వివేకా కేసులో శివగామి ఎవరు?

– రఘురామ కొత్త ప్రశ్నతో చర్చ
– వివేకా కేసు మరో మలుపు తిరుగుతుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న నిందితులు, అనుమానితులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో… వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెరపైకి తెచ్చిన మరో కొత్త పేరు ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. అది మహిళా పాత్ర కావడమే ఆ ఆసక్తికి అసలు కారణం.

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటివరకూ ఎంపీ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, దొండవాగు శంకర్ రెడ్డి, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ పేర్లు ప్రచారంలోకి
YS-Vivekananda-Reddy-Death-Letter వచ్చాయి. మీడియా కూడా ఆ కోణంలోనే పలు కథనాలు వెలువరించింది. ఇందులో అవినాష్‌రెడ్డి సహా పలువురి పేర్లను సీబీఐ కూడా చార్జిషీట్‌లో పేర్కొన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

సీబీఐ దర్యాప్తు కూడా అదే కోణంలో జరుగుతున్న సమయంలో..వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. హటాత్తుగా తెరపైకి ఓ మహిళ పేరు తీసుకురావడం సహజంగానే సరికొత్త చర్చకు,
mp-raju1 సంభ్రమాశ్చర్యాలకు దారితీసింది. ఇంతకీ వివేకా హత్య కేసులో శివగామి ఎవరు? అని ప్రశ్నించి సరికొత్త సందేహాలకు తెరలేపారు. ఇప్పటివరకూ ఇలాంటి అనుమానాన్ని వైకాపా రాజకీయ ప్రత్యర్ధి టీడీపీ కూడా వ్యక్తం చేయకపోవడం విశేషం.

‘బాహుబలి’లో భల్లాలదేవుడి తల్లి శివగామి. బాహుబలి తల్లి చనిపోతే, శివగామి అతడిని చిన్నప్పటినుంచే తన కొడుకు భల్లాలదేవుడితో సమానంగా పెంచుతుంది. పక్షపాతం చూపకుండా ఇద్దరికీ అన్ని విద్యలూ నేర్పిస్తుంది. ఆ క్రమంలో శివగామి తన కొడుకు భల్లాలదేవుడిని, నీకేం కావాలో కోరుకో అని అడుగుతుంది. ఇప్పుడు కాదు. సమయం వచ్చినప్పుడు చెబుతానంటాడు. ఆ తర్వాత బాహుబలి ప్రేమించిన దేవసేనను తనకిచ్చి పెళ్లిచేయాలని కోరతాడు. కానీ ఆ ప్రతిపాదనను దేవసేన తిరస్కరిస్తుంది. దేవసేన-బాహుబలి ప్రేమించుకోవడమే అందుకు కారణం. దానితో శివగామికి బాహుబలి-దేవసేనపై అకారణంగా ద్వేషం పెరుగుతుంది. ఆ కోపంతోనే శివగామి కట్టప్పను పిలిచి బాహుబలిని చంపమని శాసిస్తుంది. ఓ సందర్భంలో కట్టప్ప, బాహుబలిని వెనుకనుంచి కత్తితో పొడుస్తాడు. ఈ కథ సారాంశమేమిటంటే.. తన కొడుకు ప్రేమించిన అమ్మాయిని, తాను పెంచిన కొడుకు ప్రేమించి పెళ్లిచేసుకున్నందుకు కక్ష కట్టిన తల్లి, చివరాఖరకు పెంచిన కొడుకునే హత్య చేయిస్తుంది. ఇదీ బాహుబలి సినిమా చూసిన వారికి ఎవరికయినా అర్ధమయ్యే కథ.

మరి ఈ సినిమా పాత్రలకు- వివేకానంద రెడ్డి కేసులో పాత్రధారులకూ ఉన్న సంబంధం, పోలిక ఏమిటో ఎంపీ రఘురామకృష్ణంరాజు మరింత స్పష్టంగా చెప్పి ఉంటే.. ఆయన చెప్పిన శివగామి పాత్రకు ప్రాధాన్యం ఉండేదన్నది విమర్శల విశ్లేషణ. అసలు ఇప్పటివరకూ వివేకా కేసులో ఒక మహిళ పాత్రను ఎవరూ ప్రస్తావించలేదు. ఎవరూ పరిశోధించేదు. ఎంతసేపూ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి వ ంటి ఐదారు పాత్రల చుట్టూనే తిరిగింది తప్ప.. రఘురామ చెప్పినట్లు మహిళ పాత్ర ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు.

ఇప్పటికే జగనన్న సర్కారుకు శిరోభారంగా మారిన రఘురామకృష్ణంరాజు.. గత కొద్దిరోజుల నుంచి, వివేకా హత్య కేసుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎంపీ అవినాష్‌రెడ్డి పేరు సీబీఐ చార్జిషీట్‌లో

ప్రస్తావించిన రోజు నుంచి.. దానిని సమర్ధిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను తప్పుపట్టే వరకూ రఘురామ చేస్తున్న విమర్శలు పరిశీలిస్తే, ఆయన ఈ కేసుపై మరింత లోతులకు వెళ్లి, జగన్ సర్కారుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది.

బహుశా అందులో భాగంగానే.. ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ, ద ర్యాప్తు సంస్థగానీ ప్రస్తావించని ఓ మహిళ పాత్రను వ్యూహాత్మకంగానే తెరపైకి తెచ్చినట్లు అర్ధమవుతోంది. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ఎలాగూ శివగామి పాత్రను తెరపైకి తీసుకువచ్చారు కాబట్టి, సహజంగా వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులు.. వారికి దన్నుగా నిలిచే మీడియా సంస్థలు, ఇకపై ఎవరా శివగామి? ఏమా కథ? ఆ పాత్ర సంగతి నిగ్గుతేల్చాలని ప్రశ్నలు-డిమాండ్ల వర్షం కురిపించడం ద్వారా, వివేకానంద హత్య కేసును కొత్త మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply