Suryaa.co.in

Andhra Pradesh

డిక్లరేషన్ ఎందుకివ్వాలి?

– నా మతం మానవత్వం.. ఇదే నా డిక్లరేషన్‌
– శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రేమిస్తాను. గౌరవిస్తాను
– ఇప్పుడు నేను వెళ్తే బాబు ఆశించినట్లు టాపిక్‌ డైవర్ట్‌
– ఆ ఉద్దేశంతోనే నా పర్యటనను వాయిదా వేసుకున్నా
– బీజేపీ వారిలో అసలు సిన్సియారిటీ ఉందా?
– హిందుత్వానికి తామే టార్చ్‌ బేరర్స్‌ అని చెబుతారు
– ఇంత ఘోరం చేసిన చంద్రబాబును ఎలా ఉపేక్షిస్తున్నారు?
– అయినా ఎందుకు బుద్ధి చెప్పడం లేదు? మందలించడం లేదు?
– చేసింది మన వాడే అనుకుని వదిలేస్తే.. ఏ మెసేజ్‌ ఇస్తున్నట్లు?
– తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం నా రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకుంటున్నారు. అందుకే ఇది రాక్షస రాజ్యం.

ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? ఒకవైపున ఏమో, నన్ను వెళ్లనీయకుండా, వైయస్సార్‌సీపీ శ్రేణులు వెళ్లకుండా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపున టీవీల్లో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వానికి తెలుసో? లేదో?

వేల మంది పోలీసులను మొహరించారు. ఎందుకంతగా టాపిక్‌ డైవర్ట్‌ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు? టాపిక్‌ డైవర్షన్‌ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?.

తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తున్నాయి. ఒకసారి వాటికి సంబంధించిన అన్ని విషయాలు చెబుతాను. చంద్రబాబు అనే వ్యక్తి ఏ రకంగా అబద్దాలు చెప్పి, రెక్కలు కట్టాడనేది ఆధారాలతో చూపిస్తా.

తిరుమలలో లడ్డూల కోసం నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకోసారి రొటీన్‌గా, దశాబ్ధాలుగా జరుగుతోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ–టెండర్‌ పిలుస్తారు. అర్హులు బిడ్‌ వేస్తారు. ఇప్పుడు కొత్తగా నియమాలు పెట్టలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తిరుపతి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ టేస్ట్‌ మరెక్కడా ఉండదు. ఆరు నెలలకోసారి ఈ–టెండర్‌. బిడ్లు వేస్తే, ఎల్‌–1 గా వచ్చిన వారికి టెండర్‌ ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు.

టీటీడీ బోర్డు ఒక ప్రసిద్ధి గాంచిన బోర్డు. అందులో సభ్యుల కోసం కేంద్ర మంత్రులు, చుట్టుపక్కల రాష్ట్రాల సీఎంలు కూడా రికమెండ్‌ చేస్తారు. వారి వారి రాష్ట్రాల్లో ప్రముఖులను సిఫార్సు చేస్తారు. అంత మంచి లక్షణాలు ఉన్న వారితో బోర్డు ఏర్పాటవుతుంది. వారంతా ప్రసిద్ధి పొందిన వారు. దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. చెడు చేయాలన్నా చేయబోరు.

అక్కడ నెయ్యి సరఫరా కోసం ఆరు నెలలకోసారి ఈ–టెండర్లు పిలుస్తారు. ఎల్‌–1గా వచ్చిన వారికి కూడా పూర్తి టెండర్‌ ఖరారు చేయరు. 65 శాతం వారికిచ్చి, మిగతా వారిని కూడా రేటు తగ్గించమని చెప్పి, వారికి టెండర్‌ ఇస్తారు.

తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కూడా రొబస్ట్‌ (ధృఢమైన) విధానం ఉంటుంది. నెయ్యి సరఫరా చేసేవారు, ప్రతి ట్యాంకర్‌తో ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌) సర్టిఫై చేసిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ తీసుకొస్తారు. అలా వచ్చిన నెయ్యిని కూడా ప్రతి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్‌ అయితేనే, ట్యాంకర్‌ను ముందుకు పంపుతారు. ఒక్క టెస్టు ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కు పంపిస్తారు.

చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 14 నుంచి 15 ట్యాంకర్లు అలా వెనక్కు పోయారు. అంటే ఎవరూ తప్పు చేయని విధంగా అక్కడ రొబస్ట్‌ విధానం ఉంది. మా ప్రభుత్వ హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. ఏ సరుకైనా సరే, క్వాలిటీ టెస్టులో ఫెయిల్‌ అయితే వెనక్కు పంపిస్తారు.

ఇప్పుడు కూడా అదే జరిగింది. టీటీడీ ట్రస్ట్‌ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్‌ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే, అప్పటికే చంద్రబాబుగారి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. అలా జూన్‌ 12, జూన్‌ 21, జూన్‌ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్‌ అయి, ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు.

ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి, టీటీడీ టెస్టుల్లో ఫెయిల్‌ కావడంతో, వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. మరోసారి ఆ శాంపిల్స్‌ పరీక్ష కోసం మామూలుగా మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌)కి పంపారు.

ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్‌పై ఎన్‌డీడీబీ వారు జూలై 23న రిపోర్ట్‌ పంపారు. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చారు.

ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా, రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న, చంద్రబాబు ఆ నెయ్యిని వాడారని ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు? ఇప్పుడు ఒకసారి, చంద్రబాబు నియమించిన టీటీడీ ఈఓ, ఆ నెయ్యి నాణ్యత గురించి జూలై 23న ఏమన్నారో చూద్దాం అంటూ.. ఆ వీడియో చూపారు.

ఆ రెండు ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశాం. షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్‌ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్‌ క్లియర్‌గా ఈఓ చెప్పినా.. రెండు నెలల తర్వాత చంద్రబాబు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారో చూడండి.. అంటూ ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు.

ఘీకి బదులు జంతువుల కొవ్వు వాడారని, లడ్డూలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని అన్నీ తెలిసినా, చంద్రబాబు అబద్దాలు చెప్పారు.

చంద్రబాబు సెప్టెంబరు 18న ఆ ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే.. అంటే సెప్టెంబరు 19న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు.

ఆ వెంటనే, మర్నాడు, అంటే సెప్టెంబరు 20 టీటీడీ ఈఓ మళ్లీ ఏం మాట్లాడాడో చూద్దాం.. అంటూ వీడియో ప్రదర్శించారు. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. అంతే కాకుండా, సెప్టెంబరు 22న ఈఓ, తాను స్వయంగా సంతకం చేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు.

కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కు పంపాం. ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చామని.. తమకు ఎన్‌డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. అయినా దాన్ని, అంతకు ముందే తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు.

మళ్లీ సెప్టెంబరు 22న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, అవే పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను, శ్రీ వెంకటేశ్వరస్వామివారి ప్రసాద పేరు ప్రఖ్యాతలను, ఈ మాదిరిగా అబద్దాలతో తగ్గించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం.. అపవిత్రత కాదా?.

పోనీ.. ఆ ఎన్‌డీడీబీ రిపోర్టు అయినా కచ్చితమైందా? అని చూస్తే, ఆ రిపోర్టులో వాళ్లే డిస్‌క్లెయిమర్‌ రాశారు. ‘నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్‌ వాల్యూ కన్నా.. శాంపిల్స్‌లోని స్టాండర్డ్‌ వాల్యూస్‌లో డీవియేషన్స్‌ ఉన్నాయి. అయినా, ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్‌ పాజిటివ్‌ ఫలితం కూడా రావొచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. అంటూ.. పాల సేకరణ, ఆవులు, వాటి దాణ గురించి ప్రస్తావించారు. అలాగే ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని రాశారు’.

ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని అబద్దాలు ఆడుతూ, తిరుమల వెంకటేశ్వరస్వామివారి విశిష్టతను, ప్రసాదాల పవిత్రతను దగ్గరుండి, కావాలని అబద్దాలు చెప్పి, అనుమానపు బీజాలు ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరిలో లేపడం దుర్మార్గం కాదా? అపవిత్రం కాదా?

నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నావు. స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తున్నావు. జరగనిది జరిగినట్లుగా, జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేసినట్లుగా ఒక అబద్దాన్ని ప్రచారం చేస్తున్నావు. ధర్మమేనా?.

