Suryaa.co.in

Political News

తాడేపల్లి నుండి విశాఖకు “కాపురం” ఎందుకో?

మూడు రాజధానుల విధ్వంసకర విధానంతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఐదేళ్ళ పాటు ఆపగలిగారు. కానీ, తన ఆటలు సాగలేదు. కనీసం ఎన్నికలకు ముందు కొద్ది రోజులైనా, అధికార దర్పంతో, విశాఖ సముద్రతీరంలో కాపురముండాలని, రాజకీయంగా, బహుశా ఆర్థికంగా కూడా లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి ఉవ్విళ్ళూరుతున్నట్లుంది.

ఉత్తరాంధ్ర ప్రజలను వరుస ప్రకటనలతో ఊరించాలనుకొంటుంటే జగన్మోహన్ రెడ్డికి ఛీత్కారం ఎదురవుతున్నది. డిసెంబరులోపు విశాఖకు మకాం మార్చబోతున్నానంటూ మరొకసారి ప్రకటన చేశారు. ఎందుకొస్తున్నట్లోనని ఉత్తరాంధ్ర ప్రజల్లో పలు సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి.

వెనుకబడ్డ ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులను రాత్రింబవళ్ళు సమీక్షించడానికే మందీ మార్బలంతో తరలివస్తున్నానంటూ ఏకంగా జీ.ఓ.లు విడుదల చేశారు. తనకు, మంత్రులకు, ఉన్నతాధికారులకు “క్యాంప్” ఆఫీసులు మరియు నివాసం కోసం విలాసవంతమైన భవన సముదాయాల కోసం ఐదు వందల కోట్లకుపైగా ప్రజాధనం వెచ్చిస్తున్నారని వార్తలొచ్చాయి.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులపై ఐదేళ్ళ కాలంలో ఐదు వందల కోట్లు కూడా ఖర్చు చేయని జగన్ ఏ అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి తాడేపల్లి “క్యాంప్” కార్యాలయాన్ని ఖాళీచేసి విశాఖలో “క్యాంప్” కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో!

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని మోడీ ప్రభుత్వం ఎగ్గొడితే నోరు మెదపలేదు. విశాఖ ఉక్కును వందకు వంద శాతం ప్రయివేటీకరిస్తామంటే మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలేదు. పైపెచ్చు, గంగవరం ఓడరేవులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఆదానికి అమ్మేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడే ఒక్క పథకాన్ని అమలు చేశారా! అంటే సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది.

మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ ఈ డ్రామాలను ఉత్తరాంధ్ర ప్రజలు హర్షిస్తారా! అధికార దుర్వినియోగంలో జగన్మోహన్ రెడ్డి, తన రికార్డులను తానే బద్దలుకొడుతున్నారు.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE