేక యువత శక్తి వృధా అవుతున్నది. అందువల్ల ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ హామీలను సాధించగలిగే శక్తి, యుక్తి, దేశాన్ని ముందుకు తీసుకుపోయే సామర్థ్యం నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని ఊదర గొట్టారు కమల నాథులు.

దేశంలో అత్యధిక మంది ఆధార పడివున్న వ్యవసాయ రంగాన్ని, కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు. ప్రభుత్వ విధానాల వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెరిగిపోయాయి. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, రైతులు వ్యవసాయాన్నే మానేసే పరిస్థితి తెచ్చారు .వ్యవసాయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చి కోట్లాది మంది వ్యవసాయ రంగాన్ని వదిలేస్తున్నారు.

రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయి. కేంద్ర నేర పరిశోధనా సంస్థ రిపోర్టు ప్రకారం 2016లో 11,379 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా,2017లో 10,655 మంది, 2018లో 10,349 మంది, 2019లో 10,281 మంది, 2020లో 10,677 మంది, 2021లో 10,881 మంది, 2022లో పది వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ కూలీలకు జీవనాధారంగా ఉన్న, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీన పరిచారు. వ్యవసాయరంగం స్థితి గతులు మార్చే ప్రయత్నం జరగలేదు.వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి, రైతుల ఆత్మహత్యలు నివారించే చర్యలు చేపట్టలేదు.ప్రధాన వ్యవసాయ రంగం తిరోగమనం లోకి నెట్టారు.

మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఒక్కసారి కూడా మీడియా సమావేశం జరపలేదు. ఎన్నికల ముందు చెప్పింది వేరు , నేడు చేస్తున్నది వేరు. తొమ్మిదేళ్ల నాడు చెప్పిన దానికి, చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. తొమ్మిదేళ్లుగా అసత్య మేవ జయతే అన్న రీతిగా సాగుతుంది పాలన .వాగ్దానాల వరద పారించారు తప్ప, అవి వాస్తవ రూపం దాల్చలేదు.

ఆకలి,అవిద్య,అనారోగ్యం,మౌలిక సదుపాయాల కల్పన,ఉపాధి వంటి ప్రాధమిక సమస్యలు పరిష్కరించలేక పోయ్యారు.సమాఖ్య భావనకు తూట్లు ,రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు,ప్రశ్నించే గళాలకు సంకెళ్ళు నిత్యకృత్యమయ్యాయి.దేశాన్ని తిరోగమన బాట పట్టించారు. కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్ళు అధికారం ఇచ్చారు నాకు 60 రోజులు చాలు అచ్చేదిన్ తెస్తాను అని దేశ ప్రజలను నమ్మించారు.

నేడు అచ్చేదిన్ అంటూ ఆశలు పెట్టి, ఆవిష్కరించిన సుందర స్వప్నం కరిగిపోయింది.అక్షరాల మోదీ పాలన మేడిపండు ను తలపిస్తుంది.మేక్ ఇన్ ఇండియా ఫెయిల్,డిజిటల్ ఇండియా ఫ్లాప్,స్మార్ట్ సిటీస్ ఫ్లాప్, స్టార్టప్ ఇండియా ఫెయిల్,స్కిల్ ఇండియా ఫెయిల్,పసల్ బీమా ఫెయిల్,బ్యాంకుల లూటీ, నల్లధనం వెనక్కి తేవడంపై తెల్ల మొహం. పేదల ఖాతాల్లో 15 లక్షలు వెయ్యడం మోసం. ఏడాదికి రెండుకోట్ల ఉధ్యోగాల కల్పన దగా.

ఆర్ధిక నేరగాళ్ళపై చర్యలు అంటూ ఆర్ధికనేరగాళ్లను అక్కున చేర్చుకోవడం. చట్టాలను చుట్టాలుగా మార్చుకోవడం,ప్రశ్నిస్తున్న గొంతులు నులమడం వంటి చర్యలతో పాలన సాగించారు. ఆశయాలు అరగదీతే తప్ప, ఆచరణ ఎరుగవు. తొమ్మిదేళ్లుగా గతాన్ని తవ్వడం తప్ప, దేశానికి తాను ఏం చేశారో మోడీ చెప్పలేని దుస్థితి. తాను మాత్రమే దేశ భక్తుడుగా ప్రచారం చేసుకొంటారు. ఏది రాజకీయంగా ఉపయోగపడితే దానిని, రాజకీయంగా ఉపయోగించుకున్నారు. దేశాభివృద్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని మోడీ చెప్పే మాటలు డొల్ల అని, తొమ్మిదేళ్ల పాలన ద్వారా రుజువైoది.

2014 లో నన్నునమ్మండి నల్లధనం వెనక్కి తెస్తాను. ఒక్కొక్కరి ఖాతాలో రూ 15 లక్షలు వేస్తాను అన్నారు. 2015లో నన్ను నమ్మండి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగాన్ని రూపు మాపుతాను అన్నారు. 2016 లో నన్ను నమ్మండి పెద్దనోట్లు రద్దు వల్ల నల్లధనం పోతుంది. అవినీతి అంతం అవుతుంది అన్నారు.2017 లో నన్ను నమ్మండి సర్జికల్ స్ట్రైక్ తరువాత దేశంలో ఉగ్రవాదం ఉండదు అన్నారు.

2018 లో నన్ను నమ్మండి. జీఎస్టీ తో అద్భుతాలు జరిగి , ధరలు తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి అన్నారు. 2019 లో 370 రద్దు తరువాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. 2019 లో నన్ను నమ్మండి cab దేశానికి మంచిది అన్నారు.2020 లో నన్ను నమ్మండి 21 రోజులు ఇంట్లో వుండండి. దీపాలు వెలిగించండి ,చప్పట్లు కొట్టండి కరోనా పారిపోతుంది అన్నారు.

2020లో నన్ను నమ్మండి. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితేనే దేశం బాగుపడుతుంది అన్నారు. 2020 నన్ను నమ్మండి. విద్యుత్తు బిల్లు లు చెల్లించడం రైతులకు మంచిది అన్నారు.అనేక శుష్క వచనాలతో అలరించారు. గత తొమ్మిదేళ్లుగా మోడీ చెప్పిన అబద్దాలకు పరాకాష్ట.ప్రభుత్వ రంగ సంస్థలు,బీమా సంస్థలు,రైల్వేలు,పోర్టులు ఇలా అనేక వ్యవస్థలను అమ్మకానికి పెట్టారు. మేడ్ ఇండియా అంటు ఊదర గొట్టి సేల్ఇండియా చేస్తున్నారు.

ఒక సామాన్యుడు దేశ ప్రధాని అయితే, సామాన్యుల కష్టాలు తెలిసిన వాడుగా దేశాన్ని పాలిస్తారని ప్రజలు భావించారు. ప్రభుత్వాలు వున్నది ప్రజల ఆర్ధిక జీవన ప్రమాణాలు పెంచడానికా? లేక వారి జీవన ప్రమాణాలు పణంగా పెట్టి, ఆదాయం సమకూర్చుకోవడానికా? నిత్యావసర వస్తువుల ధరలు,వంట గ్యాస్ ధరలు,వంట నూనెల ధరలు మంటలు మండుతున్నాయి. ఆ మంటల్లో సామాన్య,మధ్యతరగతి ప్రజల జీవితాలు మగ్గిపోతున్నాయి.

ఒక వైపు పడిపోతున్న నిజ ఆదాయాలు,మరో వైపు ఆకాశాన్ని అంటుతున్న ధరలతో అసంఖ్యాక అభాగ్యుల పరిస్థితి దారుణంగా తయారైంది.మోడీ పాలనకు ముందు వంట గ్యాస్‌ రూ. 450 ఉంటే, నేడు రూ.1175 అయింది. పెట్రోలు రూ.70 నుండి 110కి, డీజల్‌ రూ.55 నుండి రూ.97కు, వంటనూనె రూ. 83 నుండి 175కు పెరిగిపోయాయి.ఈ ధరాభారం మోయలేక, సామాన్యుల నడ్డి విరుగుతున్నది.

డీజీలు,పెట్రోలు ధరలు పెరగడంతో, వ్యవసాయ అనుబంధ రంగాలు పూర్తిగా దివాళా తీసాయి.రైతులకు ఏం చేయాలో దిక్కు తోచడంలేదు.సంవత్సరానికి ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రజల ఖాతాల్లోకి వేస్తామన్న రూ.1.5 లక్షలు, వ్యవసాయాన్ని రెండింతల లాభం వచ్చేటట్లు చేస్తానన్న ఎన్నికల హామీల్లో, ఒక్కటి కూడా నెరవేరలేదు. మేక్ ఇన్ ఇండియా,ఆత్మనిర్భర్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజనా, ప్రధానమంత్రి కృషి సంచాయని యోజన,వన్ నేషన్,వన్ రేషన్,ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ అంటూ నోరు తిరగని ఆర్భాటపు ప్రకటనలతో కడుపునింపుతున్నారు.

ప్రపంచ ఆహార సూచికలో 107వ స్థానానికి చేరి, జనం పెడుతున్న ఆకలి కేకలు,దేశాన్ని పట్టి పీడిస్తున్న దారిద్య్రం, నిరుద్యోగం పెరగడంలో ప్రభుత్వానిదే బాధ్యత. ప్రైవేటీకరణ విధానాలు, జిఎస్‌టి వల్ల ప్రజలపై పడిన అదనపు భారాలు, అవినీతి, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం, ప్రజాస్వామ్య హక్కులపై దాడి, న్యాయస్థానాలను బలహీనం చేసే చర్యలు. .ఆత్మనిర్భర్ భారత్ అంటూనే మరోపక్క అప్పుల దుర్భర్ భారత్ గా ఆవిష్కరించారు.

స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పాలించిన వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పులు, 2021 డిసెంబర్‌ నాటికి రూ 135 లక్షల కోట్లకు చేరగా.. 2023 నాటికి 155 లక్షల కోట్లకు చేరానున్నాయని అంచనా.

అంటే దాదాపు ప్రతీ నెలా రూ 83 వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులన్నీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏమవుతున్నాయి? అనే ప్రశ్నకు సమాధానం లేదు.పదే,పదే అధికారం చేజిక్కించుకునేందుకు ఉచిత పథకాలు అనర్హులకు అందించి, దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారు.ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

ఇంత అప్పుచేసి దేశానికి ఏం చేసినట్లు? ఇంత అప్పు వల్ల వచ్చిన ఫలితాలు ఏమిటో మోదీ చెప్పగలరా? భారత్ రేటింగ్ మాదిరి మిగిలిన దేశాలతో పోలిస్తే , భారత్ అప్పు ఎంతో ఎక్కువగా వుందని మూడీస్ రేటింగ్ సంస్థ వెల్లడించింది.అభివృద్ది చెందుతున్న దేశాల్లో కెల్లా, భారత దేశంలోనే అత్యధికంగా ప్రజలు పేదరికంలోకి జారుకున్నారని.. ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించడంతో, మోడీ ప్రసంగాలు, పరిపాలన అంతా డొల్ల అని తేలిపోయింది.

కాంగ్రెస్ కన్నా.. తాము విలక్షణమైన రాజకీయ పక్షంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ, కాంగ్రెస్ కంటే ఎక్కువగా మురికి రాజకీయాల్లో మునిగి తేలారు. తమకంట్లో దూలాలను దాచిపెట్టి, ప్రత్యర్ధుల కంట్లో నలుచులు చూపెట్టి, రాజకీయ ప్రయోజనం పొందారు. ప్రజలను కులాలు,మతాలు పేరుతో విడతీసి పాలిస్తున్నారు.

ఆర్థిక నేరగాళ్ల అంతు చూడటమే నా పంతం అని ప్రగల్భాలు పలికి, ఎల్లలెరుగని అవినీతికి పాల్పడిన ఆర్ధిక నేరస్తులను అక్కున చేర్చుకొన్నారు. ఆర్థిక నేరస్తులకు,కార్పొరేట్ వర్గానికి మోదీ చౌకీ దారుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగం లో రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులను కూడా హరించి తానే సర్వాధికారిగా చెలరేగిపోతున్నారు మోదీ.

ఐటీ, సీబీఐ, ఈడీ, ఆర్బీఐ, కాగ్ వంటి వ్యవస్థలను గుల్లబార్చి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. దేశ ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్నాయి. నాసిరకం నాయకత్వం దేశానికి పెను ప్రమాదం గా పరిణమించింది. కావున ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ ఒక విపత్తుగా పరిగణించి.. మోదీని ముక్త భారత్ చెయ్యడం తప్ప , మరో మార్గం లేదు.అప్పుడే దేశ సమగ్రాభివృద్దికి బాటలు పడగలవు.

నీరుకొండ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్,
9849625610

Leave a Reply