నందిని బ్రాండ్‌ ఎందుకు వాడడం లేదని అంటున్నారు. మరి చంద్రబాబు పాలన సమయంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్‌కు చెందిన నందిని బ్రాండ్‌ నెయ్యి ఎందుకు లేదు? అప్పుడు కూడా టెండర్లు పిల్చారు కదా? నందిని వాళ్లు ఇష్టం వచ్చినప్పుడే టెండర్లలో పాల్గొంటారు.

ఇంకొకరు అంటారు. రూ.320కి కిలో నెయ్యి ఎలా వస్తుందని అంటారు. మరి చంద్రబాబు కూడా 2014–19 మధ్య నెయ్యిని ఏ ధరకు సేకరించారు? ఇప్పుడు కూడా అదే క్వాలిటీ నెయ్యి కదా? దశాబ్దాలుగా అదే క్వాలిటీ. అదే నెయ్యి. మరి చంద్రబాబు హయాంలో 2015లో కిలో నెయ్యిని రూ.276కి కొన్నారు. అదే 2019 జనవరిలో కిలో ఆవు నెయ్యిని రూ.324కు కొన్నారు. మరి ఇక్కడ రూ.320కి కొంటే తప్పేం జరిగింది?.

మీ హయాం అంతా అవే రేట్లకు కొన్నారు. మరి ఇప్పుడు కూడా అవే ధరలు. చంద్రబాబు తన హెరిటేజ్‌ డెయిరీ కోసం, పాలు కార్టల్‌ ఫామ్‌ చేసి, నెయ్యి రేట్లు పెంచేసి, ఆ కార్టల్‌లో చంద్రబాబునాయుడు, హెరిటేజ్‌ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో, కొత్తగా రేట్లు పెంచడం కోసం మాట్లాడుతున్నాడు. అదే క్వాలిటీ నెయ్యి. అవే స్పెఫికేషన్స్‌.

టాపిక్‌ డైవర్షన్‌ కోసం డిక్లరేషన్‌ అంటున్నాడు. జగన్‌ ఏమైనా కొత్తనా? రాజశేఖర్‌రెడ్డి కొత్తనా? ఆయన ఏమిటో తెలియదా? నా మతం ఏమిటో రాష్ట్రంలో కానీ, దేశంలో తెలియదా? నా కులం ఏమిటో తెలియదా? రాజశేఖర్‌రెడ్డి సీఎంగా 5 ఏళ్లు వరసగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా?

నేను గతంలో చాలాసార్లు వెళ్లాను కదా? సీఎం కాక ముందు కూడా వెళ్లాను కదా? అంతెందుకు నా పాదయాత్ర మొదలుపెట్టే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నాను. 3648 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా, తిరుపతి నుంచి కొండ ఎక్కాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లాను. అప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం. నేను ప్రతిపక్ష నాయకుడిని. రెండుసార్లు స్వామివారిని దర్శించుకున్నాను కదా?

ఆ తర్వాత సీఎంగా వరసగా 5 ఏళ్లు, స్వామివారికి భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాను కదా? తొలిసారి ఎవరైనా వెళ్తుంటే, ఇలా అడగొచ్చు. కానీ 10, 11 సార్లు పోయిన తర్వాత, ఈరోజు నేను తిరుపతి వెళ్తానంటే. అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటి?. డిక్లరేషన్‌ అడగడం ఏమిటి? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు నోటీసులు పంపడం ఏమిటి? ముఖ్యమంత్రిగా పని చేశాను. 5 ఏళ్లు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను. ఎన్నోసార్లు స్వామి వారిని దర్శించుకున్నాను.

ఈరోజు నేను వెళ్లకూడదట. కారణం నా మతం అంటున్నారు. అసలు నా మతం ఏమిటని అడుగుతున్నాను. నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతాను. తప్పేముంది? బయటకు పోతే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను. గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను. గౌరవిస్తాను. సిక్కిజమ్‌ను అనుసరిస్తాను. గౌరవిస్తాను. నా మతం ఏమిటి అంటున్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకుంటారేమో రాసుకొండి. దేశ రాజ్యాంగంలో ఏం చెప్పారు. నేను చదువుతాను వినండి.

‘ఇండియా ఈజ్‌ ఎ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌’.
సెక్యులర్‌ అంటే అర్ధం తెలుసా? నీ మతం చెప్పకపోతే గుడిలోకి రావొద్దు అంటున్నావు. ఇది సెక్యులర్‌ దేశం అంటున్నాం. సీఎంగా పని చేసిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే, దళితుల పరిస్థితి ఏమిటి? దళితులను గుడిలోకి పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తాం?

