– నాదీ బాధ్యత అని చెప్పి, ఇప్పుడు తప్పించుకుంటే ఎలా?
సూపర్‌సిక్స్ అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమన్నారు
– మరి ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో లోకేష్ చెప్పాలి
– ఫీజులు, స్కాలర్‌షిప్స్ బకాయిలు రూ.3900 కోట్లు
– ఫిబ్రవరి 5వ తేదీలోగా ఆ బకాయిలన్నీ చెల్లించాలి
– హామీలు అమలు చేతకాక పోతే దిగిపొండి
– రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ ఆరోపణ
– అయినా సూపర్‌సిక్స్ అమలు చేస్తామని ప్రకటన
– అలాంటప్పుడు హామీలు ఎందుకు అమలు చేయలేరు?
– చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్‌కె రోజా
నగరి: ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు గుప్పించి, ఆ తర్వాత ఏదీ అమలు చేయని సీఎం చంద్రబాబు.. బాబు షూరిటీ చీటింగ్ గ్యారెంటీగా మారారని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆక్షేపించారు. సూపర్‌సిక్స్ అమలు చేయకపోతే, కాలర్ పట్టుకోవాలన్న నారా లోకేష్, ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె.. ఫీజులు, స్కాలర్‌షిప్ కింద ప్రభుత్వం రూ.3900 కోట్లు బకాయి పడిందని చెప్పారు. ఈనెల 5లోగా ఆ మొత్తం చెల్లించకపోతే, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని నగరిలో మీడియాతో మాట్లాడిన రోజా వెల్లడించారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు.
ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే సూపర్‌సిక్స్ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్ర వాస్తవ అప్పులు రూ.4.6 లక్షల కోట్లు అని ప్రభుత్వమే తేల్చింది. మరి అలాంటప్పుడు సూపర్‌సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు? ఇది కచ్చితంగా సీఎం చంద్రబాబు అసమర్థతే. లోకేష్ కాలర్ పట్టుకుంటే తప్ప పథకాలు అమలు కావా?. ఇంత జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? అన్నింటికీ తన బాధ్యత అని చెప్పిన ఆయన, ఇప్పుడు తప్పించుకుంటే ఎలా?.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజులు, స్కాలర్‌షిప్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. పెండింగ్‌లో పెట్టిన రూ.3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అందుకు ఫిబ్రవరి 5 డెడ్‌లైన్. ఆలోగా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు, స్కాలర్‌షిప్ చెల్లించకపోతే, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. విద్యార్థులకు అండగా నిలిచి పోరాడుతాం.
విద్యార్థుల ఫీజు (విద్యాదీవెన) కింద రూ.2800 కోట్లు, స్కాలర్‌షిప్ (వసతిదీవెన) కింద మరో రూ.1100 కోట్లు.. రెండూ కలిపి మొత్తం రూ.3900 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది.
ఆదాయం పెరిగితేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? హామీల అమలుకు బాధ్యత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఎక్కడున్నారు. లోకేష్ కాలర్ పట్టుకుంటే తప్ప పథకాలు అమలు కావా?
బటన్ నొక్కడం పెద్ద విషయమా.. మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని అవహేళనగా మాట్లాడిన చంద్రబాబు, అంత తేలికైన విషయమైతే ఇప్పుడెందుకు నొక్కలేకపోతున్నారు? హామీలు అమలు చేయడం చేతకాకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి వెంటనే పదవులకు రాజీనామా చేసి దిగిపోవాలి.
ఇకనైనా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం (అమ్మ ఒడి), నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ పథకాలు.. ఎప్పుడు, ఎవరు అమలు చేస్తారో.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చెప్పాలి. హామీల అమలుపై చంద్రబాబుని ప్రశ్నించడానికి పవన్‌కళ్యాణ్‌కు ఏం అడ్డం వచ్చింది?
అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి, ఇప్పుడు నిస్సిగ్గుగా చేతులెత్తేసిన చంద్రబాబు, అర్ధం లేని ఆరోపణలు, విమర్శలతో నిత్యం జగన్‌ని నిందిస్తున్నారు.