– రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖం ని అద్దంలో చూసుకోవాలి
– కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు ?
– రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కి నోటీసులు
– కాళేశ్వరం పంప్ హౌజ్ ల పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమినషన్ ఎందుకు పిలవడం లేదు ?
– బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి
– కాళేశ్వరానికి చిన్న పగుళ్లు ఏర్పడితేనే రంగంలోకి దిగిన ఎన్డీఎస్ఏ… ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోతే ఎందుకు స్పందించడం లేదు ?
– బనకచర్ల ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదు?
– బనకచర్లను వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలి
– కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ మహా దీక్షలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారని గుర్తు చేశారు. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని ధ్వజమెత్తారు. 90 శాతం పంప్ హౌజ్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు జారీ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని స్పష్టం చేశారు.
తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ? తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ కాదు… అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కమిషన్ పై మాకు నమ్మకం ఉన్నది… కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసము లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం నాడు ఇందిరా పార్కు వద్ద మహా ధర్న జరిగింది. ప్రజలు, జాగృతి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్న మహా ధర్నాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రసంగించారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… “కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదు. ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చు. కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చు. కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం… ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది. 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం.
మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు. కేసీఆర్ గారిది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదు. తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం” అని వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని అడిగారు. గోదావరి – పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయమని అన్నారు.
బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలని తెలిపారు. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు.
కాగా, “ఎస్సారెస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టింది. నెహ్రు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ కు ఎన్టీఆర్ మరమ్మత్తులు చేయించారు. కాంగ్రెస్ కట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టును కొట్టుకుపోతే కెసిఆర్ బాగు చేయించారు. కాంగ్రెస్ నిర్మించిన పులిచింతల గేట్లు కొట్టుకుపోయినయ్. కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పలిగిపోయాయి. ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెడితే ప్రపంచం ముందు పరువు పోయేలా తనెల్ కూలిపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖం ని అద్దంలో చూసుకోవాలి. ఎస్ ఎల్ బి సి టనల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? కాంగ్రెస్ బిజెపి పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమైంది” అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం లేకపోతే 35 శాతం తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉందని కాబట్టి తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మనమత్తులు చేపట్టి పొలాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే 99% పనులు పూర్తయ్యాయని, మిగతా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, కాబట్టి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని బిజెపిని డిమాండ్ చేశారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే దాదాపు 80000 కోట్ల వ్యయంతో అని, మరి లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగినట్లు ? అని అడిగారు..
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు దాస్యం విజయభాస్కర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు, యువజన రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్, మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి, విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్, జాగృతి నాయకులు అప్పాల నరేందర్ యాదవ్, జాగృతి ఇటలి అధ్యక్షుడు తానింకి కిషోర్ యాదవ్, పబ్బోజు విజేందర్, ఈగ సంతోష్, అర్చన సేనాపతి, మాడ హరీశ్ రెడ్డి, లలిత యాదవ్, పరకాల మనోజ్ గౌడ్, మహేందర్ ముదిరాజ్, యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్, కో ఆర్డినేటర్ ఆలకుంట హరి, యూపీఎఫ్ కో కన్వీనర్లు ఆర్ వి మహేందర్, కోల శ్రీనివాస్, నరహరి, విజయేంద్ర సాగర్, ఏల్చల దత్తాత్రేయ, గొరిగే నరసింహ, టి నరేష్ కుమార్, డి కుమార స్వామి, కే ప్రవీణ్, రాచమల్ల బాలకృష్ణ, మురళి కృష్ణ, సల్వా చారిలు పాల్గొన్నారు