మతం పేరుతో రాజకీయం చేయడం ఎంత దౌర్భాగ్యం? బీజేపీని అడుగుతున్నాను. తామే హిందుత్వానికి ప్రతినిధులం అంటారు. మిమ్మల్నే అడుగుతున్నాను. మీ కళ్ల ఎదుటే, మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే, శ్రీ వెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుపతి లడ్డూ పేరు ప్రఖ్యాతలను, స్వామి వారి వైభవాన్ని, దగ్గరుండి అబద్ధాలు చెబతూ, జంతువుల కొవ్వు వాడకపోయినా, వాడి లడ్డూలు తయారు చేసినట్లుగా. ఇన్ని ఆధారాలతో సహా, రుజువు అవుతున్నా. అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, వెంకటేశ్వరస్వామివారిని అపవిత్రం చేసిన ఈ వ్యక్తిని ఎందుకు మందలించడం లేదు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు?

అంటే మీ వాళ్లు ఏం చేసినా ఫరవాలేదు. మిగిలిన వారు ఏం చేసినా తప్పే? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదెక్కడి హిందుత్వం?. హిందుత్వానికి మీకు టార్చ్‌ బేరర్స్‌ అంటారు. అందరూ ఆలోచించండి. నిజంగా హిందుత్వం ఏమిటంటే, మానవత్వం చూపడమే. అలా మానవత్వాన్ని చూపలేని వారు మంచి హిందువును అని చెప్పుకోలేరు.

చంద్రబాబునాయుడే తప్పు చేస్తాడు. ఆయనే సిట్‌ వేస్తాడు. ఆయన చెప్పుచేతుల్లో ఉన్న అధికారులతో సిట్‌ అంటాడు. ఇదెక్కడి ధర్మం? ఇదెక్కడి పద్ధతి?. చంద్రబాబు ఈ మాదిరిగా హిందూ ధర్మం మీద దుష్ప్రచారం చేస్తూ, రాజకీయం చేయడం ధర్మమేనా? ఆలోచించండి. నేను గుడికి వెళ్లకపోయినా ఫరవాలేదు. కానీ, చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరపున మీమీ ఊళ్లలో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు. చంద్రబాబు అని వేడుకొండి. అందుకే ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా, చంద్రబాబుపై చూపమని వేడుకొమ్మని కోరుతున్నాను.

అందుకే నా పర్యటన వాయిదా
ఈ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్లి, టాపిక్‌ డైవర్ట్‌ చేయడం ఇష్టం లేక, వెంకటేశ్వరస్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా, టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదనే ఉద్దేశంతో.. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని అబద్దాలతో, అవమానించి, అగౌరవపర్చాడో.. లడ్డూపై దుష్ప్రచారం చేశాడో.. చేసిన తప్పు ఆధారాలతోసహా కనిపిస్తున్న ఈ సత్యం బయటకు రావాలి.

రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌సీపీ అభిమానులే కాదు, ప్రజలందరిని కోరుతున్నాను. చంద్రబాబు చేసిన పాపం వల్ల, వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి.

ఏ మెస్సేజ్‌ ఇస్తున్నారు?
బీజేపీవారిలో సిన్సియారిటీ ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబును రిప్రిమాండ్‌ చేయకుండా, టీటీడీ పేరు ప్రఖ్యాతలు మంట కలిపిన ఈ వ్యక్తిని ఎలా ఉపేక్షిస్తున్నారు? ఎందుకు బుద్ధి చెప్పడం లేదు? ఎందుకు మందలించడం లేదు? చేసింది మన వాడే అనుకుని వదిలేస్తే.. ఏ మెసేజ్‌ ఇస్తున్నట్లు?

మళ్లీ ఘోరమైన తప్పులు జరగొద్దు. అందుకు చంద్రబాబుకు తిట్లు పడాలి. మతాన్ని, దేవుణ్ని రాజకీయాల్లోకి తీసుకురాకుండా, ఆయనను మందలించాలి. సుప్రీంకోర్టు నుంచి ప్రధాని నుంచి పడాలి. అప్పుడైనా ఈ మనిషికి జ్ఞానం కలుగుతుందని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE